త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Chamala Kiran Kumar Reddy | తెలంగాణ ఏర్పాటు ఇండియా-పాక్ విభజన లాంటిదా? లోక్‌సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై చామల కిరణ్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా-పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు నిండు సభలో క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

J

Telangana | Published On Apr 17, 2026, 6.35 pm IST

MP Chamala Kiran Kumar Reddy | తెలంగాణ ఏర్పాటు ఇండియా-పాక్ విభజన లాంటిదా? లోక్‌సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై చామల కిరణ్ ఫైర్
Advertisement

MP Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ సెంటిమెంట్ రగిలింది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై జరుగుతున్న చర్చల మధ్యలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఉద్దేశించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గురువారం సభలో ఆయన తెలంగాణ ఏర్పాటును ఇండియా-పాకిస్థాన్ విభజనతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) లోక్‌సభ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అసందర్భ వ్యాఖ్యలు ఎందుకు?

సభలో చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "నిన్న ఒక సభ్యుడు మాట్లాడుతూ అసందర్భమైన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా, పాకిస్థాన్ విభజనతో పోల్చారు. బ్రిటిష్ వారు చేసిన దానికంటే ఇది దారుణంగా ఉందని అన్నారు. అసలు తెలంగాణ ఏర్పాటు గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో ఇదే చట్టసభలో ఆమోదం పొందిన బిల్లును ఇప్పుడు తప్పుబట్టడం ద్వారా మనం ఈ సభకు ఎలాంటి గౌరవం ఇస్తున్నట్లు?" అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారు?

రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీల తీరును సైతం చామల ఎండగట్టారు. "తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఇదే సభకు ఎన్నికయ్యారు. ఎవరైనా మన రాష్ట్ర ఆవిర్భావం గురించి తప్పుగా మాట్లాడుతుంటే, సభ్యులు మన పక్షాన ఉన్నా, ఎదుటి పక్షాన ఉన్నా ఖండించాలి. కానీ, ఈ టైమ్‌లో తెలంగాణ ఎంపీలు ఎవరూ కూడా దీనిపై గొంతు ఎత్తకపోవడం, మౌనంగా ఉండిపోవడం విచారకరం," అని మండిపడ్డారు. కర్ణాటకకు చెందిన ఒక సభ్యుడు కేవలం తన అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఎద్దేవా చేశారు.

రికార్డుల నుంచి తొలగించాలి.. క్షమాపణ చెప్పాలి

తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఆ వ్యాఖ్యలను సహించేది లేదని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. "తెలంగాణ రాష్ట్రం గురించి తప్పుగా మాట్లాడిన ఆ పదాలను వెంటనే పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని నేను స్పీకర్ గారిని కోరుతున్నాను. అలాగే, ఆ వ్యాఖ్యలు చేసిన సభ్యుడు తెలంగాణ ప్రజలకు నిండు సభలో బేషరతుగా క్షమాపణలు చెప్పాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement