త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagga Reddy | సదాశివపేటలో హైడ్రామా.. జగ్గారెడ్డి డబ్బులు పంచుతుండగా అడ్డగించిన పోలీసులు

సదాశివపేటలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డబ్బులు పంచుతూ పోలీసుల కంటబడ్డారు. ఓ హోటల్ వద్ద వృద్ధులకు డబ్బులిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఆయనపై కేసు నమోదైంది.

J

Telangana | Published On Feb 10, 2026, 4.40 pm IST

Jagga Reddy  | సదాశివపేటలో హైడ్రామా.. జగ్గారెడ్డి డబ్బులు పంచుతుండగా అడ్డగించిన పోలీసులు
Advertisement

-జగ్గారెడ్డిపై కేసు నమోదు
-డబ్బులు పంచుతుండగా అడ్డగించిన పోలీసులు

Jagga Reddy  | త్రినేత్ర.న్యూస్ : సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పర్యటన వివాదాస్పదంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ, ఆయన బహిరంగంగా డబ్బులు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది.

అసలేం జరిగింది?

సదాశివపేట పట్టణంలోని చాంద్ భాయ్ హోటల్ వద్దకు వచ్చిన జగ్గారెడ్డి, అక్కడ ఉన్న వృద్ధులు, పేద ప్రజలను పలకరించి వారికి డబ్బులు పంచడం ప్రారంభించారు. అంతేకాకుండా, ఆయన స్వయంగా బైక్‌పై తిరుగుతూ పట్టణంలో డబ్బులు పంపిణీ చేసినట్లు సమాచారం.

ఓటమి భయంతోనేనా?

జగ్గారెడ్డి తీరుపై స్థానికులు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓటమి భయంతోనే ఆయన వ్యూహం మార్చారని, ఓటర్లను ప్రలోభపెట్టడానికి స్వయంగా రంగంలోకి దిగి డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రంగంలోకి దిగిన పోలీసులు - కేసు నమోదు

జగ్గారెడ్డి డబ్బులు పంచుతున్న విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి జగ్గారెడ్డిని అక్కడి నుంచి పంపించివేశారు.

ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో డబ్బులు పంచడం నిబంధనలకు విరుద్ధం కావడంతో, జగ్గారెడ్డిపై సదాశివపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని సదాశివపేట సీఐ వెంకటేష్ ధృవీకరించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Advertisement
Advertisement