త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oil Palm | ఆయిల్‌పామ్‌తో రైతులకు సిరుల‌పంట : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Oil Palm | ఖమ్మం జిల్లా రైతులకు ఆయిల్‌పామ్‌ సాగు స్థిరమైన ఆదాయాన్ని అందించే అవకాశమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న ఖమ్మంలో రైతుల ఆదాయం పెంచేందుకు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

P

Telangana | Published On Jul 20, 2026, 8.11 pm IST

Oil Palm | ఆయిల్‌పామ్‌తో రైతులకు సిరుల‌పంట : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Advertisement

Oil Palm | ఖమ్మం జిల్లా రైతులకు ఆయిల్‌పామ్‌ సాగు స్థిరమైన ఆదాయాన్ని అందించే అవకాశమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న ఖమ్మంలో రైతుల ఆదాయం పెంచేందుకు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో దాదాపు రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గోద్రెజ్‌ ఇంటిగ్రేటెడ్‌ పామ్‌ ఆయిల్‌ పరిశ్రమను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గోద్రెజ్‌ ప్రతినిధులతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయమేన‌న్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో పలు పరిశ్రమలు ఉన్నప్పటికీ, జిల్లాల పునర్విభజన తర్వాత వ్యవసాయంపైనే ఆధారపడాల్సి వచ్చిందన్నారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ, పాలేరు, వైరా జలాశయాల ఆధారంగా సాగు జరుగుతోందని చెప్పారు.

కరువు, ఎల్‌నినో వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులకు ఆదాయం అందించే పంటగా ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సాగుకు ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.45 వేల వరకు సబ్సిడీ అందిస్తోందన్నారు. దేశానికి ఏటా దాదాపు 25 లక్షల మెట్రిక్‌ టన్నుల పామాయిల్‌ అవసరం కాగా, ప్రస్తుతం 12 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు మాత్రమే ఉత్పత్తి అవుతోందని భట్టి తెలిపారు. దీంతో భారీగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని, దేశీయంగా ఉత్పత్తి పెరిగితే రైతులతో పాటు ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. 1991–92లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అప్పట్లో నిర్వహించిన సర్వేల్లో అశ్వారావుపేట, సత్తుపల్లి ప్రాంతాలు ఆయిల్‌పామ్‌కు అనుకూలంగా ఉన్న‌ట్లు గుర్తించామ‌న‌నారు.

దేశంలో సుమారు 70 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం 15 లక్షల ఎకరాల్లోనే సాగు జరుగుతోందన్నారు. తెలంగాణలో 1991–92లో ప్రారంభమైన సాగు ప్రస్తుతం దాదాపు 3 లక్షల ఎకరాలకు విస్తరించిందని చెప్పారు. ఆయిల్‌పామ్‌ గెలల ధర పెరుగుతున్న తీరును ప్రస్తావిస్తూ.. 2023లో టన్నుకు రూ.12,500గా ఉన్న ఫ్రెష్‌ ఫ్రూట్‌ బంచ్‌ ధర ప్రస్తుతం దాదాపు రూ.23 వేల వరకు చేరిందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంజనాపురంలో ప్రారంభించిన పరిశ్రమ ఖమ్మం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, దీనికి అనుబంధంగా మరిన్ని పరిశ్రమలు ఏర్పడి ఈ ప్రాంతం అగ్రో ఇండస్ట్రీ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమకు రహదారి సౌకర్యం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తిపై ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ద్వారా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కొణిజర్ల భవిష్యత్తులో మలేషియా, ఇండోనేషియా నుంచి విత్తనాలు దిగుమతి చేసుకునే ప్రాంతం కాకుండా దేశానికి నాణ్యమైన ఆయిల్‌పామ్‌ విత్తనాలు అందించే కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. దాదాపు 113 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టులో పరిశోధన, విత్తన జన్యు అభివృద్ధి, సీడ్‌ గార్డెన్లు, నర్సరీలు, మిల్లింగ్‌, రిఫైనింగ్‌ వంటి విభాగాలు ఉంటాయని తెలిపారు. రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా వాణిజ్య పంటలు, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల వైపు అడుగులు వేయాలని భట్టి కోరారు. రైతుల సంక్షేమానికి ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతు భరోసా పథకం కింద తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు గుర్తు చేశారు.

Advertisement
Advertisement