Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
Operation Polo | దేశంలో అప్పటికే ఉన్న అన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనమైనా.. హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వతంత్రంగానే ఉంటుందని నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రకటించారు. దీంతో జునాగఢ్, కశ్మీర్ లాంటి ముస్లిం పాలకుల సంస్ఠానాలు విలీనమైనా.. హైదరాబాద్ విలీనం మాత్రం ఆగిపోయింది. 1947 భారత దేశ స్వాతంత్ర్య చట్టం ప్రకారం సంస్థానాలకు స్వతంత్రంగా కొనసాగే స్వేచ్ఛ ఉంది. దీన్ని అడ్డం పెట్టుకొని.. మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు నిరాకరించాడు.
సంక్షిప్త సారాంశం
పట్టపగలే హత్యలు. రాత్రైతే కర్ఫ్యూ వాతావరణం. ఆడవాళ్లు బయటికి వెళ్లడమే ఓ సాహసం. సాయంత్రం ఆరు దాటితే ఊళ్లల్లో తలుపులన్నీ మూసుకునేవి. అర్ధరాత్రి బూటు శబ్దం వినపడినా ఉలికిపాటు. తలుపు తట్టిన శబ్దం వినిపిస్తే .. పై ప్రాణాలు పైనే పోయేవి. బయటికి వెళ్లిన వాడు ఇంటికి తిరిగొచ్చేదాకా నమ్మకం లేదు.నిజాం మిలటరీ తుపాకీలకు..రజాకార్ బాంబులకు మధ్య నలిగిపోయి.. హైదరాబాద్ సంస్థానం ప్రతి క్షణం బిక్కుబిక్కుమంటూ గడిపింది. స్వాతంత్ర్యం వచ్చిన 3 నెలల్లోపే 561 సంస్ధానాలన్నీ భారతదేశంలో విలీనం అయినా.. విలీనానికి ఒప్పుకోని ఆ ఒక్క సంస్థానం కథే.. హైదరాబాద్ విలీనం. 78 ఏళ్ల తర్వాత మరోసారి మన గతంలోకి తొంగి చూసుకునే ప్రయత్నమిది.
సంక్షోభానికి తెరదించిన
ఆపరేషన్ పోలో
నిజాం పట్టుదలను నిలువరించిన
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్
సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్వాధీనం
మరుసటి రోజు నగర వీధుల్లో
సైన్యం జైత్రయాత్ర
Operation Polo | త్రినేత్ర.న్యూస్ : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి 562 సంస్థానాలు ఉండేవి. ఈ సంస్థానాలు భారత దేశంలో విలీనం అయ్యేందుకు అనుకూలంగా.. 'ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్'పేరిట ఒక ప్రత్యేకంగా రూపొందించిన ఒప్పందం ముసాయిదాను అన్ని సంస్థానాలకు పంపారు. ఈ ఒప్పందానికి దాదాపుగా అన్ని సంస్థానాలు అంగీకరించినా.. బరోడా, భోపాల్, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, జోధ్ పూర్, జునాగఢ్, మణిపూర్, ట్రావెన్ కోర్ - కొచ్చిన్ లు మాత్రం.. వెంటనే ఒప్పుకోలేదు. నాటి ఉప ప్రధాని, హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని చర్చలు జరపడంతో జోథ్ పూర్, జైసల్మేర్, బికనీర్, పాటియాలా, బరోడా, భోపాల్, తిరువాన్కూర్ సంస్థానాధీశులు కొన్ని షరతులతో భారత్ యూనియన్ లో విలీనం చేసేందుకు ఒప్పుకున్నారు. కానీ జునాగఢ్, కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు మాత్రం స్వతంత్రంగా ఉండేందుకు ఒప్పుకున్నాయి. సైనిక చర్యలకు ఉపక్రమించి జునాగఢ్ ను 1947 సెప్టెంబరులో, కశ్మీర్ ను 1947 అక్టోబర్ 26న భారత దేశంలో విలీనం చేయగలిగారు.
