త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. వారి కోసం మాట్లాడితే ప‌ళ్లు ఇకిలిస్తున్న‌రు

Kavitha | బీసీలకు చ‌ట్ట స‌భ‌ల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు వ‌చ్చే వ‌ర‌కు పోరాడ‌తాన‌ని.. బీసీల గురించి మాట్లాడితే అగ్రవర్ణాల్లో పుట్టిన నీకెందుకంటూ పళ్లు ఇకిలిస్తున్నార‌ని టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. 100 మందికి 100 రొట్టెలు ఉంటే 10 మంది మాత్ర‌మే 90 రొట్టెలు తిన‌డం అన్యాయ‌మ‌న్నారు. ఇప్పటి వరకు గ్రామ పంచాయ‌తీ మొఖం కూడా తెలియని కులాలతో పనిచేస్తాన‌న్నారు.

S

Telangana | Published On Aug 6, 2026, 6.24 pm IST

Kavitha | చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. వారి కోసం మాట్లాడితే ప‌ళ్లు ఇకిలిస్తున్న‌రు
Advertisement
  • వచ్చే బడ్జెట్ సెషన్ లోపు బీసీ రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసి పంపాలి
  • లేదంటే వెయ్యి కార్లతో ఛలో ఢిల్లీ నిర్వహిస్తాం
  • సామాజిక న్యాయం అంటే అగ్రకులాల‌వారు తమ సీట్లు పోతాయని అనుకుంటున్న‌రు
  • కానీ దేశంలో వచ్చిన మార్పులకు అగ్రకులాల్లోని ప్రజాస్వామ్యవాదులే కారణం
  • 100 మందికి 100 రొట్టెలు ఉంటే 10 మందే 90 రొట్టెలు తిన‌డం అన్యాయం
  • సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నా
  • ఈ సభ కోట్లాది మంది జీవితాలను మార్చబోతోంది
  • ఇప్ప‌టివ‌ర‌కు గ్రామ పంచాయ‌తీ మొఖం చూడ‌నివారితో క‌లిసి ప‌ని చేస్తా
  • ట్యాంక్‌బండ్‌పై జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హం పెట్టుకుందాం
  • స‌రూర్‌న‌గ‌ర్ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్య‌లు

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: బీసీలకు చ‌ట్ట స‌భ‌ల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు వ‌చ్చే వ‌ర‌కు పోరాడ‌తాన‌ని.. బీసీల గురించి మాట్లాడితే అగ్రవర్ణాల్లో పుట్టిన నీకెందుకంటూ పళ్లు ఇకిలిస్తున్నార‌ని టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. నా పుట్టుక నా చేతిలో లేదని.. కానీ నేను ఎవరి కోసం పనిచేయాలో అది నా చేతిలోనే ఉందన్నారు. ఇప్పటి వరకు గ్రామ పంచాయ‌తీ మొఖం కూడా తెలియని కులాలతో పనిచేస్తాన‌న్నారు. వారిలో సాధికారిత తెచ్చే వరకు జీవితాన్ని అంకితం చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. 100 మందికి 100 రొట్టెలు ఉంటే 10 మంది మాత్ర‌మే 90 రొట్టెలు తిన‌డం అన్యాయ‌మ‌న్నారు. 100 రొట్టెలతో 100 మంది ఆకలి తీర్చటమే న్యాయమ‌ని నొక్కి చెప్పారు. హైద‌రాబాద్‌ స‌రూర్‌న‌గ‌ర్‌లో గురువారం నిర్వ‌హించిన‌ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో ఆమె ప్ర‌సంగించారు.

నా ఆత్మ ఒప్పుకోకుండా నేను ఏ మాట, ఏ పని చేయను. కచ్చితంగా మార్పు తెస్తానన్న నమ్మకంతోనే నేను వచ్చాను. అసలు సామాజిక న్యాయం అంటే ఏంటీ? వంద రొట్టెలతో వంద మంది ఆకలి తీర్చటమే న్యాయం. కానీ మన దేశంలో 10 మంది మాత్రమే 90 రొట్టెలు తింటూ అన్యాయం చేస్తున్నారు. ఈ సామాజిక న్యాయ సంకల్ప సభ దేశంలోని కొట్లాది మంది జీవితాలను మార్చబోతుంది. రాచరికం ఉన్నప్పుడు ప్రజల మీద ఎన్నో దాష్టీకాలు జరిగాయి. కానీ ఆ తర్వాత మన రాజ్యాంగం ద్వారా మన పరిస్థితులను మార్చుకున్నాం. ఆనాటి అమానవీయ పరిస్థితులను మార్చుకునేందుకే మనం రాజ్యాంగం రాసుకున్నాం. కానీ రాజ్యాంగం పూర్తి స్థాయిలో మనం అమలు చేసుకోలేకపోయాం. అందుకే మనం ఈ సభ ద్వారా సామాజిక న్యాయ పోరాటం చేయబోతున్నాం. సామాజిక న్యాయ సంకల్పం తీసుకోబోతున్నాం అని క‌విత పేర్కొన్నారు.

సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలు మా సీట్లు ఎక్కడ పోతాయోనని భయపడుతారు. కానీ ఒక క్షత్రియ పుత్రుడైన గౌతమ బుద్ధుడే రాజ్యం బయటకు వచ్చి చూసి ఒక గణతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. సాహూ మహారాజ్ ఆ రోజుల్లోనే రిజర్వేషన్లు కల్పించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఇవాళ టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకున్నాం. మనకు సామాజిక న్యాయంపై పోరాటం చేసే ఒక గొప్ప అవకాశం దొరికింది. సమాజంలోని అగ్రవర్ణాల్లో ఉన్న గొప్ప నాయకులే ఒక్కొక్కరుగా వెలుగుతూ మనం ప్రజాస్వామ్యాన్ని సాధించుకునే పరిస్థితి తెచ్చారు. తెలంగాణలో దున్నేవాడిదే భూమి అని భూస్వాములను గడీల నుంచి మ‌నం తరిమికొట్టాం. ఎన్నో పోరాటాల తర్వాత కొంత ఆర్థిక అసమానతలను మనం పొగొట్టుకున్నాం. కానీ కుల వివక్షను పూర్తిస్థాయిలో తరిమికొట్టేందుకు జరగాల్సినంత పోరాటాలు జరగలేదు అని ఆమె చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్లు బీరువాలో పెట్టింది..

ధర్మం, న్యాయం అన్ని కూడా సామాజిక న్యాయం కావాల్సిందేనని చెబుతున్నాయి. ఈ దేశంలో ఇప్పటి వరకు వచ్చిన విప్లవాత్మక మార్పుల్లో చాలా వరకు కూడా అగ్రకులాల్లో ఉన్నప్రజాస్వామ్య వాదుల ప్రయత్నం ద్వారానే జరిగాయి. రాజుల కాలంలో బుద్దుడు, సాహు మహారాజ్ లాంటి క్షత్రియ పుత్రులే మార్పు తెచ్చారు. ఆ తర్వాత మండలి కమిషన్ రిపోర్ట్‌ను కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్లు బీరువాలో పెడితే.. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనే క్షత్రియ పుత్రుడే దాన్ని అమలు చేశారు. తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్ల కోసం వాటిని 9 వ షెడ్యూల్‌లో పెట్టించింది అగ్రకులానికి చెందిన జయలలిత గారే. అలాంటి వారందరినీ మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు కదలాలి.

ఎస్సీ, ఎస్టీల‌కు ఇచ్చిన‌ట్టు బీసీల‌కు ఇచ్చి ఉంటే..

దేశంలో కసబ్ లాంటి వాళ్లు, చిన్న పిల్లలను రేప్ చేసిన వాళ్లను కూడా చంపటానికి చట్టం ఒప్పుకోదు. మనం విదేశాలకు వెళితే అక్కడ మన మీద వివక్ష చూపిస్తే బాధపడుతాం. కానీ మన పక్కనే ఉన్న మనవాళ్లపై మనమే వివక్ష చూపటం అన్యాయం. ధర్మం, న్యాయం కోసం అందరూ కలిసి వచ్చి పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలకు కూడా ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినట్లు ఆనాడే రిజర్వేషన్లు ఇచ్చి ఉంటే మన దేశం అమెరికాతో పోటీ పడేది. ఇప్పటికైనా సామాజిక న్యాయం కోసం మనమంతా పోరాటం చేద్దాం. కలిసి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.

మ‌న‌మంతా ఒక్క‌టే అయిన‌ప్పుడు వివ‌క్ష ఎందుకు?

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటే వాళ్లు బాగుపడిపోయారని అంటున్నారు. కానీ ఏదైనా పండుగ వస్తే దళిత కుటుంబాన్ని పిలిచి మనం కలిసి భోజనం చేస్తున్నామా? ప్రజాస్వామ్యంలో మనమంత ఒక్కటే అయినప్పటికీ ఇంకా వివక్ష ఎందుకు కొనసాగుతోంది. రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా 97 శాతం దళితులు అత్యంత వెనుకబాటులో ఉన్నారు.

