త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఆరు గ్యారంటీల అమ‌లు కోసం అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రైవేటు బిల్లు : కేటీఆర్‌

KTR | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమ‌లు కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ మెంబ‌ర్ బిల్లును అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ది. అడ్డుగోలుగా ఓటు వేయించుకొని రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల‌ను మోసం చేసిన ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బిల్లును ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్ల‌డించారు.

P

Telangana | Published On Mar 21, 2026, 5.34 pm IST

KTR | ఆరు గ్యారంటీల అమ‌లు కోసం అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రైవేటు బిల్లు : కేటీఆర్‌
Advertisement

KTR | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమ‌లు కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ మెంబ‌ర్ బిల్లును అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ది. అడ్డుగోలుగా ఓటు వేయించుకొని రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల‌ను మోసం చేసిన ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బిల్లును ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్ల‌డించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ లీగ‌ల్ సెల్ విభాగం, సీనియ‌ర్ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే సీఎం ఆరు గ్యారెంటీల అమలు ఫైలుపై సంత‌కం చేశార‌న్నారు. సరిగ్గా వారం రోజుల తర్వాత అప్పటి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌తో అసెంబ్లీ ఉభయ సభల సమావేశంలో చెప్పించార‌న్నారు. 800 రోజులైనా 6 గ్యారంటీలో అమలులో అతిగతీలేద‌ని ఆరోపించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

ఈ సమావేశాల్లోనే ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. స్పీకర్ కార్యాలయాన్ని మండలిలో చైర్మన్ కార్యాలయాన్ని కలిసి ఈ బిల్లును అనుమతించాలని కోరుతామ‌ని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును సభలో అనుమ‌తించాల‌ని డిమాండ్ చేశారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రభుత్వం ఆమోదించి ప్రజలపై చిత్తశుద్ధిని చాటుకుంద‌ని, ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రభుత్వాలు ఆమోదించే సాంప్రదాయం ఇప్పటికే రాష్ట్రంలో ఉంద‌ని తెలిపారు. అందుకే ఈ ఆరు గ్యారెంటీల అమలు కోసం తెస్తున్న బిల్లును కాంగ్రెస్ పార్టీ ఆమోదించాల‌న్నారు. పాలక పక్షం, ప్రతిపక్షం రెండు కోరుతున్నాయి కాబట్టి ఈ బిల్లు ఆమోదం ఈజీగా జరుగుతుంద‌న్నారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు ఇలా ప్రతి ఒక్క వర్గం తరఫున ఈ బిల్లును తాము ప్ర‌తిపాదిస్తున్నామ‌ని చెప్పారు.

ఈ బిల్లు చట్టం అయితే రైతన్నలకు రైతుబంధు ఎగ్గొట్టేందుకు ప్రభుత్వానికి వీలుండదన్నారు. సీఎం ఖచ్చితంగా రైతుబంధుతో సహా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాల్సి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆరు గ్యారంటీలు అమలుకు ఈ చట్టం అత్యంత కీలక‌మ‌ని, ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు చ‌ట్ట‌మైతే ప్రభుత్వం మెడకు ఇది ఒక చట్రం లెక్క పనిచేస్తుంద‌న్నారు. ప్రభుత్వ ఎగవేతలకు కళ్లెం వేస్తుంద‌న్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఖచ్చితంగా లబ్ధి చేకూరేలా వీలవుతుంద‌న్నారు. ఈ చట్టంతో అన్నదాతలకు, ఆటో అన్నలకు, మహిళలకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుంద‌న్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత అన్ని పార్టీల నేతలను క‌లుస్తామ‌ని, మద్దతు ఇవ్వాలని కోరుతామ‌న్నారు. అవసరమైతే లేఖలు రాస్తామ‌న్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇలా అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈ బిల్లు అమలు కోసం స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేయాల‌ని కోరారు.

అప్పుడే వారికి ఆరు గ్యారంటీల లబ్ధి క‌లుగుతుంద‌ని, జనం ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా డబ్బులు వేసేలా ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నామ‌న్నారు. తాము శాస‌న‌స‌భ స్పీక‌ర్‌, కౌన్సిల్ చైర్మ‌న్‌ను క‌లిసి ఈ అంశానికి సంబంధించి విజ్ఞ‌ప్తి చేశామ‌న్నారు. ఈ బిల్లుకు సంబంధించి కూడా ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని ప్రభుత్వానికి ప్ర‌తిపాదిస్తామ‌ని, ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పింద‌ని, మాట తప్పి 800 రోజులైన నేపథ్యంలోనే తాము స్వతహాగా ఈ బిల్లు తీసుకువ‌స్తున్నామ‌న్నారు. ఈ బిల్లును కాంగ్రెస్ శాసనసభలో అనుమతించకుంటే చట్టపరంగా ఉన్న ఇతర మార్గాలను కూడా ఉప‌యోగించుకుంటామ‌ని కేటీఆర్ తేల్చి చెప్పారు.

Advertisement
Advertisement