త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maheshkumar Goud | మీడియా సంస్థ‌లు స్వ‌తంత్రంగా ఉండాలి.. లేదంటే నిజాలు బ‌య‌టికి రావ్‌

Maheshkumar Goud | మీడియా సంస్థ‌లు స్వ‌తంత్రంగా ఉండాల‌ని.. లేదంటే నిజాలు బ‌య‌టికి రావ‌ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నేడు సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తోందన్నారు. ఇదే సమయంలో తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్ కూడా పెరుగుతున్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అందుకే బాధ్యతాయుతమైన జర్నలిజం అవసరమ‌ని నొక్కి చెప్పారు.

S

Telangana | Published On Aug 1, 2026, 6.35 pm IST

Maheshkumar Goud | మీడియా సంస్థ‌లు స్వ‌తంత్రంగా ఉండాలి.. లేదంటే నిజాలు బ‌య‌టికి రావ్‌
Advertisement
  • పత్రికా స్వేచ్ఛ బ‌లంగా ఉంటేనే ప్రజల గొంతు నిల‌బ‌డుతుంది
  • మీడియాను బలహీనపరిస్తే నష్టపోయేది ప్రజాస్వామ్యమే
  • సోష‌ల్ మీడియా వేగంగా విస్త‌రిస్తోంది.. బాధ్య‌తాయుత‌మైన జ‌ర్న‌లిజం అవ‌స‌రం
  • నవ తెలంగాణకు దశాబ్దాల చరిత్ర ఉంది.. క‌మ్యూనిజానికి చావు లేదు
  • బీజేపీ ప‌త్రికా స్వేచ్ఛ‌ను హ‌రిస్తోంది
  • నవ తెలంగాణ 11వ వార్షికోత్సవలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య‌లు

Maheshkumar Goud | త్రినేత్ర‌.న్యూస్: మీడియా సంస్థ‌లు స్వ‌తంత్రంగా ఉండాల‌ని.. లేదంటే నిజాలు బ‌య‌టికి రావ‌ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నేడు సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తోందన్నారు. ఇదే సమయంలో తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్ కూడా పెరుగుతున్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అందుకే బాధ్యతాయుతమైన జర్నలిజం అవసరమ‌ని నొక్కి చెప్పారు. దేశంలో కమ్యూనిజం ఇంకా బ‌ల‌ప‌డాల‌ని ఆకాంక్షించారు. బీజేపీ ప్ర‌భుత్వం ప‌త్రికా స్వేచ్ఛ‌ను హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. శ‌నివారం నిర్వ‌హించిన‌ నవ తెలంగాణ 11వ వార్షికోత్సవ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగించారు.

తప్పులను ఎత్తిచూపడం ముఖ్యం..

విప్లవాత్మక మార్పు మీడియాలో వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఆ జవాబుదారీతనాన్ని గుర్తు చేసేది మీడియానే. అందుకే మీడియాను బలహీనపరిస్తే చివరకు నష్టపోయేది ప్రజాస్వామ్యమే. మీడియా ప్రజల పక్షం. ప్రభుత్వాలు చేసే మంచి పనులను ప్రజలకు చెప్పడం ఎంత ముఖ్యమో, తప్పులను ఎత్తిచూపడం కూడా అంతే ముఖ్యం. ప్రజా శక్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి నిరంతరం ప్రజా సేవలో నవతెలంగాణ ఉంది. ఆనాటి ప్రజాశక్తి నేటి నవ తెలంగాణకు యాజమాన్యానికి, సాంకేతిక సిబ్బందికి, మన స్పూర్తిగా అభినందనలు అని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు.

మీడియా సంస్థలు కార్పొరేట్ గుప్పిట్లో లోకి వెళ్ళిపోతే నిజాలు మరుగునపడతాయి. దేశ ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలు.. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థతో పాటు పత్రికా రంగం కూడా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. ఈ నాలుగు స్తంభాలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిలుతుంది. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. కేంద్రంలోని బీజేపీ పత్రిక స్వేచ్ఛను హరిస్తుంది. పత్రికా స్వేచ్ఛ అనేది ఏ ప్రభుత్వానికీ ఇచ్చిన వరం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కు అని మ‌హేశ్‌కుమార్ నొక్కి చెప్పారు.

ఈరోజు దేశంలో విభిన్న అభిప్రాయాలను అణిచివేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విమర్శిస్తే దేశద్రోహం అనే ముద్ర వేయడం, ప్రశ్నిస్తే శత్రువులుగా చూడటం, మీడియాపై ఒత్తిళ్లు తీసుకురావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దేశ పౌరులుగా పత్రిక స్వేచ్ఛపై ఆలోచించాలి. ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడితే నక్సలైట్లకు మద్దతు ఇస్తున్నానని దేశ ద్రోహి, శాంతి ప్రగతికి విఘాతం కలిగిస్తున్నారని ప్రచారం చేశారు. కమ్యూనిజానికి దేశంలో చావు లేదు. కమ్యునిజం బలపడాలి. అధికారం కోసం ప్రధాని అమిత్ షా ఎంత దూరమైన పోతారు అని ఆయ‌న ఆరోపించారు.

దేశంలో ప్రశ్నిస్తే దేశ ద్రోహం ముద్ర వేస్తున్నారు. శ్రీరాముడికి బీజేపీలో సభ్యత్వం లేదు. శ్రీరాముడు అందరివాడు. రాముడి పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. ఎన్నికలు రాగానే దేవుళ్ళ పేరిట రాజకీయాలు చేయడం పరిపాటిగా మారింది. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. "రాజ్యాంగం బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం బలంగా ఉంటేనే పత్రికా స్వేచ్ఛ సురక్షితంగా ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ సురక్షితంగా ఉంటేనే ప్రజల గొంతుక సజీవంగా ఉంటుంది అని ఎమ్మెల్సీ మ‌హేశ్‌కుమార్ వ్యాఖ్యానించారు.

రాజ్యాంగ‌మే శాశ్వతం..

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదు. అధికారాలు శాశ్వతం కాదు. రాజ్యాంగ‌మే శాశ్వతం. రాజ్యాంగ విలువలను పరిరక్షించడం ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి పౌరుడి బాధ్యత. రాజ్యాంగం బలహీన పడితే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. స్వేచ్ఛ మితిమీరొద్దు.

అభివృద్ధి కోసం రాజ‌కీయాలు ప‌క్క‌న పెడ‌దాం..

ఉద్యమ నేతగా కేసీఆర్ గారిని గౌరవిస్తా. రాజకీయాల్లో విమర్శలు సహజం.నియోజకవర్గానికి 3 వేల ఇల్ల చొప్పున ఇస్తున్నాం. ప్రభుత్వానికి సలహాలు, సూచనలతో పాటు తప్పులను ఎత్తి చూపండి. కుల సర్వే నిర్వహించాం. కేంద్రం చట్టాలను తొక్కి పెట్టింది. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కన పెట్టి నిధుల కోసం కోట్లాడదాం. జంతర్ మంతర్ విద్యార్థుల పోరాటానికి సెల్యూట్. విద్యార్థి లోకాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నా అని మ‌హేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement