త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Damodar Rajanarsimha | రిమ్స్‌ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ

Minister Damodar Rajanarsimha | ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రిలో ఎలక్ట్రికల్‌, ఫైర్‌, సివిల్‌ స్ట్రక్చర్‌ సేఫ్టీ ఆడిట్‌లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

P

Telangana | Published On Sep 22, 2026, 9.25 pm IST

Minister Damodar Rajanarsimha | రిమ్స్‌ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ
Advertisement
  • మూడు రకాల సేఫ్టీ ఆడిట్‌లు.. నిపుణుల కమిటీ ఏర్పాటు
  • రిమ్స్‌ను 950 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం
  • మంత్రి దామోదర రాజ‌న‌ర్సింహ‌

Minister Damodar Rajanarsimha | ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రిలో ఎలక్ట్రికల్‌, ఫైర్‌, సివిల్‌ స్ట్రక్చర్‌ సేఫ్టీ ఆడిట్‌లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం రిమ్స్‌ను సందర్శించిన మంత్రి.. ప్రమాదం జరిగిన వార్డును పరిశీలించారు. ఘటన సమయంలో చేపట్టిన సహాయక చర్యలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలపై జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా, రిమ్స్‌ అధికారులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిమ్స్‌ డైరెక్టర్‌ ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు

సోమవారం రాత్రి సుమారు 11.40 గంటలకు నవజాత శిశు వార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని మంత్రి తెలిపారు. ప్రాథమికంగా ఏసీ యూనిట్‌లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారని చెప్పారు. ఏసీకి సంబంధించిన ప్లాస్టిక్‌ భాగాలు కాలిపోవడంతో వార్డులో దట్టమైన పొగ వ్యాపించినట్లు వివరించారు. అయితే, ప్రమాదానికి అసలు కారణం, భద్రతా ప్రమాణాల అమలులో లోపాలున్నాయా? నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? తదితర అంశాలపై పూర్తి స్థాయి విచారణ తర్వాతే స్పష్టత వస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ముగ్గురు చిన్నారుల మృతి బాధాకరం

ప్రమాదం జరిగిన వెంటనే రిమ్స్‌ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక, పోలీసు శాఖలు సమన్వయంతో స్పందించాయని తెలిపారు. విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు అత్యవసర వైద్య సేవలు అందించినట్లు చెప్పారు. ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందడం అత్యంత బాధాకరమని మంత్రి అన్నారు. చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన చోట ప్రైవేట్‌ ఆస్పత్రుల సహకారాన్ని కూడా తీసుకున్నామని వెల్లడించారు.

150 పడకల ఎంసీహెచ్‌ భవనం

రిమ్స్‌లో మాతా, శిశు సంరక్షణ సేవలను మరింత మెరుగుపర్చేందుకు 150 పడకల మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ భవనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం రిమ్స్‌లో సుమారు 800 పడకలు ఉన్నాయని.. కొత్త భవనం అందుబాటులోకి వస్తే మొత్తం సామర్థ్యం దాదాపు 950 పడకలకు చేరుతుందని చెప్పారు. రిమ్స్‌ను సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. త‌లసేమియా, సికిల్‌సెల్‌ అనీమియా, హిమోఫీలియా వంటి వ్యాధులకు మెరుగైన చికిత్స కోసం హెమటాలజీ విభాగాన్ని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యం అందించేందుకు ప్రత్యేక ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పీజీ సీట్లు, ఓపీ, ఐపీ సేవలను పెంచడంతో పాటు పీడియాట్రిక్స్‌, గైనకాలజీ, రేడియాలజీ తదితర విభాగాల్లో పీజీ సీట్ల పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు

అగ్నిప్రమాదంపై విచారణకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, భద్రతా లోపాలు, నిర్వహణ అంశాలను కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. కమిటీ నివేదికతో పాటు సేఫ్టీ ఆడిట్‌ల ఆధారంగా మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన, పునరుద్ధరణ, కొత్త భవనాలు, అదనపు సిబ్బంది వంటి అవసరాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామన్నారు. మెయింటెనెన్స్‌, మానిటరింగ్‌, భద్రతా ప్రమాణాల అమలులో ఎక్కడైనా లోపాలున్నాయా అనే విషయాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తామని చెప్పారు. ఎవరి నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం బయటపడినా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చాంగ్తూ, డీఎంఏ వాణి, జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఐటీడీఏ పీవో మంద మకరంద్‌, అదనపు కలెక్టర్‌ ఆర్‌ఎస్ చిత్రు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష, గ్రంథాలయ చైర్మన్‌ మల్లెపూల నర్సయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో సాధన, వైద్యులు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement