త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | కూర‌గాయల సాగుకు రూ. 125 కోట్ల‌కు పైగా రాయితీలు

Tummala Nageshwar Rao | తెలంగాణలో తగ్గుతున్న కూరగాయల సాగు విస్తీర్ణాన్ని తిరిగి పెంచడంతో పాటు రైతులకు ఆధునిక సాంకేతికత, నాణ్యమైన ఇన్‌పుట్స్, సాగునీటి సదుపాయాలు, శిక్షణ, ప్రాసెసింగ్, కోల్డ్‌స్టోరేజ్, మార్కెటింగ్ వంటి అన్ని రంగాలను సమన్వయం చేసి సమగ్ర వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

S

Telangana | Published On Sep 10, 2026, 6.35 pm IST

Tummala Nageshwar Rao | కూర‌గాయల సాగుకు రూ. 125 కోట్ల‌కు పైగా రాయితీలు
Advertisement

ఇత‌ర రాష్ట్రాల నుంచి దిగుమ‌తి త‌గ్గించాలి
తెలంగాణ నుంచే ఎగుమ‌తి చేయాలి
వానాకాలంలో ల‌క్ష‌, ర‌బీలో మ‌రో ల‌క్ష ఎక‌రాల్లో కూర‌గాయ‌ల సాగు
శాస‌న‌స‌భ‌లో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల

Tummala Nageshwar Rao | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణలో తగ్గుతున్న కూరగాయల సాగు విస్తీర్ణాన్ని తిరిగి పెంచడంతో పాటు రైతులకు ఆధునిక సాంకేతికత, నాణ్యమైన ఇన్‌పుట్స్, సాగునీటి సదుపాయాలు, శిక్షణ, ప్రాసెసింగ్, కోల్డ్‌స్టోరేజ్, మార్కెటింగ్ వంటి అన్ని రంగాలను సమన్వయం చేసి సమగ్ర వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రాష్ట్రంలో కూర‌గాయ‌ల సాగుపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి వివ‌రంగా స‌మాధానం ఇచ్చారు.

కూరగాయల సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యం...

గతంలో తెలంగాణలో సుమారు 3 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరిగితే, ప్రస్తుతం అది సుమారు లక్ష ఎకరాలకు తగ్గిపోయిందని మంత్రి తెలిపారు. ఫలితంగా 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ వానాకాలంలో 51000 సాధారణ విస్తీర్ణానికి గాను 72,583 ఎకరాలలో కూరగాయల సాగు జరిగిందని తెలిపారు. కూరగాయల ధరలు ప్రధానంగా డిమాండ్, సరఫరాపై ఆధారపడి ఉండటం వల్ల మార్కెట్లో ధరల్లో తరచూ హెచ్చుతగ్గులు ఉంటాయని పేర్కొన్నారు. రైతులకు లాభదాయకమైన పంటల వైపు వెళ్లేలా ప్రోత్సహించడంతో పాటు, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

సాగుకు అవసరమైన సదుపాయాలపై భారీగా రాయితీలు...

కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు నారు, మల్చింగ్, షేడ్‌నెట్, శాశ్వత పందిళ్లు, బిందు మరియు తుంపర సేద్యం వంటి సదుపాయాలను రైతులకు రాయితీలపై అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కూరగాయల నారు, మల్చింగ్, షేడ్‌నెట్ కోసం రూ.20 కోట్లు, శాశ్వత పందిళ్ల కోసం రూ.8 కోట్లు, బిందు సేద్యం కోసం రూ.97 కోట్లుకేటాయించినట్లు వెల్లడించారు. అన్ని పంటలకు విస్తీర్ణం ఆధారంగానే రైతు భరోసా అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

రెండు లక్షల ఎకరాల్లో కూరగాయల సాగుకు కార్యాచరణ

రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని తక్షణమే పెంచేందుకు ప్రస్తుత వానాకాలంలో సుమారు లక్ష ఎకరాల్లో, తదుపరి రబీ సీజన్‌లో మరో లక్ష ఎకరాల్లో కూరగాయల సాగుకు ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణకు అవసరమైన కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి లేకుండా చేసి, తెలంగాణలో పండించిన కూరగాయలు ఇతర రాష్ట్రాలకు వెళ్లే స్థాయికి ఉత్పత్తిని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం.. సమతుల్య రాయితీల విధానం...

రైతులు అధిక దిగుబడి, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల వైపు వెళ్లేలా వ్యవసాయ విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. కొన్ని పంటలు, కొన్ని పద్ధతులకే రాయితీలు పరిమితం కావడం వల్ల వ్యవసాయంలో సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందన్నారు. రైతులకు అవసరమైన పంటలు, భూమి సంరక్షణ, సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే విధంగా రాయితీల విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి సేద్యాన్ని కూడా పెంచి పోషించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకొని రైతులకు అవగాహాన కల్పించాలని కోరారు.

వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో నాణ్యతకు పెద్దపీట...

వ్యవసాయ విద్యలో నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 11 ప్రైవేట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలను తనిఖీ చేయగా, ప్రమాణాలు పాటించని 6 కళాశాలల అనుబంధాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. మిగిలిన నాలుగు కళాశాలలను కూడా మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తోందని, నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోతే వాటిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మౌలిక వసతులు, ప్రయోగాత్మక పొలాలు, ప్రయోగశాలలు, బోధన సదుపాయాలు, అధ్యాపకులు, విద్యార్థుల వసతి తదితర అంశాల్లో నిర్దేశిత ప్రమాణాలను పాటించేలా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్నల్ మానిటరింగ్ కమిటీ, టెక్నికల్ ఇన్‌స్పెక్షన్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

డిమాండ్ లేని కోర్సులను ఆధునీకరణకు అనుగుణంగా మార్పు...

వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులకు ప్రస్తుతం తగిన విద్యార్థుల డిమాండ్ లేదని మంత్రి తెలిపారు. గతంలో 750 సీట్లు ఉండగా వాటిని 450 సీట్లకు తగ్గించినప్పటికీ, కొన్ని కళాశాలల్లో 8 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే చేరుతున్న పరిస్థితి ఉందని చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కళాశాలల్లో అధ్యాపకులు, మౌలిక వసతులు కల్పించాల్సి ఉన్నందున, ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించేలా కళాశాలలను పునర్వ్యవస్థీకరిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలోని నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలుగా ఆధునీకరించి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

 

Advertisement
Advertisement