హైదరాబాద్.. ఒక ప్రత్యేక దేశం
దేశంలో అప్పటికే ఉన్న అన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనమైనా.. హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వతంత్రంగానే ఉంటుందని నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రకటించారు. దీంతో జునాగఢ్, కశ్మీర్ లాంటి ముస్లిం పాలకుల సంస్ఠానాలు విలీనమైనా.. హైదరాబాద్ విలీనం మాత్రం ఆగిపోయింది. 1947 భారత దేశ స్వాతంత్ర్య చట్టం ప్రకారం సంస్థానాలకు స్వతంత్రంగా కొనసాగే స్వేచ్ఛ ఉంది. దీన్ని అడ్డం పెట్టుకొని.. మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో భారతదేశానికి పూర్వం హైదరాబాద్ రాజ్యం బ్రిటిష్ ప్రభుత్వంతో ఏ విధమైన సంబంధాలను కలిగి ఉందో.. అలాంటి సంబంధాలనే నిజాం రాజ్యం.. భారతదేశంతో కొనసాగిస్తామనే ఒప్పందం కొనసాగింది. దీని ప్రకారం.. హైదరాబాద్ రాజ్యం తన ఏజెంట్ ను ఢిల్లీలో నియమించింది. భారత దేశంల కూడా తన ఏజెంట్ గా కేఎం మున్షీని హైదరాబాద్ లో నియమించింది. నాటి భారతదేశ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్, హైదరాబాద్ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ల సమక్షంలో .. 1947 నవంబరు 29న సంతకాలు జరిగాయి. ఏడాది పాటు ఇలాగే కొనసాగించి.. ఆ తర్వాత ప్రజా సేకరణ ద్వారా హైదరాబాద్ భవిష్యత్తును నిర్ణయించేలా ఒప్పందం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ ను పాకిస్థాన్ లో విలీనం చేయకూడదనే షరతు కూడా అందులో ఉంది.
గాంధీ మరణం..పటేల్ కు గుండెపోటు..
స్వతంత్ర హైదరాబాద్ కోసం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేయని ప్రయత్నం లేదు. 1948 జనవరిలో గాంధీ చనిపోవడం.. వల్లభ్ భాయ్ పటేల్ కు గుండెపోటు రావడంతో.. మీర్ ఉస్మాన్ అలీఖాన్ కు చాలా ధైర్యం వచ్చింది. యథాతథ ఒప్పందం చేసుకున్న తర్వాత మీర్ ఉస్మాన్ అలీఖాన్ కు తదుపరి వ్యూహం అమలు చేసుకునేందుకు ఓ ఏడాది పాటు సమయం దొరికినట్టైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ లో విలీనం చేయకూడదని నిజాం దృఢంగా సంకల్పించుకున్నాడు. రాజ్యాన్ని రక్షణ పరంగా బలోపేతం చేసుకునేందుకు ఆయుధ సంపత్తి వైపు దృష్టి సారించాడు. 10 కోట్లతో బ్రిటన్, ఇతర యూరోప్ దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేశాడు. ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ కాటన్ అనే స్మగ్లర్ తో ఆయుధాలు పొందేందుకు ఒప్పందం చేసుకున్నాడు. హైదరాబాద్ రాజ్యంలో భారత దేశ కరెన్సీ వినియోగాన్ని రద్దు చేశాడు. తన స్వతంత్ర హైదరాబాద్ దేశానికి మద్దతు పలకాలని కోరుతూ.. బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్, ప్రధాని క్లిమెంట్ అట్లీని కలిశాడు. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ సాయం కూడా కోరాడు. కానీ యథాతథ ఒప్పందం ఉన్నందున వారు ఇందులో జోక్యం చేసుకునేందుకు విముఖత చూపారు. ఇక లాభం లేదని తన రాజ్యాంగ సలహాదారుడైన వాల్టర్ మూరిక్టన్ ద్వారా .. 1948 ఆగస్టు 21న ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేయించాడు. హైదరాబాద్ రాజ్యంపై భారతదేశ పెత్తనం తగదంటూ విన్నవించాడు.
రజాకార్ల ప్రవేశం..

1947 ఆగస్టు 15 తర్వాత.. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అవుతుందేమోనని ఎదురుచూసిన వారికి చుక్కెదురైంది. దీంతో హైదరాబాద్ రాజ్యంలో ప్రజల నుంచి నిరసనలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరపున హైదరాబాద్ లో స్టేట్ కాంగ్రెస్, ఆర్య సమాజ్, హిందూ మహా సభ వంటి రాజకీయ సంస్థలు పోరాటాలు ప్రారంభించాయి. సరిగ్గా ఇదే సమయంలో.. మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లైమేన్తో (ఎంఐఎం) కు చెందిన రజకాకార్లు విజృంభించారు. ఎంఐఎం సంస్థను 1927లో స్థాపించారు.ముస్లింల ఏకీకరణే వీరి లక్ష్యం. రజాకార్లు..అంటే శాంతిని వాంఛించే స్వచ్ఛంద సేవకులు అని అర్థం. కానీ 1944లో ఎంఐఎం స్థాపకుడు బహదూర్ యార్ జంగ్ మరణించిన తర్వాత ఈ సంస్థ సయ్యద్ ఖాసీమ్ రిజ్వి చేతుల్లోకి వచ్చింది. ఈయన నేతృత్వంలోనే నిజాం రాజ్యంలో రజాకార్లు..అనే ప్రైవేటు సైన్యం తయారైంది. మరోపక్క రైతాంగం హక్కుల కోసం పోరాడుతున్న గ్రామీణ తెలంగాణలోని కమ్యూనిస్టుల నుంచి నిజాంకి ప్రతిఘటన ఎదురైంది. ఈ ప్రతిఘటన అతి తీవ్రమైన స్థాయిలో ఉండడంతో రజాకార్లు వారిపై ఒక దారుణమైన ఉగ్రదాడిని చేపట్టారు. గ్రామ గ్రామాల్లో తిరిగి వారు అనేక మంది హిందువులను ఊచకోత కోయడం, మహిళలపై అత్యాచారం చేయడం అపహరణలు జరపడం మొదలైనవి చేసారు. ఈ కాలంలో రజాకార్లు మరియు నిజాం పోలీసులు రెండు వేల మందిని హతమార్చారు అనేక వందల మంది మహిళలపై అత్యాచారాలు చేశారు.
బైరాన్ పల్లి..డోర్నకల్..పరకాల

తెలంగాణ సాయుధ పోరాటంలో భైరాన్ పల్లి లో అత్యంత విషాదం చోటు చేసుకున్నది. 1948 జూన్ నుంచి రజాకార్లు గ్రామంలోకి ప్రవేశించేందుకు చాలాసార్లు ప్రయత్నించినప్చారు. కానీ గ్రామస్తులందరూ సంఘటితమై.. వారి ప్రయత్నాలను తిప్పి కొట్టారు. అయితే ఆగస్టులో హైదరాబాద్ స్టేట్ పోలీసుల సహాయంతో రజాకార్లు మళ్లీ దాడి చేశారు. అప్పటికీ గ్రామస్తులు గడి లోపల దాక్కుని కొంతమంది రజాకార్లను హతమార్చగలిగారు. కానీ.. రజాకార్లు దాదాపు 118 మంది గ్రామస్తులను తుపాకులతో కాల్చి చంపారు. వరంగల్ జిల్లాలోని డోర్నకల్ మండలంలో పెరుమాండ్ల సంకీస గ్రామంలో 1948 సెప్టెంబర్ ఒకటో తేదీన 25 నుంచి 30 మంది రజాకార్లు గుర్రాలపై గ్రామంపై దాడి చేసి అనేక మందిని ఒక చోట చేర్చి, గ్రామస్తులను చిత్రవధలు పెట్టారు. ఒక వలయంలో వారిని నిలబెట్టి తుపాకులతో కాల్చి చంపారు.రజాకార్లను చూసి పారిపోయిన మహిళలు మొక్కజొన్న పొలాల్లో తలదాచుకుంటే రజాకార్లు వారిని వెంటాడి, వేటాడి పట్టుకుని, బాహాటంగా అత్యాచారాలు చేశారు.నాటి హైదరాబాద్ సంస్థానంలోని భాగమైన కర్ణాటకలోని బీదర్ జిల్లా గోరాట గ్రామంలో రజాకార్ కమాండర్ శంషుద్దీన్, గ్రామం పైన దాడి చేశాడు. జాతీయ పతాకాన్ని అక్కడ ఆవిష్కరించినప్పుడు ఈ దాడి జరిగింది. ఈ దాడిని ప్రతిఘటించిన గ్రామస్తులు షంషుద్దీన్ ని చంపివేశారు. 1948 మే 9వ తేదీన అందుకు ప్రతీకారంగా రజాకార్లు దాడి చేసి గోరాట గ్రామంలో దాదాపు 200 మందిని ఊచకోత కోశారు.వరంగల్ జిల్లా పరకాల లో ఎటువంటి సమావేశాలు జరపరాదని పోలీస్ నిషేధం విధించినప్పటికీ 1947 సెప్టెంబర్ రెండవ తేదీన సమీప గ్రామాల ప్రజలు 1500 మంది ఒకచోట గుమిగూడి భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులు, రజాకార్లు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 22 మంది మరణించారని 150 మంది తీవ్రంగా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలియచేశారు.
ఎవరీ ఖాసీమ్ రజ్వి

కాసిం రిజ్వీ లాతుర్ లో జన్మించాడు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో లా అభ్యసించాడు. నాటి హైదరాబాద్ రాజ్యంలోని భాగంగా ఉన్న ఉస్మానాబాద్ జిల్లాలోని లాతూర్లో ఒక న్యాయవాదిగా స్థిరపడ్డాడు. ఎంఐఎం సంస్థను అడ్డం పెట్టుకొని..మీర్ఉస్మాన్ అలీఖాన్ ను ప్రభావితం చేయసాగాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ ను భారత్ లో కలిపేందుక వీలు లేదని ప్రతిన బూనాడు. కాగా.. అప్పటికే హైదరాబాద్ సంస్థానంలో మొదలైన తిరుగుబాట్లను అణిచివేసేందుకు రజాకార్ల పేరుతో ప్రైవేటు సైన్యాన్ని తయారు చేశాడు. అప్పటికే ఉన్న నిజాం సైనికులకు వీరు అదనం అన్న మాట. వీరు హిందువులపై దాడులు చేస్తూ మత కల్లోలాలను రెచ్చగొట్టారు. హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చేయాలంటూ వాదించిన షోయబుల్లాఖాన్ వంటి వారిని హత్య చేయించాడు. కాగా.. సంస్థానంలో అకృత్యాలను సాగించిన రిజ్వీకి హైదరాబాద్ విముక్తి అనంతరం.. 1948 నుండి 1957 వరకు జైలు శిక్ష విధించబడింది.1957 సెప్టెంబరు 11న జైలు నుంచి విడుదలయ్యాక ఖాసిం రజ్వీ పాకిస్తాన్ కు వెళ్లిపోయాడు. కాగా అతని కుటుంబం 1949లోనే పాకిస్తాన్ కు వెళ్లి అక్కడ నివసిస్తున్నది.
పరిస్థితి చేయి దాటింది..
హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలన్నింటినీ భారత కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నది. పరిస్థితి చేయి దాటి పోతుండడంతో ..ఇక హైదరాబాద్ కి భారత సైన్యాన్ని పంపాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1948 సెప్టెంబర్ 9న దక్షిణాది కమాండ్ కు ఈ సమాచారం అందచేశారు. 13వ తేదీ సోమవారం ఉదయం భారత సైనిక దళాలు హైదరాబాద్ రాజ్య సరిహద్దుల్లోకి ప్రవేశించాలని ఆదేశించారు. నాటి అవిభాజ్య హైదరాబాద్ సంస్థానం దేశంలోనే అతి పెద్దది. 1.6 కోట్ల జనాభా కలిగి.. 16 జిల్లాలతో 2,14,190 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి ఉన్న అతి పెద్ద సంస్థానం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర పరిధితో పాటు.. కర్ణాటకలోని గుల్బర్గా, రాయచూర్, బీదర్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీడ్, నాందేడ్, ఉస్మానాబాద్, పర్బణి.. ప్రాంతాల వరకు విస్తరించి ఉండేది.
