త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Constitution Day | రాజ్యాంగాన్ని అర్థం చేసుకోండి.. ప‌రిర‌క్షించండి..

Constitution Day | రాజ్యాంగం ప్రతి పౌరుడి సొంతమని, అందులోని విలువలు, ఆదర్శాలను అర్థం చేసుకోవడంతోపాటు పరిరక్షించి నిత్యజీవితంలో ఆచరించాలని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెల‌ర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు అన్నారు.

P

Telangana | Published On Nov 26, 2026, 9.20 pm IST

Constitution Day | రాజ్యాంగాన్ని అర్థం చేసుకోండి.. ప‌రిర‌క్షించండి..
Advertisement
  • నిత్యజీవితంలో రాజ్యాంగ విలువలను ఆచరించాలి
  • నల్సార్ వీసీ శ్రీకృష్ణదేవరావు పిలుపు
  • రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సీబీసీ ఫొటో ప్రదర్శన, అవగాహన కార్యక్రమం

Constitution Day | రాజ్యాంగం ప్రతి పౌరుడి సొంతమని, అందులోని విలువలు, ఆదర్శాలను అర్థం చేసుకోవడంతోపాటు పరిరక్షించి నిత్యజీవితంలో ఆచరించాలని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెల‌ర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు అన్నారు. రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం మాత్రమే కాదని.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే సజీవ సాధనమని పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విద్యాసంస్థలో నిర్వహించిన ఫొటో ప్రదర్శన, అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మౌలిక సూత్రాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తోపాటు రాజ్యాంగ సభ సభ్యుల కృషిని గుర్తుచేశారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించగా.. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందని వివరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రాథమిక హక్కులు, రాజ్యాంగబద్ధ పాలన, న్యాయవ్యవస్థ స్వతంత్రత, మౌలిక స్వరూప సిద్ధాంతం కీలకమని పేర్కొన్నారు.

హక్కులతోపాటు విధులపైనా అవగాహన ఉండాలి

సామాజిక అసమానతలు, వివక్షను తొలగించి పౌరులందరికీ గౌరవం, సమాన అవకాశాలు కల్పించడమే రాజ్యాంగ లక్ష్యమని శ్రీకృష్ణదేవరావు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రాజ్యాంగాన్ని చదవడంతోపాటు రాజ్యాంగ సభ చర్చలను కూడా అర్థం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగంపై అవగాహన కేవలం ప్రాథమిక హక్కులకే పరిమితం కాకుండా.. ప్రాథమిక విధులు, ప్రజాస్వామ్య ప్రక్రియలో బాధ్యతాయుత భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. యువతలో రాజ్యాంగ విలువలపై అవగాహన పెంచేందుకు సీబీసీ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు.

1.5 లక్షల మందికి విద్య: డాక్టర్ వినోద్

పౌరులకు తమ ప్రాథమిక హక్కులు, విధులపై అవగాహన కల్పించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ జీ వినోద్ అన్నారు. రాజ్యాంగంలోని అంశాలను సరళంగా వివరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డాక్టర్ అంబేడ్కర్ సేవలను కొనియాడారు. తమ సంస్థ తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించేందుకు కట్టుబడి ఉందని, ఇప్పటివరకు దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులకు విద్య అందించినట్లు తెలిపారు. సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ ప్రారంభోపన్యాసం చేశారు. 'అవర్ కాన్‌స్టిట్యూషన్.. అవర్ ప్రైడ్' ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో రాజ్యాంగ రూపకల్పన, రాజ్యాంగ సభ సభ్యుల కృషి, మహిళా సభ్యుల పాత్ర, ప్రాథమిక హక్కులు, విధులకు సంబంధించిన అంశాలను పొందుపరిచినట్లు తెలిపారు. మూల రాజ్యాంగ ప్రతిలోని సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రదర్శిస్తున్నట్లు వివరించారు. సుమారు 40 సమాచార ఫలకాలతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ద్వారా రాజ్యాంగ చరిత్ర, విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలపై విద్యార్థులు, సందర్శకులకు అవగాహన కల్పించనున్నారు. రాజ్యాంగం మనందరి ఉమ్మడి వారసత్వమని, దాని పరిరక్షణ అందరి బాధ్యత అని శ్రుతి పాటిల్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement