త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drinking Water | తెలంగాణ‌పై తీవ్రంగా ఎల్ నినో ఎఫెక్ట్.. తాగ‌డానికి కూడా నీళ్లు క‌ష్ట‌మే

Drinking Water | సాగునీటి నుంచి తాగునీటికి క‌ష్ట‌మొచ్చే ప‌రిస్థితులు క‌ళ్ల ముందు కనిపిస్తున్నాయి. రాబోయే రెండు, మూడు మాసాల్లోనే తాగునీటి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని స్వ‌యానా రాష్ట్ర‌ ప్ర‌భుత్వ‌మే హెచ్చ‌రిస్తోంది. రాష్ట్రంలోని అన్ని రిజ‌ర్వాయ‌ర్లు కూడా డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయ‌ని, తాగ‌డానికి కూడా నీళ్లు క‌ష్ట‌మే అని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

S

Telangana | Published On Jul 19, 2026, 7.41 pm IST

Drinking Water | తెలంగాణ‌పై తీవ్రంగా ఎల్ నినో ఎఫెక్ట్.. తాగ‌డానికి కూడా నీళ్లు క‌ష్ట‌మే
Advertisement

ప‌శ్చిమాసియా యుద్ధం కంటే
ఎల్ నినో చూపించే ప్ర‌భావం ఎక్కువ‌
అన్ని రిజ‌ర్వాయ‌ర్లు డెడ్ స్టోరేజీలోనే
డ్రింకింగ్ వాట‌ర్ కూడా కష్ట‌మ‌య్యే స్థితిలో లెవ‌ల్స్
ఇప్ప‌టికీ 40 శాతం లోటు వ‌ర్ష‌పాతం
ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌లో కూడా ఇదే ప‌రిస్థితి
హెచ్చ‌రిస్తున్న శాస్త్ర‌వేత్త‌లు, నిపుణులు
అడుగంటిన భూగ‌ర్భ‌జ‌లాలు
స‌న్న‌గిల్లుతున్న ఐవోడీ ఆశ‌లు..!
ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్ జిల్లా స‌మీక్ష‌లో మంత్రి తుమ్మ‌ల‌

Drinking Water | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో క‌రువు క‌రాళ నృత్యం చేస్తున్న‌ది.. సాగుకే కాదు.. తాగ‌డానికి కూడా గుక్కెడు నీళ్లు దొర‌క‌ని ప‌రిస్థితి దాపురించే అవ‌కాశం ఉంది. జూలై మాసం ముగుస్తున్న‌ప్ప‌టికీ వ‌రుణ దేవుడు క‌రుణించ‌క‌పోవ‌డంతో.. అన్న‌దాత‌లు పొలాల వైపు క‌న్నెత్తి చూడ‌టం లేదు. రైతు కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్న ఆ పొలాలు వెల‌వెల‌బోతున్నాయి. నిండు వ‌ర్షాకాలంలోనూ బీడు భూములుగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. బోరు బావులున్న చోటైనా క‌నీసం సాగు చేద్దామంటే.. ఆ భూగ‌ర్భ జ‌లాలు కూడా అడుగంటిన ప‌రిస్థితి. మొత్తానికి తెలంగాణ అన్న‌దాత ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింది. మూలిగే న‌క్క‌పై తాటికాయ ప‌డ్డ‌ట్టు.. సాగునీటి నుంచి తాగునీటికి క‌ష్ట‌మొచ్చే ప‌రిస్థితులు క‌ళ్ల ముందు కనిపిస్తున్నాయి. రాబోయే రెండు, మూడు మాసాల్లోనే తాగునీటి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని స్వ‌యానా రాష్ట్ర‌ ప్ర‌భుత్వ‌మే హెచ్చ‌రిస్తోంది. రాష్ట్రంలోని అన్ని రిజ‌ర్వాయ‌ర్లు కూడా డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయ‌ని, తాగ‌డానికి కూడా నీళ్లు క‌ష్ట‌మే అని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

ఎల్ నినో నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ల‌తో సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఎల్ నినో ప్ర‌భావ నివార‌ణ‌కు చేప‌ట్టాల్సిన ప్ర‌త్యామ్నాయ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌పై మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఈ స‌మావేశంలో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఇరిగేష‌న్, అగ్రిక‌ల్చ‌ర్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు మాట్లాడారు.

ఈ సూప‌ర్ ఎల్‌నినో చాలా తీవ్రంగా ఉంద‌ని చెప్పి వాతావ‌ర‌ణ శాఖ ప‌దేప‌దే హెచ్చ‌రిస్తోంది. అది కూడా భార‌త‌దేశం మీద ప్ర‌భావం చూపుతుంద‌ని. అందులో కూడా ద‌క్షిణ భార‌త‌దేశంపై అధిక ప్ర‌భావం ఉంటుంద‌ని. ద‌క్షిణ భార‌త‌దేశంలో కూడా తెలంగాణ‌, ఆంధ్రా, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల మీద ఎక్కువ ప్ర‌భావం ఉంద‌ని. అయితే మ‌న రాష్ట్రానికి సంబంధించి తీవ్రంగానే ఉంట‌ద‌ని భావించి నిపుణుల యొక్క సూచ‌న‌ల‌కు అనుగుణంగా మ‌నం రైతాంగాన్ని అప్ర‌మ‌త్తం చేసి, యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచ‌క‌పోతే రాబోయే తీవ్ర‌మైన ప‌రిస్థితులను ఎదుర్కోవ‌డం చాలా క‌ష్టం. అన్ని రంగాల మీద ఈ ప్ర‌భావం ఉంట‌ది అని మంత్రి తెలిపారు.

ప‌శ్చిమాసియా యుద్ధం కంటే ఎక్కువ న‌ష్టం..

ఇప్ప‌టికే ప‌శ్చిమాసియా యుద్ధం వ‌ల్ల జ‌రిగిన న‌ష్టం కంటే ఈ ఎల్‌నినో చూపించే ప్ర‌భావం తీవ్రంగా ఉంట‌ద‌ని చెప్పి రాష్ట్ర కేబినెట్ భావించి అత్య‌వ‌స‌ర స‌మావేశాలు ఏర్పాటు చేసుకొని వ్య‌వ‌సాయ శాఖ‌కు సంబంధించిన‌టువంటి కంటింజెన్సీ ప్లాన్‌ను జిల్లా క‌లెక్ట‌ర్ల ద్వారా ప్ర‌తి గ్రామానికి వెళ్లేలా చ‌ర్య‌లు తీసుకున్నాం. వ‌ర్షాభావ ప‌రిస్థితులు ఉంటే ఎప్పుడు, ఏ ర‌కంగా పంట‌లు వేయాలో సుదీర్ఘంగా చెబుతున్నాం. ఇదే స‌మాచారం ప్ర‌తి రైతుకు చేరేలా జిల్లా యంత్రాంగం ప‌ని చేయాలి. రేప‌ట్నుంచి ప్ర‌జాప్ర‌తినిధులు ఒక ప‌క్క‌, యంత్రాంగం ఒక ప‌క్క.. అంద‌రూ క‌లిసి స‌మ‌న్వ‌యంతో మ‌న రైతాంగాన్ని, మ‌న వ్య‌వ‌సాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త ఉంది అని తుమ్మ‌ల పేర్కొన్నారు.

ఆందోళ‌న‌క‌రంగా వాట‌ర్ లెవ‌ల్స్..

