త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gajwel Land Scam | గజ్వేల్‌లో రాత్రికి రాత్రే 50 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి మాయం!

గజ్వేల్ హవాడిగూడలో దళితుల భూములను లాక్కొని కాంగ్రెస్ నేతలకు కట్టబెట్టారా? రాత్రికి రాత్రే రికార్డులు ఎలా మారాయో తెలిస్తే అవాక్కవుతారు.

J

Telangana | Published On Sep 2, 2026, 1.44 pm IST

Gajwel Land Scam | గజ్వేల్‌లో రాత్రికి రాత్రే 50 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి మాయం!
Advertisement
  • భారీ భూ కుంభకోణం
  • దళితుల భూములు కాంగ్రెస్ నేతల పరం
  • గజ్వేల్ మండలం హవాడిగూడ (సర్వే నంబర్ 49) లో 50 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి అక్రమ బదిలీ
  • 20 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న దళిత, గిరిజన రైతులను బలవంతంగా గెంటేసిన వైనం
  • గాంధీ భవన్ పీఆర్ఓ తల్లి, ఇతరుల పేర్ల మీదకు రాత్రికి రాత్రే పట్టాలు మార్చిన వైనం
  • సిద్దిపేట కలెక్టర్, రెవెన్యూ అధికారుల తీరుపై ఎస్సీ, ఎస్టీ వర్గాల విచారణ డిమాండ్

Gajwel Land Scam | త్రినేత్ర.న్యూస్ : గజ్వేల్ నియోజకవర్గంలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దళిత, గిరిజన రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను లాక్కొని, అధికార పార్టీ పలుకుబడితో రాత్రికి రాత్రే రికార్డులు మార్చేయడం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. గజ్వేల్ మండలం హవాడిగూడ గ్రామంలోని సర్వే నంబర్ 49లో ఈ దారుణం చోటుచేసుకుంది.

అసైన్డ్ భూమి రికార్డులు ఎలా మారాయి?

హవాడిగూడలోని సర్వే నంబర్ 49లో సుమారు 50 ఎకరాల అసైన్డ్ (ప్రభుత్వ) భూమి ఉంది. గత 50 ఏళ్లుగా రెవెన్యూ రికార్డుల్లో ఇది బంచరాయి, ప్రభుత్వ భూమిగానే నమోదై ఉన్నట్లు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, సిద్దిపేట కలెక్టర్ హైమవతి, స్థానిక రెవెన్యూ సిబ్బంది కలిసి ఈ భూమికి అమ్మకాల క్లియరెన్స్ ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అసైన్డ్ సర్టిఫికెట్ ఉందా లేదా అన్న కనీస విచారణ లేకుండా, రాత్రికి రాత్రే ఈ భూములను పట్టా భూములుగా మార్చేశారు.

వెనక ఉన్నదెవరు?

ఈ భూ బదిలీ వెనుక కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రికార్డులు మార్చిన ఈ 50 ఎకరాలను.. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ పీఆర్ఓ (PRO) తల్లి పేరు మీద 25 ఎకరాలు, మరికొందరి పేరు మీద మరో 25 ఎకరాలు రిజిస్టర్ చేశారు. అసలు ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒకే వ్యక్తికి 50 ఎకరాల అసైన్డ్ భూమి ఎలా దక్కిందనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.

దళిత గిరిజనులకు తీవ్ర అన్యాయం

గత 20 ఏళ్లుగా ఈ భూముల్లో రక్తం చిందించి వ్యవసాయం చేసుకుంటున్న దళిత, గిరిజన రైతుల పొట్టగొట్టారు. ఎకరాకు కేవలం రూ. 20 వేలు చేతిలో పెట్టి, వారి దగ్గర బలవంతంగా లెటర్లు రాయించుకుని భూమి నుంచి తరిమేశారు. ఈ అన్యాయంపై బాధితులు కలెక్టర్ కు, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

విచారణకు ఎస్సీ, ఎస్టీ వర్గాల డిమాండ్

ఈ కుంభకోణంపై RTI (సమాచార హక్కు చట్టం) కింద వివరాలు అడిగినా రెవెన్యూ అధికారులు సమాచారం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ఇంత బహిరంగంగా రికార్డులు తారుమారు చేయడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని, ఎవరి అండతో కలెక్టర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తేలాలని స్థానికులు మండిపడుతున్నారు. సర్వే నంబర్ 49లోని అక్రమాలపై ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి విచారణ జరిపించి, తమకు న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement
Advertisement