త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మా ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాల్సిందే.. అప్ప‌టి వ‌ర‌కు రేవంత్‌ను వ‌దిలిపెట్టం : కేటీఆర్‌

KTR | బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారంపై హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌న్నారు.

P

Telangana | Published On Sep 7, 2026, 6.26 pm IST

KTR | మా ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాల్సిందే.. అప్ప‌టి వ‌ర‌కు రేవంత్‌ను వ‌దిలిపెట్టం : కేటీఆర్‌
Advertisement

KTR | బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారంపై హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌న్నారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్‌ మాట్లాడారు. ఆయ‌న మాట‌ల్లోనే..

మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల తీరు దారుణం

సునీతా ల‌క్ష్మారెడ్డి మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌, మ‌హిళా, స్త్రీశిశు సంక్షేమ‌శాఖ మంత్రిగా.. రాజశేఖ‌ర్‌రెడ్డి, కిర‌ణ్‌కుమార్ కేబినెట్‌లో స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేసిన నాయ‌కురాలు. వారి ప‌ట్ల పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు బాధ‌ాక‌రం. అక్క‌డ కోవ ల‌క్ష్మి లేక‌పోతే సునీత ల‌క్ష్మారెడ్డి వెళ్లి ఇనుప కంచె, గ్రిల్స్‌పై ప‌డే ప‌రిస్థితి. ఆవిడ‌కు ఇవాళ ఏమైనా అయి ఉంటే ఏం జ‌రిగేదో నాకు తెలియ‌దు కానీ. దారుణంగా చీర‌బ‌ట్టి లాగి.. దుశ్శాస‌న ప‌ర్వం. శాస‌న‌స‌భ కాదు దుశ్శాస‌న స‌భ అన్న‌ట్లుగా ఇవాళ వ్య‌వ‌హ‌రించారు. చివ‌ర‌కు సునీతా ల‌క్ష్మారెడ్డి కంట‌నీరు తెచ్చుకునే ప‌రిస్థితి తీసుకువ‌చ్చారు. ఇదీ జ‌రిగింది. దీన్ని దాచ‌డానికి, దీన్నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించ‌డానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. రేవంత్‌రెడ్డికి తెలిసిన‌వి మూడున్న‌య్‌. అవే డిస్ట్ర‌క్ష‌న్‌, డిస్ట్రాక్ష‌న్‌, డైవ‌ర్స్‌. ఇవి త‌ప్ప ఆయ‌న‌కు ఇంకోటి తెలియ‌దు. అందుకే ఈ రోజు డైవ‌ర్ష‌న్ డ్రామా మొద‌లుపెట్టాడు. అసెంబ్లీలోకి బీఆర్ఎస్ రాకుండా అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

రాహుల్‌ గాంధీకి ఒక రూల్‌.. మాకొక రూలా?

నేను టీష‌ర్ట్ వేసుకున్నాను. ఏ రూల్‌బుక్‌లో ఉంద‌య్యా? రాహుల్ గాంధీ పార్ల‌మెంట్‌లోకి టీష‌ర్ట్ వేసుకొని వెళ్లొచ్చు. అదానీ, ప్ర‌ధాని బొమ్మేసుకొని పోవ‌చ్చు. మ‌రి పార్ల‌మెంట్‌లో ఒక‌నీతి, శాస‌న‌స‌భ‌లో ఒక నీతి ఉంటుందా? అని పోలీసుల‌ను అడిగాను. లోక్‌స‌భ‌లో ఏ రూల్ ఉంటుందో.. శాస‌న‌స‌భ‌లో కూడా అదే రూల్ ఉంటుంది క‌దా? అక్క‌డ ప్ర‌తిప‌క్ష నేత‌లు రాహుల్‌, ప్రియాంక గాంధీ టీష‌ర్టులు వేసుకుంటున్న‌రు.. స్లోగ‌న్స్ రాస్తున్న‌రు.. మాకెందుకు వేరే రూల్ ఉంటుందంటే పోలీసులు స‌మాధానం చెప్ప‌రు. లేదండీ స్పీక‌ర్ అడ్డుకోమ్మ‌న్న‌రు.. చీఫ్ మార్ష‌ల్ చెప్పారని అన్న‌రు. ఏ రూల్ ప్ర‌కారం అడ్డుకుంటున్న‌రు ? మేం ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన ప్ర‌జాప్ర‌తినిధులం. ఏ రూల్‌.. రూల్‌బుక్‌లో ఏదైనా రూల్ ఉందా? స్పీక‌ర్ ఏదైనా రూలింగ్ ఇచ్చారా? ఏ ప్ర‌కారం అడ్డుకుంటున్న‌ర‌ని అడిగితే స‌మాధానం లేదు. రేవంత్‌రెడ్డిని బ‌య‌ట తూర్పార బ‌డుతున్నం కాబ‌ట్టి.. వంద‌రోజుల్లో అమ‌లు చేస్త‌న‌న్న హామీలు వెయ్యిరోజుల్లో చేయ‌లేదు కాబ‌ట్టి.. అస‌మ‌ర్థ ప‌రిపాల‌న‌ను ఎండ‌గ‌డుతం కాబ‌ట్టి ఏదో సాకుప‌ట్టుకున్న‌రు. టీష‌ర్టులు వేసుకున్న‌రు.. స్లోగ‌న్స్ రాసుకున్న‌రు అంటున్న‌రు. డీసీపీ శిల్ప‌వ‌ల్లి చెబితే ఆశ్చ‌ర్య‌మ‌నిపించింది. ఆమె అంటుంది టీష‌ర్టులు వేసుకున్నందుకు కాదు.. అభ్యంత‌ర‌క‌ర‌మైన ప‌దాలు ఉన్న‌య‌ని అంటున్న‌రు. ఇందులో ఏం అభ్యంత‌ర‌మైన ప‌దాలు ఉన్న‌య్ అన్న‌రు. ఇందులో అభ్యంత‌ర‌క‌రంగా ఏమున్న‌య్‌? మేం ముఖ్య‌మంత్రిలాగా అన్‌పార్ల‌మెంట‌రీ భాష‌లో మాట్లాడామా? లాగులు.. తొండ‌లు అన్నామా? వెయ్యిరోజుల పాల‌న‌లో హామీల అమ‌లులో అట్ట‌ర్‌ఫ్లాప్ అయ్యార‌ని చెప్పాం. ఇందులో అన్‌పార్ల‌మెంట‌రీ ఏముంది? అయినా డీసీపీ ఎవ‌రు డిసైడ్ చేయ‌డానికి? ఏది పార్ల‌మెంట‌రీ.. ఏదీ అన్‌పార్ల‌మెంట‌రి అని చెప్పేందుకు? స్పీక‌ర్‌ను అడుగుతున్నాం. రాహుల్ గాంధీకి ఒక రూల్‌.. మాకొక రూల్ ఉంట‌దా స్పీక‌ర్ గారూ.. ఇది ప‌ద్ధ‌తా? ఆయ‌న‌తో విచిత్రంగా అనిపిస్తున్న‌ది.

స్పీకర్‌ వివక్ష చూపడం తగదు

పోయిన శాస‌న‌స‌భ‌లో డైరెక్ట్‌గా అన్న‌డు. ముఖ్యమంత్రిని విమ‌ర్శిస్తే నేను మైక్ అన్న‌డు. నేను అడుగుతున్న స్పీక‌ర్‌ను.. ముఖ్య‌మంత్రికి ఏమైనా స్పెష‌ల్ రూల్స్ ఉన్నాయా? సీఎం కూడా ఇత‌ర స‌భ్యుడిలాగే. లీడ‌ర్ ఆఫ్ ది హౌస్ కావొచ్చు. కానీ ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా మా బాధ్య‌త ఏంటీ? నువ్వురాసిన బాండ్లు, గ్యారంటీలు, చేసిన గార‌డీలపై నిల‌దీయ‌డ‌మే మా బాధ్య‌త‌. మ‌మ్మ‌ల్ని ప్ర‌జ‌లు అందుకే పంపింది. మేం ఎందుకు అక్క‌డ ఉండి. ముఖ్య‌మంత్రికి డ‌ప్పు కొట్ట‌డానికా? క కొడితే మీరు కొట్టుకోండి. మాకు ఏంటీ అవ‌స‌రం. శాస‌న‌స‌భ‌లో స్పీక‌ర్ స్థానంలో కూర్చున్న త‌ర్వాత మీరు వివ‌క్ష చూపడం త‌గ‌దు. ఖ‌చ్చితంగా అంద‌రి స‌భ్యుల హ‌క్కులు కాపాడాలి. మీరే ముఖ్య‌మంత్రిని విమ‌ర్శిస్తే మైక్ ఇవ్వా అంటున్న‌రు. కానీ మీకు ఆ హ‌క్కు లేదు. స‌భ్యుల హ‌క్కు ప్ర‌జ‌ల త‌ర‌ఫున గొంతువినిప‌డం. శాస‌న వ్య‌వ‌స్థ‌లో మ‌మ్మ‌ల్ని న‌మ్ముకున్న‌, ఎన్నుకున్న ప్ర‌జ‌ల వేద‌న‌, బాధ త‌ప్ప‌కుండా రాష్ట్రానికి చెప్పాల్సిన బాధ్య‌త మీపై ఉంటుంది స్పీక‌ర్ గారూ. మీరు ఇష్టానుసారంగా, మీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మైకులు ఇస్తాను.. ముఖ్య‌మంత్రిని విమ‌ర్శిస్తే ఇవ్వ‌ను అనడానికి మీకు హ‌క్కులేదు.

క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి.

మా పార్టీకి శాస‌న‌స‌భ స‌భ్యుల సంఖ్య ప్ర‌కారం స‌మ‌యం, ఆ స‌మ‌యంలో ఏం మాట్లాడాలో గ‌దే మాట్లాడుతం. ప్ర‌జ‌ల త‌ర‌ఫునే మాట్లాడుతం. ఆరు గ్యారంటీల అమ‌లు, 13 డిక్ల‌రేష‌న్ల అమ‌లులో వైఫ‌ల్యం గురించి, 420 దొంగ హామీల‌పై మాట్లాడుతం. మీ ముఖ్య‌మంత్రి, మంత్రులు మాట్లాడుతున్న అడ్డ‌గోలు మాట‌ల గురించి మాట్లాడుతాం. ప్ర‌జ‌ల‌పై చేస్తున్న ధౌర్జ‌న్యాలు, దుర్మార్గాలు, అరాచ‌కాలు, దోపిడీ అన్ని గురించి నిల‌దీస్తాం. నిగ్గ‌దీస్తాం. ఇవ‌న్నీ ముఖ్య‌మంత్రికి తెలుసు. అందుకే బీఆర్ఎస్‌ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేందుకు ఈ గ‌లాటా అంతా. దానికి ఆధ్యుడు బాధ్యుడు ఖ‌చ్చితంగా సీఎం రేవంత్‌రెడ్డి. అందుకే మేం డిమాండ్ చేస్తున్నం. రేపు కూడా శాస‌న‌స‌భ‌లో డిమాండ్ చేస్తాం. మా ఆడ‌బిడ్డ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పేదాకా.. స‌బితా ఇంద్రారెడ్డి, సునీతా ల‌క్ష్మారెడ్డికి జ‌రిగిన అవ‌మానానికి పోలీసుల‌తో హోంమంత్రిగా ముఖ్య‌మంత్రి రేవంత్ చేయించిన అవ‌మానానికి, చేసిన దాడికి ముఖ్య‌మంత్రి బాధ్య‌త తీసుకోవాలి. క్ష‌మాప‌ణ‌లు చెప్పి తీరాల్సిందే. లేకుంటే మేం వ‌దిలిపెట్టం. ఇందులో స‌మ‌స్యే లేదని స్ప‌ష్టం చేశారు కేటీఆర్‌.

Advertisement
Advertisement