త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

KTR | ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం కాంగ్రెస్‌ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ బావర్చి హోటల్‌లో బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌, పార్టీ యువ నాయకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.

P

Telangana | Published On Nov 26, 2026, 9.12 pm IST

KTR | ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
Advertisement
  • బావర్చి హోటల్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం
  • ప్రశ్నించే గొంతులను అణచివేయడం కాంగ్రెస్‌ నిరంకుశత్వానికి నిదర్శనం
  • దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

KTR | ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం కాంగ్రెస్‌ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ బావర్చి హోటల్‌లో బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌, పార్టీ యువ నాయకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి పాలనను తలపించేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రాహుల్‌గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారంటూ ఆయన చిత్రపటంతో డిన్నర్‌ కార్యక్రమం నిర్వహించడం తప్పా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని నిలదీశారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న క్రిశాంక్‌, ఇతర యువ నాయకులపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి దిగడం దారుణమన్నారు. స్వయంగా రాజ్యసభ సభ్యుడే ఈ దాడికి నాయకత్వం వహించి, తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించారు. ఉద్యోగాలపై నిలదీస్తే దాడులకు దిగడం కాంగ్రెస్‌ ప్రభుత్వ అసహనానికి, అరాచకానికి పరాకాష్ట అని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం, నిరసన తెలిపే వారిపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, దాడికి పాల్పడిన వారితోపాటు నాయకత్వం వహించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాపాడాలని కోరారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా.. ఉద్యోగాల గురించి ప్రశ్నించే వారిపై దాడులు చేయడం మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఓ ప్ర‌క‌ట‌న‌లో కేటీఆర్‌ విమర్శించారు.

Advertisement
Advertisement