త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deshapathi Srinivas | కేసీఆర్ ఆశ‌యాల‌ను పుణికిపుచ్చుకున్న నేత హ‌రీశ్ : దేశ‌ప‌తి శ్రీ‌నివాస్‌

Deshapathi Srinivas | తెలంగాణ ఉద్యమంలో కాకలు తీరిన నాయకుడు, కేసీఆర్ ఆశయాలను పుణికి పుచ్చుకున్న నాయకుడు హరీశ్‌రావు అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసం హరీశ్ రావు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నార‌ని తెలిపారు.

P

Telangana | Published On May 23, 2026, 6.04 pm IST

Deshapathi Srinivas | కేసీఆర్ ఆశ‌యాల‌ను పుణికిపుచ్చుకున్న నేత హ‌రీశ్ : దేశ‌ప‌తి శ్రీ‌నివాస్‌
Advertisement

Deshapathi Srinivas | తెలంగాణ ఉద్యమంలో కాకలు తీరిన నాయకుడు, కేసీఆర్ ఆశయాలను పుణికి పుచ్చుకున్న నాయకుడు హరీశ్‌రావు అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసం హరీశ్ రావు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నార‌ని తెలిపారు. హరీశ్‌ రావు ప్రకటన తెలంగాణ స్వాగతించదగ్గదని పేర్కొన్నారు. అదే ప్రకటన కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసమే మంత్రి శ్రీధర్ బాబు హరీశ్‌ రావుపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ దందాల కోసమే ఫ్యూచర్ సిటీని తెచ్చారని, ఫ్యూచర్ సిటీలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అన్నారు. రేవంత్ రెడ్డి కమిషన్ల కోసమే ఫ్యూచర్ సిటీ అని విమర్శించారు.

అన్నీ ఆలోచించే ఫార్మా సిటీ..

కేసీఆర్ అన్నీ ఆలోచించి అక్కడ ఫార్మా సిటీ నెలకొల్పాలని ప్రతిపాదించారని, ఫార్మా దిగ్గజాలతో సంప్రదించి ఫార్మా సిటీ స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఫార్మా సిటీకి అన్ని అనుమతులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేసిందని అన్నారు. ఫార్మా సిటీ అంటేనే రైతులు భూములు ఇచ్చారని, రైతులే కోర్టుకు వెళ్లారని తెలిపారు. రైతులు ఫ్యూచర్ సిటీ కోసం భూములు ఇవ్వలేదని, రియల్ ఎస్టేట్ దందా కోసం భూములు ఇవ్వలేదని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఏమి చెప్పారో శ్రీధర్ బాబు పాత పేపర్లను తిరగేయాలని వ్యాఖ్యానించారు. ఫార్మా సిటీని రద్దు చేస్తామని, భూములు రైతులకు వెనక్కి ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పి ఓట్లడిగారని అన్నారు. ఫార్మా సిటీని రద్దు చేసినప్పుడు రైతుల భూములు రైతులకు ఇవ్వాలని అదే హరీష్ రావు అడుగుతున్నారని తెలిపారు.

హైకోర్టులో ఫార్మాసిటీ.. ప్ర‌జ‌ల‌కు ఫ్యూచ‌ర్ సిటీ..

హైకోర్టులో ఫార్మా సిటీ ఉంటుందని చెబుతున్నారని, ప్రజలకేమో ఫ్యూచర్ సిటీ అని చెబుతున్నారని అన్నారు. ముందు స్పష్టత ఇవ్వాల్సింది శ్రీధర్ బాబేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ శ్రీధర్ బాబు చదువుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నిర్మాణాత్మకంగా ఉండాలని శ్రీధర్ బాబు నీతులు చెబుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలని తెలిపారు. ప్రగతి భవన్‌ను నక్సలైట్లు పేల్చేయాలని రేవంత్ అనలేదా అని ప్రశ్నించారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా అని చెప్పారని, భూ భారతి తెచ్చి కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని అన్నారు. ఎయిర్‌పోర్టు దాకా ప్రతిపాదించిన మెట్రో ప్రాజెక్టును రద్దు చేసిందని రేవంత్ రెడ్డిపై ఆరోపించారు. అభివృద్ధిని ఆపేది కాంగ్రెస్ తప్ప బీఆర్ఎస్ కాదని అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను ధ్వంసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శించారు.

బీఆర్ఎస్ అడ్డుకునేంత కాంగ్రెస్ ఏం చేసింది?

హైదరాబాద్‌లో రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తే కదా బీఆర్ఎస్ అడ్డుకోవడానికి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాల గురించి శ్రీధర్ బాబు బీఆర్ఎస్‌కు హరీష్ రావుకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఫార్మా సిటీ వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, కలగాపులగంగా తెస్తున్న ఫ్యూచర్ సిటీ వల్ల ప్రయోజనం లేదని తెలిపారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు రోజులకే గత లెఫ్ట్ ప్రభుత్వం ప్రతిపాదించిన సిల్వర్ లైన్ ప్రాజెక్టును రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. అది ఫ్యూచర్ సిటీ కాదు, అవినీతి క్రియేషన్ సిటీ అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీ అని, ప్రజలకు మేలు చేయని ఏ నిర్ణయాన్నైనా వ్యతిరేకిస్తామని తెలిపారు. హరీష్ రావు ఫ్యూచర్ సిటీ భవిష్యత్ గురించి చట్టాల ఆధారంగా మాట్లాడారని అన్నారు. హరీష్ రావు సంధించిన ప్రశ్నలపై కాంగ్రెస్ నేతలు సూటిగా సమాధానం చెప్పకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. స‌మావేశంలో రాఘవేంద్ర యాదవ్, అమృత్ లాల్ చౌహన్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement