త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Goud | త‌మ త‌ప్పిదాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ కొత్త డ్రామా: మ‌హేశ్‌కుమార్ గౌడ్‌

Mahesh Goud | బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన త‌ప్పిదాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ (KTR) కొత్త డ్రామాకు తెర‌తీశాడ‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Goud) మండిప‌డ్డారు. నీటి విషయంలో తప్పిదాలను, ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతల నీతులు చెబుతున్నార‌ని విమ‌ర్శించారు.

G

Telangana | Published On Nov 19, 2026, 3.31 pm IST

Mahesh Goud | త‌మ త‌ప్పిదాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ కొత్త డ్రామా: మ‌హేశ్‌కుమార్ గౌడ్‌
Advertisement
  • రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది కేసీఆరే
  • నీటి విష‌యంలో రాజీ ప్ర‌స‌క్తే లేదు
  • మా లేఖ వ‌ల్లే బ‌న‌క‌చ‌ర్ల‌కు అనుమ‌తులు నిలిచాయి

Mahesh Goud | త్రినేత్ర న్యూస్‌: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన త‌ప్పిదాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ (KTR) కొత్త డ్రామాకు తెర‌తీశాడ‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Goud) మండిప‌డ్డారు. నీటి విషయంలో తప్పిదాలను, ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతల నీతులు చెబుతున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది కేసీఆరేన‌ని (KCR) పున‌రుద్ఘాటించారు. గాంధీభ‌వ‌న్‌లో గురువారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో మ‌హేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గ‌త ప్ర‌భుత్వం పెండింగ్‌లో పెట్టిన క‌ళ్యాణ‌ల‌క్ష్మి, సీఎంఆర్ఎఫ్‌, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల బిల్లుల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే చెల్లించింద‌న్నారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని డ్రామాలు చేసినా ప్రయోజనం శూన్యమ‌ని అన్నారు. నీటి విషయంలో రాజీ ప్రసక్తే లేదని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ వాటా విషయంలో రాజీ ప్ర‌స‌క్తే ఉండదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇప్ప‌టికే పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు.

నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) నుంచి నీళ్లు తరలివెళ్ళకుండా అడ్డుకుంది కాంగ్రెస్ (Congress) పార్టీ మాత్రమేన‌ని చెప్పారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి (KRMB) అప్ప‌గించేందుకు అభ్యంతరం లేదని చెప్పింది గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వమేన‌ని మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ‌న‌క‌చ‌ర్ల‌పై (Banakacherla) కేంద్రానికి త‌మ ప్ర‌భుత్వ‌మే లేఖ‌లు రాసింద‌ని చెప్పారు. తెలంగాణ అభ్యంతరాల వల్లే ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఆగిందని పేర్కొన్నారు. అవ‌స‌ర‌మైతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధ‌మ‌ని తెలిపారు. డ్యామ్ పై కేంద్ర బ‌ల‌గాలు ఉన్నాయ‌ని, కేఆర్ఎంబీ నియంత్ర‌ణ కేంద్రం చేతిలోనే ఉంద‌న్నారు. అయినా కూడా బీఆర్ఎస్ నాయ‌కులు కేంద్రాన్ని ఒక్క మాట కూడా అన‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని మాత్ర‌మే బ‌ద్నాం చేయ‌డంలోనే బీఆర్ఎస్ - బీజేపీ లోపాయ‌కారీ ఒప్పందం బ‌య‌ట‌ప‌డిన‌ట్లైంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

పదేళ్లు పక్కన పెట్టారు..

దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయిన ఎస్ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ పనులను బీఆర్ఎస్ హ‌యాంలో పదేళ్లు పక్కన పెట్టారని విమ‌ర్శించారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా తేలేకపోయారని మండిప‌డ్డారు. పదేళ్లు కృష్ణా బేసిన్‌ను నిర్లక్ష్యం చేశారని ధ్వ‌జ‌మెత్తారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.1.84 ల‌క్ష‌ల కోట్ల ప్ర‌జాధ‌నాన్ని వృధా చేశారని ఆరోపించారు. పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం (PRLIS), క‌ల్వ‌కుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగ‌ర్‌, ఆర్డీఎస్ ఆధునీక‌ర‌ణ‌, డిండి వంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చుంటే రాష్ట్రంలో సాగునీటి విస్తీర్ణం పెరిగేదని అన్నారు. కృష్ణా జ‌లాల విష‌యంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తెలంగాణ‌కు అన్యాయం చేసిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నాడు 36 శాతం చాల‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం అంగీక‌రించిందని చెప్పారు.

ఇప్ప‌డు కాంగ్రెస్ ప్ర‌భుత్వం 70 శాతం వాటా కోసం పోరాడుతోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ 4,464 టీఎంసీల కృష్ణా జ‌లాల‌ను వినియోగించుకుంటే, తెలంగాణ‌కు ద‌క్కింది కేవ‌లం 1,993 టీఎంసీలేన‌ని వివ‌రించారు. కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు లోప భూయిష్టకంగా నిర్మించార‌ని ఆరోపించారు. ఈ విష‌యాన్ని నేషనల్ డ్యామ్ అథారిటీ, జాతీయ స్థాయి నిపుణులు సర్టిఫై చేశారని చెప్పారు. నెహ్రూ హయంలో కట్టిన ప్రాజెక్టులు దేవాలయాలని కొనియాడారు. బీఆర్ఎస్ చౌకబారు ప్రకటనల వల్ల ప్రయోజనం ఉండ‌బోద‌ని హిత‌వు ప‌లికారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రిపై పార్టీ ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, అనిరుధ్ రెడ్డిలు చేసిన వ్యాఖ్య‌ల‌పై అధిష్టానం దృష్టి సారించింద‌ని మ‌హేశ్ చెప్పారు. ఆ వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలిస్తామ‌ని అన్నారు. స‌మ‌యాన్ని బ‌ట్టి నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్య‌వహారాల ఇంచార్జిగా ఇటీవ‌ల నియ‌మితులైన సందీప్ నిబద్ధ‌త గ‌ల నాయ‌కుడ‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు.

Advertisement
Advertisement