త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adluri Laxman | బీజేపీ ఆదేశాల పార్టీ.. కాంగ్రెస్ ప్ర‌జాస్వామ్య పార్టీ.. ధ‌ర్మ‌పురి అర‌వింద్‌కు మంత్రి అడ్లూరి చుర‌క‌

Adluri Laxman | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలు, రైతాంగం, కేంద్ర నిధులు, రాష్ట్ర హక్కులపై మాట్లాడాల్సిన బాధ్యత గల ప్రజాప్రతినిధులు వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరమన్నారు.

S

Telangana | Published On May 19, 2026, 6.31 pm IST

Adluri Laxman | బీజేపీ ఆదేశాల పార్టీ.. కాంగ్రెస్ ప్ర‌జాస్వామ్య పార్టీ.. ధ‌ర్మ‌పురి అర‌వింద్‌కు మంత్రి అడ్లూరి చుర‌క‌
Advertisement

Adluri Laxman | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలు, రైతాంగం, కేంద్ర నిధులు, రాష్ట్ర హక్కులపై మాట్లాడాల్సిన బాధ్యత గల ప్రజాప్రతినిధులు వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరమన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

“అరవింద్ కుటుంబ రాజకీయ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్ పార్టీతో. అలాంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం” అని మంత్రి వ్యాఖ్యానించారు. “మీ భారతీయ జనతా పార్టీలా నాగపూర్‌లో కూర్చొని ఆదేశాలు అమలు చేసే పార్టీ కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని నడిచే ప్రజాస్వామ్య పార్టీ” అని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్ల గురించి ఎంపీ అరవింద్ మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టిన మంత్రి.. “నిజామాబాద్‌లో మీ తమ్ముళ్లు చేస్తున్న అరాచకాల గురించి మేము మాట్లాడలేమా?” అని ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడండి. మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మొక్కజొన్నకు మద్దతు ధర ఇప్పించండి. రైతులకు ఉపయోగపడే విధంగా కేంద్రం నుంచి సహాయం తీసుకురండి” అని సవాల్ విసిరారు.

“మూడోసారి అధికారంలోకి వస్తామని అహంకారంగా మాట్లాడిన పార్టీ మెడలు వంచి, ప్రజలను ఒప్పించి, ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారంలోకి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి” అని మంత్రి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సామాన్య జీవితం నుంచి ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలిచిన బలమైన నాయకుడని కొనియాడారు. గ్రామస్థాయి రాజకీయాల నుంచి ఎమ్మెల్యే, పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగి చివరకు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు.

“2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకపోయింది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు” అని విమర్శించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వరి ధాన్యం గోదాములు నిండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ఎంపీగా అరవింద్ ప్రధాని నరేంద్ర మోదీతో గానీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో గానీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

“రైతుల గురించి మాట్లాడరు.. వడ్ల గురించి మాట్లాడరు.. మొక్కజొన్న రైతుల గురించి మాట్లాడరు.. కానీ వ్యక్తిగత విమర్శలు మాత్రం చేస్తారు” అంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం భారీ ఆర్థిక భారం భరిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులు, అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నారని ఆరోపణలు చేస్తున్న జగదీష్ రెడ్డి.. ముందుగా పేర్లు బయట పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. “ముందు వాళ్ల కుటుంబ తగాదాలు సరిచేసుకోవాలి. ఇతర పార్టీలపై విమర్శలు చేయడం తర్వాత విషయం” అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే నాలుగు అమలు చేశామని మంత్రి తెలిపారు. మిగిలిన రెండు గ్యారంటీలను కూడా దశలవారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. “ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీతనం ముఖ్యం. వ్యక్తిగత విమర్శలు కాదు. తెలంగాణ ప్రజల సమస్యలు, రైతాంగ సమస్యలు, రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడితే ప్రజలు గౌరవిస్తారు” అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు.

Advertisement
Advertisement