త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కృష్ణా జ‌లాల త‌ర‌లింపును అడ్డుకునేందుకు ఏం చేసిర్రు? కేఆర్ఎంబీకేమైనా కాంప్లైంట్ ఇచ్చిర్రా?

KTR | కృష్ణా జ‌లాల (Krishna Water) దోపిడీని అడ్డుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఏం కార్యాచ‌ర‌ణ రూపొందించింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Nov 18, 2026, 1.32 pm IST

KTR | కృష్ణా జ‌లాల త‌ర‌లింపును అడ్డుకునేందుకు ఏం చేసిర్రు? కేఆర్ఎంబీకేమైనా కాంప్లైంట్ ఇచ్చిర్రా?
Advertisement
  • ఏపీ ప్ర‌య‌త్నాల‌ను ఎట్ల స‌మ‌ర్థిస్తరు.. మాకు స‌మాధానం చెప్పండి
  • సాగర్‌ను ఇష్టానుసారంగా దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోం
  • అవ‌స‌ర‌మైతే న్యాయ‌పోరాటం చేస్తం
  • మీడియా స‌మావేశంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

KTR | త్రినేత్ర న్యూస్‌: కృష్ణా జ‌లాల (Krishna Water) దోపిడీని అడ్డుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఏం కార్యాచ‌ర‌ణ రూపొందించింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్ర‌శ్నించారు. సాగ‌ర్ నుంచి 90 టీఎంసీల నీటిని కాజేయాల‌నుకుంటున్న‌ ఏపీ (AP) ప్ర‌య‌త్నాల‌ను ఎలా స‌మ‌ర్థిస్తార‌ని నిల‌దీశారు. మిగిలిన 40 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు తెలంగాణకు కేటాయించాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారా? ఏపీ నీటి తరలింపుపై కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఏమైనా ఫిర్యాదు చేసిందా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో బుధ‌వారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర‌య్యారు. సాగ‌ర్‌ను ఇష్టానుసారం దోచుకుంటే చూస్తూ ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. అవ‌స‌ర‌మైతే న్యాయ‌పోరాటానికి దిగుతామ‌న్నారు.

తాగునీటి అవసరాలకే నీరు కొరత ఏర్పడుతున్న సమయంలో 90 టీఎంసీల నీటిని తరలించే ఏపీ ప్రయత్నాలు ఎలా సమర్థిస్తారు? సాగర్ ఏపీ చేపడుతున్న 90 టీఎంసీల నీటి తరలింపును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని కేఆర్ఎంబీని తెలంగాణ ప్రభుత్వం కోరిందా? సమాధానం చెప్పాలి. హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలకు కృష్ణా జలాల్లో ఎంత నీటిని కేటాయించారు? తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎంత నీటిని నిల్వ ఉంచుతుంది?

బోర్లు వేస్తున్నా నీళ్లు పడటం లేదు.. తెలంగాణలో తాగునీటి సంక్షోభంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అక్టోబర్‌కు ముందే ఏపీ నీటి తరలింపుపై తెలంగాణ ప్రభుత్వం మేల్కొందా? కేఆర్ఎంబీ వద్ద ఏమైనా నిరసన తెలిపిందా? కేఆర్ఎంబీలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది.. తెలంగాణ హక్కుల గురించి మాట్లాడేవారే లేరు. కేఆర్ఎంబీలో తెలంగాణ ప్రాతినిధ్యం ఏమైంది? తెలంగాణ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది?

మేం లేఖ రాస్తం.. కేంద్రంపై ఒత్తిడి తెస్తం

ఏపీ నీటి తరలింపుపై కేఆర్ఎంబీకి బీఆర్ఎస్ పార్టీ తరఫున లేఖ రాస్తాం. తెలంగాణ నీటి హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తాం. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.. రాష్ట్ర నీటి హక్కులపై ఎందుకు స్పందించడం లేదు? తెలంగాణ నీటి దోపిడీ జరుగుతుంటే బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు? తెలంగాణ నీటి హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేఆర్ఎంబీకి ఆదేశాలు ఇప్పించాలి.

నీకు మొహ‌మాటం ఉందేమో.. మాకు లేదు

సాగునీటి కోసం రైతులు అల్లాడుతుంటే.. తాగునీటి కోసం ప్రజలు తల్లడిల్లుతుంటే నీటి దోపిడీని చూస్తూ ఊరుకోం. రేవంత్ రెడ్డికి మొహమాటాలు ఉండొచ్చు.. తెలంగాణ నీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్‌కు మొహమాటాలు లేవు. తెలంగాణ జల దోపిడీని అడ్డుకునే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదు. అవసరమైతే ఏపీ నీటి తరలింపుపై న్యాయపోరాటం చేస్తాం.. ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం. నల్గొండలో బహిరంగ సభ నిర్వహించి రైతులు, ప్రజలను జాగృతం చేస్తాం. మహబూబ్‌నగర్‌లోనూ ప్రజలను చైతన్యపరిచి నీటి హక్కుల కోసం పోరాటం చేస్తాం.

కేఆర్ఎంబీ వెంటనే స్పందించాలి

సాగర్‌ను ఇష్టానుసారంగా దోచుకుంటామంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. తెలంగాణ నీటి హక్కులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజా ఉద్యమం తప్పదు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజల నుంచి ఏపీ నీటి దోపిడీకి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. కేఆర్ఎంబీ వెంటనే స్పందించి ఏపీ చేపడుతున్న అక్రమ నీటి తరలింపు ప్రాజెక్టును నిలిపివేయాలి.

కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో జరుగుతున్న నీటి దోపిడీని ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. తెలంగాణ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే.. ఏపీ ప్రభుత్వం తాబేదారులను అడ్డం పెట్టుకొని వనరులను కొల్లగొడుతోంది. తెలంగాణ నీటి హక్కుల అంశాన్ని ప్రజలతో పాటు న్యాయస్థానాలు, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం. తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం.. అవసరమైతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం అని కేటీఆర్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement