త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Paidi Rakesh Reddy | ఆర్మూర్ గోస పట్టకపోతే ఇయ్యాల్నే రాజీనామా జేస్త

నిజామాబాద్‌పై వివక్ష ఆపకపోతే ఇవాళే రాజీనామా చేస్తానంటూ అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

J

Telangana | Published On Sep 16, 2026, 11.23 am IST

Paidi Rakesh Reddy | ఆర్మూర్ గోస పట్టకపోతే ఇయ్యాల్నే రాజీనామా జేస్త

సంక్షిప్త సారాంశం

ఆర్మూర్‌ నియోజకవర్గ సమస్యలు పట్టించుకోవడం లేదని అసెంబ్లీలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజాం కాలం నాటి ఎంఆర్వో, సబ్ కలెక్టర్ భవనాలు కూలిపోయే దశకు చేరినా అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. పరిగి, కొడంగల్, ములుగు ప్రాంతాలకు నిధులు కేటాయిస్తూ నిజామాబాద్‌ను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సభ ముగిసేలోగా మాట్లాడేందుకు 10 నిమిషాలు సమయం ఇవ్వకపోతే వెంటనే రాజీనామా సమర్పిస్తానని స్పీకర్‌ను కోరారు.

Advertisement
  • అసెంబ్లీలో పైడి రాకేష్ రెడ్డి ఫైర్

Paidi Rakesh Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన నియోజకవర్గంలోని కనీస మౌలిక వసతుల సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని నిరసిస్తూ, అవసరమైతే ఈరోజే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సభాముఖంగా హెచ్చరించారు. సభ ముగిసే ముందు తనకు పది నిమిషాల సమయం కేటాయించాలని, తన ఆవేదన చెప్పుకొని రాజీనామా లేఖ సమర్పిస్తానని స్పీకర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

"నిజామాబాద్ అంటే ఎవరికీ పట్టని జిల్లాగా మారింది"

సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన రాకేష్ రెడ్డి.. నిజామాబాద్ జిల్లాపై పాలకులు చూపిస్తున్న వివక్షను తీవ్రంగా ఎండగట్టారు. "ఈ నిజామాబాద్ అంటేనే ఎవరికీ పట్టని జిల్లాగా తయారైంది. ఇతర నియోజకవర్గాలకు వేల కోట్ల పెట్టుబడులు, ప్రాజెక్టులు ఇస్తున్నారు. కొడంగల్, పరిగి, ములుగు లాంటి ప్రాంతాలకు నిధులు పోతున్నాయి.. దానికి మేము సంతోషిస్తున్నాం. కానీ, ఆర్మూర్ ప్రజలు చిన్న చిన్న సమస్యలు అడిగినా ప్రభుత్వానికి ఎందుకంత బాధ?" అని ఆవేదన వ్యక్తం చేశారు.

కూలిపోయే దశలో ఎంఆర్వో, ఆర్డీవో ఆఫీసులు

ఆర్మూర్ పాలనా భవనాల దుస్థితిని ప్రస్తావిస్తూ.. "మా ప్రాంతంలో దాదాపు 100 సంవత్సరాల క్రితం నిజాం కాలంలో కట్టిన తహసీల్దార్ కార్యాలయం ఉంది. అది ఎప్పుడు కూలిపోతుందో తెలియని స్థితికి చేరింది. ఇక సబ్ కలెక్టర్, ఆర్డీవో ఆఫీసులు ఒక సాధారణ క్లర్క్ కూర్చునే గదిలా ఉన్నాయి. అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఆర్డీవో కాంప్లెక్స్ మంజూరు చేయాలని రెండేళ్లుగా మంత్రులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రులను స్వయంగా కలిసి వేడుకున్నా ఇప్పటివరకు పైసా విదిల్చలేదు" అని మండిపడ్డారు.

"లక్షల కోట్ల పెట్టుబడులు అడగడం లేదు"

ఒకప్పుడు నిజాంసాగర్ ప్రాజెక్టు జలాలతో కళకళలాడిన ఆర్మూర్ ప్రాంతం నేడు తీవ్ర కరువుతో అల్లాడుతోందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఇతర నియోజకవర్గాలకు ఇచ్చినట్లుగా 27 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అయినా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి తాము లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు డిమాండ్ చేయడం లేదని, కనీస పాలనా భవనాలు కట్టించి ఇవ్వమని మాత్రమే వేడుకుంటున్నామని స్పష్టం చేశారు.

మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే రాజీనామా

సభ ముగిసే సమయంలో తనకు మాట్లాడేందుకు కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం కేటాయించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. "ఇది చాలా సీరియస్ సమస్య. ఆర్మూర్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోతే ఈ పదవిలో కొనసాగడం అనవసరం. లాస్ట్ టైమ్‌లో నాకు 10 నిమిషాలు కేటాయించండి, నా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడి ఈరోజే రాజీనామా లేఖ సమర్పిస్తాను" అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. రాకేష్ రెడ్డి చేసిన ఈ హెచ్చరికతో అసెంబ్లీలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది.

Advertisement
Advertisement