అన్ని దిక్కుల నుంచి..హైదరాబాద్ దిగ్బంధం

శాంతిభద్రతలు నశించి.. చిగురుటాకులా వణుకుతున్న హైదరాబాద్ ప్రజలను రక్షించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. ఓ వైపు నిజాం నిరంకుశ పాలన, మరోవైపు రజాకార్ల అకృత్యాలతో పాటు.. కమ్యూనిస్టుల తిరుగుబాటు చర్యలను అణిచివేసే లక్ష్యంతో భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య చేపట్టింది. 1948 సెప్టెంబర్ 13న మేజర్ జయంత్ నాథ్ చౌదరి నేతృత్వంలోని భారత సైన్యం షోలాపూర్ వైపు నుంచి వస్తే.. మద్రాస్ వైపు నుంచి మేజర్ జనరల్ రుద్ర సైన్యం.. బేరార్ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్తు సైన్యం.. ముంబై వైపు నుంచి మేజర్ జనరల్ డీఎస్ ధర్ సైన్యం ... హైదరాబాద్ సంస్థానాన్ని చుట్టుముట్టింది.
తొలి ముట్టడి.. ఉస్మానాబాద్
చౌదరి నాయకత్వంలోని సైన్యం.. ఉస్మానాబాద్ లో ఉన్న నల్ దుర్గ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నది. మరుసటి రోజు శివదత్తు బృందం బీదర్ జిల్లా బసవకళ్యాణ్ తాలూకాలోని రాజేశ్వర్ పట్టణాన్ని ముట్టడించింది. ఔరంగాబాద్ లోని జల్నా పట్టణాన్ని గూర్ఖా దళం స్వాధీనం చేసుకున్నది. కాగా భారత సైన్యం యుద్ధ ట్యాంకులతో ముందుకు సాగడంతో.. 75 ఎంఎం తుపాకులు వాడడంతో నిజాం సైన్యం నుంచి సాయుధ దళాలకు నామ మాత్రపు ప్రతిఘటనే ఎదురైంది. సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం భారత్ సైనిక బెటాలియన్లు ఒకవైపు నుంచి బీదర్లోకి ప్రవేశించి అనంతరం హింగోలి పట్టణంపై అదుపు సాధించారు. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్యాల పట్టణం పైన మరోవైపు నుంచి సైన్యం అదుపు సాధించింది.
నిజాం లొంగుబాటు
ఓటమి అనివార్యమని గ్రహించిన నిజాం సెప్టెంబర్ 17వ తేదీన కాల్పుల విరమణ ప్రకటన చేశాడు. దీంతో ఆయన కమాండర్ అల్ అద్రూస్, రజాకార్ నాయకుడు ఖాసిం రిజ్వీతో పాటు హైదరాబాద్ సైన్యం ఐదు రోజుల్లోపు భారత ప్రభుత్వానికి తల వంచి లొంగిపోయింది.సెప్టెంబర్ 18 వ తేదీ ఉదయం భారత సైన్యం సికింద్రాబాద్ కంటోన్మెంట్లోకి తన జైత్రయాత్ర కొనసాగించడంతో రహదారుల వెంబడి లక్షలాది మంది ప్రజలు భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ ఉద్వేగంగా వారికి స్వాగతం పలికారు. ఆ తర్వాత 5 నెలలకు అంటే 1949 ఫిబ్రవరిలో
సర్దార్ పటేల్ హైదరాబాద్ ను సందర్శించారు. ఆ సందర్భంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన ప్రొటోకాల్ ను కూడా విడిచిపెట్టి.. పటేల్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. మీర్ ఉస్మాన్ అలీఖాన్ తో.."మిమ్మల్ని కలుసుకుని మీ పరిచయం చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు కూడా మారడం నాకు ఆనందం కలిగిస్తుంది.పొరపాటు చేయడం మానవ సహజం. కానీ క్షమించడం అంతకన్నా ఉత్తమం” అని చెప్పి సంక్షోభానికి శాశ్వత ముగింపు పలికారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
- ●Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
- ●TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం
- ●Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!

Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!

TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి

Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్



