త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | అక్ర‌మాల‌ను ఉక్కుపాదంతో అణ‌చివేస్తాం.. రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో సంస్క‌ర‌ణ‌లు: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో పేద‌ల‌కు ఇచ్చిన భూముల‌తోపాటు ప్ర‌భుత్వ భూముల‌ను ప‌రిర‌క్షిస్తామ‌ని, ఈ విష‌యంలో అక్ర‌మాల‌ను ఉక్కుపాదంతో అణ‌చివేస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు.

G

Telangana | Published On Jan 12, 2026, 1.16 pm IST

Ponguleti Srinivas Reddy | అక్ర‌మాల‌ను ఉక్కుపాదంతో అణ‌చివేస్తాం.. రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో సంస్క‌ర‌ణ‌లు: మంత్రి పొంగులేటి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో పేద‌ల‌కు ఇచ్చిన భూముల‌తోపాటు ప్ర‌భుత్వ భూముల‌ను ప‌రిర‌క్షిస్తామ‌ని, ఈ విష‌యంలో అక్ర‌మాల‌ను ఉక్కుపాదంతో అణ‌చివేస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ఆదాయ వనరుగా కాకుండా, సేవా కేంద్రంగా చూస్తున్న‌ద‌ని వెల్ల‌డించారు. రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తుంద‌న్నారు. హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలో నిర్మిస్తున్న‌ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు.

అనంత‌రం మాట్లాడుతూ.. ప్రజలకు సౌకర్యం, పరిపాలనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడతలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో, రెండో విడతలో జిల్లా కేంద్రాల్లో, మూడో విడతలో నియోజకవర్గ కేంద్రాల్లో సమీకృత భవనాలు నిర్మిస్తామని తెలిపారు. మొదటి దశలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు.

ఇప్పటికే గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) భవనంలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశార‌ని, జూన్ నాటికి ఆ భవనాన్ని ప్రారంభించుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా బిల్డర్స్‌తోనే ఈ 12 స‌మీకృత భవనాలను నిర్మిస్తున్నామన్నారు. అదేవిధంగా నిర్మాణ‌దారులే క‌నీసం ఐదేళ్ల‌పాటు వాటిని నిర్వ‌హించాల‌న్న నిబంధ‌న విధించామ‌ని వెల్ల‌డించారు. ఇక్క‌డ కొత్త‌గా పెళ్ల‌యి రిజిస్ట్రేష‌న్‌కు వ‌చ్చే జంట‌లు, చిన్న పిల్ల‌ల‌తో వ‌చ్చే త‌ల్లులు, పేద‌ల‌కు స‌క‌ల సౌక‌ర్యాలు ఉంటాయ‌న్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ఆదాయ వనరుగా కాకుండా, సేవా కేంద్రంగా చూస్తున్న‌ద‌ని పేర్కొన్నారు.

గ‌త రెండేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా కేవ‌లం రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జానాకు డ‌బ్బు చేకూర్చాల‌నే ఆలోచ‌న కాకుండా పేద‌వారిని దృష్టిలో పెట్టుకొని వివిధ సంస్క‌ర‌ణ‌లు తెచ్చామ‌న్నారు. గ‌తంలో పేద‌ల‌కు ఇచ్చిన భూముల‌తోపాటు ప్ర‌భుత్వ భూముల‌ను ప‌రిర‌క్షిస్తామ‌ని, ఈవిష‌యంలో ఉక్కుపాదంతో అక్ర‌మాల‌ను అణ‌చివేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్షాల‌తో విమ‌ర్శించుకునే ప‌రిస్ధితి రాకుండా పేద‌ల ప‌క్షాన ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని చెప్పారు.

ఒక‌ప్పుడు పేద‌ల‌కు పంపిణీ చేసిన భూముల‌ను, అసైన్డ్ భూముల‌ను ఒక వేళ ప్రభుత్వం తీసుకోవాల‌నుకున్నా వారికి త‌గిన ప‌రిహారం, ప్ర‌త్యామ్నాయ స్ధ‌లం మంజూరు వంటి చ‌ర్య‌లు త‌ప్ప‌నిస‌రిగా ఉంటాయ‌న్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మేడారం జాత‌ర కోసం భారీ నిర్మాణాల‌తో ఆధునీక‌రించామ‌ని, ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో జాత‌ర‌కు త‌ర‌లిరావాల‌ని కోరారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement