త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | సైమన్‌ గో బ్యాక్‌లా.. స‌ర్‌ గో బ్యాక్‌ అనేందుకు సమయం ఆసన్నమైంది: రేవంత్‌రెడ్డి

SIR | దేశంలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటిష్‌ పాలనలో సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశమంతా ఏకమైనట్లే.. ఇప్పుడు ‘SIR గో బ్యాక్‌’ అంటూ దేశమంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ‘ప్రతిదిన్‌ మీడియా నెట్‌వర్క్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది కాంక్లేవ్‌ 2026’లో ఆయన మాట్లాడారు.

P

Telangana | Published On Sep 28, 2026, 9.20 pm IST

SIR | సైమన్‌ గో బ్యాక్‌లా.. స‌ర్‌ గో బ్యాక్‌ అనేందుకు సమయం ఆసన్నమైంది: రేవంత్‌రెడ్డి
Advertisement

SIR | దేశంలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటిష్‌ పాలనలో సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశమంతా ఏకమైనట్లే.. ఇప్పుడు ‘SIR గో బ్యాక్‌’ అంటూ దేశమంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ‘ప్రతిదిన్‌ మీడియా నెట్‌వర్క్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది కాంక్లేవ్‌ 2026’లో ఆయన మాట్లాడారు. స‌ర్ పేరుతో పేదల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బ్రిటిషర్లు సైమన్‌ కమిషన్‌ను తీసుకొచ్చినట్లుగా.. ప్రధాని మోదీ ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించారని ఆయన ఆరోపించారు. దేశ జనాభా తగ్గకుండా ఓట్లు మాత్రమే ఎలా తగ్గుతాయని ప్రశ్నించారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం అధికారాలన్నింటినీ ఢిల్లీలోని ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌ కుమార్‌కు అప్పగించారని ఆరోపించారు. అలాంటప్పుడు బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (BLA), బూత్‌ లెవల్‌ అధికారులు (BLO), కలెక్టర్లు ఎందుకని ప్రశ్నించారు.

దేశమంతా ఏకం కావాలి

‘సైమన్‌ గో బ్యాక్‌’ అంటూ దేశమంతా ఏకమైన చారిత్రక సందర్భాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. అదే తరహాలో ‘స‌ర్‌ గో బ్యాక్‌’ అంటూ దేశమంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. దేశంలో డీలిమిటేషన్‌ అంశంపైనా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను పెంచితే పెద్ద రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని.. చిన్న రాష్ట్రాలు నష్టపోతాయని అన్నారు. ఇది ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య సమస్య కాదని.. ‘గుజరాత్‌ వర్సెస్‌ మొత్తం దేశం’ అన్నట్లుగా పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అభివృద్ధి విషయంలో సహకరించారని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదని విమర్శించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు టెండర్లు పిలిచే సమయంలో కేంద్రం అనుమతులను అడ్డుకుందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీ.. నిధులను మాత్రం గుజరాత్‌కు తరలిస్తున్నారని విమర్శించారు.

మేం పేదల వైపు.. బీజేపీ సంపన్నుల వైపు..

తాము పేదల పక్షాన నిలుస్తుంటే.. బీజేపీ సంపన్నుల పక్షాన ఉంటోందని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘హర హర మహాదేవ్‌’ అని తాము నినదిస్తే బీజేపీకి నచ్చడం లేదని.. ఆ పార్టీ ‘జై శ్రీరామ్‌’ నినాదానికే ప్రాధాన్యం ఇస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. ఆ తర్వాత యువతకు నైపుణ్యాలపై దృష్టి పెడుతున్నామని వివరించారు. చదువు వల్లే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగారని, మన్మోహన్‌సింగ్‌ ప్రధాని అయ్యారని, అబ్దుల్‌ కలాం రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాలకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

బ్లూకాలర్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతుంది..

యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఆనంద్‌ మహీంద్రాను బోర్డు చైర్మన్‌గా నియమించామని చెప్పారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) అప్‌గ్రేడ్‌ చేసి.. టాటా గ్రూప్స్‌తో ఒప్పందం చేసుకుని శిక్షణ అందిస్తున్నామని వివరించారు. భవిష్యత్‌లో బ్లూకాలర్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ మరింత పెరుగుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. జపాన్‌, జర్మనీ, దక్షిణ కొరియాల్లో భారీగా అవకాశాలు ఉన్నాయని.. యువత జర్మన్‌, జపనీస్‌ వంటి భాషలు నేర్చుకుంటే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచించారు.

Advertisement
Advertisement