ఇది మ‌న చేతిలో లేన‌టువంటి అంశం. ఇది ప్ర‌కృతి వైప‌రీత్యం. కాబ‌ట్టి ఈ యొక్క క‌ష్టాన్ని మ‌నం ఏర‌కంగా పూడ్చ‌గ‌లుగుతామో దానికోసం ప్ర‌య‌త్నం చేయాలి. అన్ని రిజ‌ర్వాయ‌ర్లు కూడా డెడ్ స్టోరేజీతోనే ఉన్నాయి. ఎక్క‌డా కూడా డ్రింకింగ్ వాట‌ర్‌కు మించి, అస‌లు డ్రింకింగ్ వాట‌ర్ కూడా కష్ట‌మ‌య్యే స్థితిలోనే లెవ‌ల్స్ ఉన్నాయి. అది శ్రీరాం సాగ‌ర్ కావొచ్చు.. నాగార్జున సాగ‌ర్ కావొచ్చు. లోటు వ‌ర్ష‌పాతంతో వాట‌ర్ లెవ‌ల్స్ చాలా ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయి. ప‌దేప‌దే మేం గ‌త రెండు నెల‌లుగా వాతావ‌ర‌ణ నిపుణుల‌తో పాటు వ్య‌వ‌సాయ శాఖ హెచ్చ‌రిస్తుంది. ఈ సంవ‌త్స‌రం వ‌ర్షాభావ ప‌రిస్థితులు ఉంటాయని మంత్రి తెలిపారు.

మ‌రో రెండు నెల‌ల్లో ప్ర‌మాద ఘంటిక‌లు

కాబ‌ట్టి పంట మార్పిడితో పాటు త‌క్కువ నీరు వినియోగ‌మ‌య్యే పంట‌ల‌ను రైతులు అనుభ‌వ‌పూర్వ‌క‌ముగా నేల స్వ‌భావాన్ని బ‌ట్టి సాగు చేయాలి. క‌లెక్ట‌ర్, గ్రామ స‌భ‌లు, రైతు వేదిక‌లు, రైతు నేస్తం ద్వారా రైతాంగం ముందు ఉంచ‌డం జ‌రిగింది. అయినా సరే జూలై 15 వ‌ర‌కు పెట్టుకున్న‌టువంటి ఆశ‌లు ఏ మాత్రం కూడా అందుబాటులో లేవు. ఇప్ప‌టికీ 30 నుంచి 40 శాతం వ‌ర్ష‌పాతం లోటు ఉంది. రేపు ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ కూడా ఇదే ప‌రిస్థితి ఉంట‌ద‌ని చెప్పి లేటెస్ట్ ఇండికేష‌న్స్ కూడా వాతావ‌ర‌ణ నిపుణులు, శాస్త్ర‌వేత్త‌లు, అన్ని దేశాల నిపుణులు కూడా చెబుతున్నార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఆ అవ‌కాశాలు కూడా ద‌క్షిణ భార‌త్‌కు త‌క్కువే

కాబ‌ట్టి ప‌సిఫిక్ మ‌హా స‌ముద్రంలో ఏర్ప‌డిన‌టువంటి అధిక ఉష్ణోగ్ర‌త‌ల వ‌ల్ల ఈ నైరుతి రుతుప‌వ‌నాలు కానీ, ఏ రుతుప‌వ‌నాలు కానీ కూడా మ‌న దేశాన్ని తాకే అవ‌కాశాలు లేవు. ఒక‌వేళ ఎల్‌నినో ప్ర‌భావం వ‌ల్ల క్లౌడ్ బ‌ర‌స్ట్ అయి నిన్న చైనా, జ‌మ్మూక‌శ్మీర్‌లో కురిసిన‌ట్టు కూడా కురిసే అవ‌కాశం ఉంది. కానీ ఆ అవ‌కాశాలు కూడా ద‌క్షిణ భార‌త‌దేశానికి త‌క్కువ‌. ఒకే ఒక్క అవ‌కాశం ఉంది.. ఐవోడీ(ఇండియ‌న్ ఓషీయ‌న్ డైపోల్). అది ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలో ఏర్ప‌డితే ఈ వేడిగాలుల‌ను కొంత వ‌ర‌కు నిలుపుద‌ల చేసి కొంత రుతుప‌వ‌నాల‌ను మ‌న దేశానికి పంపించే అవ‌కాశం ఉంట‌ది నార్మ‌ల్‌గా. కానీ అది ఏర్ప‌డుతుందా.. ఏర్ప‌డ‌దా.. ఏర్ప‌డితే ప‌సిఫిక్ మ‌హా స‌ముద్రం నుంచి వ‌చ్చే విప‌రీతాన్ని త‌ట్టుకోగ‌ల‌దా.. లేదా.. అదొక్క‌టే భార‌త‌దేశానికి కొంత అవ‌కాశం ఉండేట‌టువంటి అవ‌కాశం ఉంది. అది కూడా ఆశ‌లు స‌న్న‌గిల్లుతున్నాయని తుమ్మ‌ల పేర్కొన్నారు.