ఈ దేశంలో లక్షలాదిగా ఎస్సీ, ఎస్టీల బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. వాటి గురించి మనం పిడికిలి ఎత్తి పోరాటం చేయాలి. ఎస్టీల్లో కూడా 97 శాతం ప్రజలు అత్యంత వెనుకబడే ఉన్నారు. ఇక ముస్లింలలో కూడా కనీసం సర్పంచ్ పదవి చేపట్టని పరిస్థితి ఉంది. అన్ని ప్రభుత్వాలు వాళ్ల జీవితాల్లో మార్పులు తెస్తామంటూ మాటలు మాత్రమే చెబుతున్నాయి. కచ్చితంగా ముస్లింలకు కూడా వాళ్ల హక్కులతో కూడిన రిజర్వేషన్లు రావాలి. అన్ని వర్గాలకు సమన్యాయం కావాలని పోరాటం చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి. అవి నా దగ్గర ఉన్నాయి. కచ్చితంగా అన్ని వర్గాలకు న్యాయం చేసేలా నేను పోరాటం చేస్తాను అని క‌విత తేల్చి చెప్పారు.

కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు ప్రేమ లేఖలు రాసుకుంటున్నారు..

సగానికి పైగా మన దేశంలో బీసీ జనాభా ఉంది. కానీ 71 శాతం మంది బీసీలు ఎస్సీల కన్నా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. బీసీలు 46 శాతం ఉంటే 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఈ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. బీసీ ముస్లింల సంగతి పట్టించుకోవటం లేదు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు ప్రేమ లేఖలు రాసుకుంటున్నారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా ఉంది వాళ్ల వ్యవహారం. కానీ నిజానికి బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే. అందుకోసం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి పనిచేసి బీసీలకు న్యాయం చేయాలి అని టీఆర్ఎస్ చీఫ్ డిమాండ్ చేశారు.

చిన్న‌పిల్ల‌లే క‌ద‌లిక తెస్తున్న‌రు.. మనం అనుకుంటే కాదా?

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పెట్టిన బిల్లును రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టారు. ఇవ్వాళ ప్రారంభమైన ఈ సామాజిక న్యాయ సంకల్ప సభ సాయిత్రి భాయ్ ఫూలే జయంతి వరకు కొనసాగుతుంది. ప్రతి గ్రామంలో మనం సామాజిక న్యాయం కోసం సభలు నిర్వహించుకుందాం. ఆ తర్వాత అవసరమైతే ఛలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకుందాం. చిన్న పిల్లలే ధర్నాలు చేసి ప్రభుత్వంలో కదలిక తెస్తున్నారు. మనం అనుకుంటే కాదా? బడ్జెట్ సెషన్ లోపు బీసీ బిల్లును పాస్ చేసి పంపించాలని కేంద్రానికి హెచ్చరిక చేస్తున్నాం. లేదంటే కచ్చితంగా మారోజు వీరన్న స్ఫూర్తితో పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నా అని క‌ల్వ‌కుంట్ల క‌విత వెల్ల‌డించారు.

సామాజిక న్యాయం కోసం మనం చేసే పోరాటాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 6 నాటికి సమీక్ష చేసుకుందాం. సామాజిక న్యాయం కోసం కలిసి వచ్చే అందరితో మనం వాళ్లను కలుపుకొని పోరాటం చేద్దాం. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక మాట చెప్పారు. తెలంగాణ ఉద్యమంతో పాటు సామాజిక తెలంగాణ ఉద్యమాన్ని ఒకేసారి చేయలేమని అన్న‌రు. తెలంగాణ సాధించుకున్న తర్వాత సామాజిక న్యాయం కోసం అంతే పవిత్రంగా మనం ఉద్యమాన్ని చేయాలని చెప్పారు. ఆయన కన్న‌ కలలను నిజం చేసే విధంగా మనం పోరాటం చేద్దాం.
జయశంకర్ సార్ విగ్రహాన్ని మనం కచ్చితంగా ట్యాంక్ బండ్ వద్ద పెట్టుకోవాలి అని క‌విత వ్యాఖ్యానించారు.

ఈ సభ ద్వారా క‌విత ప్ర‌క‌టించిన తీర్మానాలివే..

  • 1. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు కలిసి వచ్చే వారితో దేశ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఉద్యమిస్తుంది
    2. మహాత్మా జ్యోతిరావ్ పూలే దంపతులకు భారత రత్న అవార్డు ఇవ్వాలి
    3. ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహాన్ని పెట్టాలి
    4. ఎస్సీ, ఎస్టీల నిధులను వాళ్ల అభ్యున్నతి కోసమే వాడాలి
    5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను నింపేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలి
    6. ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు రావాలి
    7. డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు క‌ల్పించాలి
    8. ముస్లింలకు ఆర్థిక స్వావలంబ‌నతో పాటు వక్ఫ్ బోర్డు చట్టం తేవాలి
    9. సిక్కులు, క్రిస్టియన్లకు ఆర్థిక స్వావలంబ‌న ఉండేలా చర్యలు తీసుకోవాలి
    10. ట్రాన్స్ జెండర్లకు సంపూర్ణ హక్కులు రావాలి
    11. వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్లు పెంచాలి. వారికి కో ఆప్షన్ సభ్యుల్లో రిజర్వేషన్ కల్పించాలి
Advertisement
Advertisement