దక్షిణాఫ్రికాలోని మాలి దేశంలో బోర్ వెల్ కంపెనీలో పని చేస్తున్న తెలంగాణలోని భువనగిరికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఉపాధి కోసం ప్రవీణ్ గత సంవత్సరం ఆఫ్రికాకు వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామం అతడిది. హైదరాబాద్ లోని ఓ బోర్ వెల్ కంపెనీలో పని చేస్తున్న ప్రవీణ్ ను గత సంవత్సరం కంపెనీ పని మీద ఆఫ్రికాలోని మాలికి పంపించింది. అప్పటి నుంచి అక్కడే పని చేస్తున్నాడు. గత నెల 22 వ తేదీ నుంచి ప్రవీణ్ ఫోన్ స్విచ్ఆఫ్ వస్తోంది. దీంతో ఆందోళనకు గురైన అతడి తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. మాలిలోని కోబ్రి ప్రాంతంలో విధులకు వెళ్లిన ప్రవీణ్ ను గత నెల 23న జేఎన్ఐఎం సంస్థకు చెందిన ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బోర్ వెల్ యాజమాన్యం.. అతడి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చేరవేసింది. అలాగే భారత రాయబార కార్యాలయంతో బోర్ వెల్ కంపెనీ యాజమాన్యం ప్రవీణ్ గురించి సంప్రదింపులు జరుపుతోంది. ఈ సంస్థ ఇప్పటికే చాలా సార్లు పలువురు విదేశీయులను కిడ్నాప్‌నకు గురి చేసినట్లు తెలుస్తోంది. వాళ్ల మోటివ్ ఏంటి? ఎందుకు ప్రవీణ్ ను కిడ్నాప్ చేశారు? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఉగ్రవాదుల చెర నుంచి తమ బిడ్డను కాపాడాలని ప్రవీణ్ తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.