రైతుల‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది

కాబ‌ట్టి మ‌నం ఈ స‌మ‌యంలో ప్ర‌భుత్వం, జిల్లా యంత్రాంగం, ప్ర‌జాప్ర‌తినిధులు క‌లిసి రైతుల‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. దానికి కొన్ని క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు చేయాల్సిన ప‌రిస్థితి, వాస్త‌వాన్ని రైతుల‌కు చెప్పాల్సిన అస‌వ‌రం ఉంది. రిజ‌ర్వాయ‌ర్స్‌లో నీళ్లు లేవ‌ని ఇరిగేష‌న్ వాళ్లు డిక్లేర్ చేయ‌మ‌ని చెప్పినం. ఈ పంట కాలానికి కెనాల్ ఇరిగేష‌న్‌లో అవ‌కాశాలు త‌క్కువ‌. అది ఏ రిజ‌ర్వాయ‌ర్ అయినా కావొచ్చు. మీడియం కానీ, మైన‌ర్ కానీ ఉంటే జిల్లాల్లో త‌క్ష‌ణ‌మే మీటింగ్‌లు పెట్టుకుని జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, క‌లెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో స‌మీక్ష‌లు చేయాల‌ని మంత్రి సూచించారు.

మూడు నెల‌లు వ‌ర్షాలుంటేనే గ్రౌండ్ వాట‌ర్..

కొంచెం కొంచెం నీళ్లు ఉంటే ఏ పంట‌ల‌కు ఇవ్వొచ్చు.. ఎన్ని ఎక‌రాల‌కు ఇవ్వొచ్చు అనేది ఇప్పుడే డిసైడ్ చేసి చెప్పాలి. భూగ‌ర్భ‌జ‌లాలు కూడా త‌గ్గిపోతున్నాయి. ఇప్పటికే గ‌త ఏడాది కంటే 2 నుంచి 3 మీట‌ర్ల లెవ‌ల్స్ త‌గ్గి ఉన్నాయి. ఇటువంటి చిరుజ‌ల్లుల‌కు గ్రౌండ్ వాట‌ర్ పెర‌గ‌దు. వాగులు, వంక‌లు, చెరువులు, న‌దులు ఓవ‌ర్‌ప్లో అయి రెండు, మూడు నెల‌లు వ‌ర్షాలు ఉంటే త‌ప్ప భూగ‌ర్భ‌జ‌లాలు పెంచుకునేందుకు అవ‌కాశాలు త‌క్కువ అని మంత్రి తెలిపారు.

వ‌ర్షాలు ప‌డితేనే.. విత్త‌నాలు వేయాలి..

నేల స్వ‌భావాన్ని బ‌ట్టి విత్త‌నాలు కూడా స‌మ‌కూర్చుకుని ఆగ‌స్టు 15 వ‌ర‌కు సిద్ధంగా ఉండాలి. అది కూడా వ‌ర్షాలు ప‌డితే.. కాబ‌ట్టి త‌క్కువ నీటితో.. అవి చిరు ధాన్యాలు వేసుకుంటామా.. ప‌ప్పు ధాన్యాలు వేసుకుంటామా.. అదేవిధంగా ఆయిల్ సీడ్స్ వేసుకుంటామా.. హార్టిక‌ల్చ‌ర్‌కు వెళ్తామా.. వాటిని ఏ విధంగా స‌వ‌రించుకుంటామా అనేది శాస్త్ర‌వేత్త‌లు చెప్పిన‌ట్లు రైతులు చేయాల‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు సూచించారు.

Advertisement
Advertisement