త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | నీట్ సంక్షోభానికి కేంద్రానిదే బాధ్యత

KTR | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ కుంభకోణం, పేపర్ లీకేజీ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లోపభూయిష్టమైన వ్యవస్థతో నష్టపోయిన విద్యార్థులకు భరోసా కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని ఆయన ప్రధానిని డిమాండ్ చేశారు.

P

Telangana | Published On Jun 7, 2026, 8.09 pm IST

KTR | నీట్ సంక్షోభానికి కేంద్రానిదే బాధ్యత
Advertisement
  • తప్పు బోర్డుది.. శిక్ష విద్యార్థులకా?
  • పేపర్ లీక్‌తో ప్రతిభావంతులకు ఘోర అన్యాయం
  • నీట్ అంశాన్ని రాజ్యసభ‌లో కేంద్రాన్ని నిల‌దీస్తాం
  • మ‌లేషియా ప‌ర్య‌ట‌న‌కు ముందు నీట్ బాధితుల‌తో కేటీఆర్ ముఖాముఖి

KTR | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ కుంభకోణం, పేపర్ లీకేజీ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లోపభూయిష్టమైన వ్యవస్థతో నష్టపోయిన విద్యార్థులకు భరోసా కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని ఆయన ప్రధానిని డిమాండ్ చేశారు. తప్పు చేసిన పెద్దలపై చర్యలు తీసుకుంటేనే, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉంటాయనే బలమైన సందేహం బ్యూరోక్రాట్లలో వెళ్తుందని స్పష్టం చేశారు. మలేషియా పర్యటనకు వెళ్లే ముందు, జూన్ 4న సాయంత్రం హైదరాబాద్‌లో నీట్ బాధితులు, లాంగ్ టర్మ్ విద్యార్థులతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమై ముఖాముఖి నిర్వహించారు. ఈ ముఖాముఖిలో విద్యార్థులు పాల్గొని తాము ఎదుర్కొంటున్న మానసిక క్షోభను కేటీఆర్ ముందు ఏకరవు పెట్టారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి 520కి పైగా మార్కులు సాధించినా, పేపర్ లీక్ కావడం వల్ల తమ శ్రమ అంతా వృథా అయ్యింద‌ని ఆవేదన వ్యక్తం చేశారు.

లీక్‌ను ఎందుకు అడ్డుకోలేక‌పోయారు?

ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లే ముందు తమను అణువణువూ తనిఖీ చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారులు, పేపర్ లీక్‌ను ఎందుకు అడ్డుకోలేకపోయారని విద్యార్థులు నిలదీశారు. తప్పు ఎన్టీఏ బోర్డు చేసి, విద్యార్థులను మళ్లీ మళ్లీ పరీక్షలకు కూర్చోబెట్టడం ఏ రకంగా న్యాయమని వారు ప్రశ్నించారు. విద్యార్థుల ఆక్రోశంపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. "మీ కోపంలో 100 శాతం న్యాయం ఉంది. ఈ పరీక్ష నిర్వహణలో ఇది ప్రభుత్వ అబ్సల్యూట్ ఫెయిల్యూర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఏ ఘోరంగా విఫలమైంది. తప్పు చేసిన పెద్దలను వదిలేసి, మిమ్మల్ని మళ్లీ పరీక్షకు కూర్చోబెట్టడం ముమ్మాటికీ అన్యాయమే. కానీ, ఇదొక తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ లాంటిది. మీ కసిని, ఎనర్జీని సరైన దిశలో పెట్టి మళ్లీ ఫోకస్ చేయండి" అని విద్యార్థుల్లో ధైర్యం నింపారు. గతంలో (2024) గ్రేస్ మార్కుల పేరిట జరిగిన అవకతవకలను, కటాఫ్‌లు అసాధారణంగా పెరిగిపోవడాన్ని ఒక విద్యార్థి ప్రస్తావించగా, కేటీఆర్ ఎన్టీఏ తీరును తీవ్రంగా తప్పుపట్టారు.

ఎన్టీఏ వ‌ద్ద స‌మాధానం లేదు

"గ్రేస్ మార్కులు ఎందుకు కలిపారో చెప్పడానికి ఎన్టీఏ వద్ద ఇప్పటికీ ఎలాంటి తార్కిక సమాధానం లేదు. చాలా ఇర్రెస్పాన్సిబుల్‌గా వ్యవహరించి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. కొంతమందికి అడ్డదారిలో మార్కులు కలిపి, కష్టపడ్డ విద్యార్థులకు అన్యాయం చేయడం ఘోరమైన నేరం. ఈ లూప్‌హోల్స్ అన్నింటిపై పార్లమెంట్‌లో, స్టేట్ అసెంబ్లీలో గట్టిగా చర్చిస్తాం. చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చట్టసభ సభ్యులుగా మా బాధ్యత నెరవేరుస్తాం" అని హామీ ఇచ్చారు. "మంత్రి రాజీనామా చేస్తే సమస్య పరిష్కారమవుతుందా?" అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ వ్యూహాత్మకంగా బదులిచ్చారు. "మంత్రి రాజీనామా ఒక హెచ్చరిక లాగా పనిచేస్తుంది. ప్రధాని గనుక మంత్రిని తొలగిస్తే.. తప్పు జరిగితే బాధ్యత వహించక తప్పదనే భయం అధికారుల్లో, బ్యూరోక్రాట్లలో వస్తుంది. లేకపోతే వ్యవస్థలో నిర్లక్ష్యం (Recklessness) పెరుగుతుంది. స్కూల్లో బంక్ కొడితేనే పనిష్మెంట్ ఉన్నప్పుడు, వ్యవస్థను నాశనం చేసిన పెద్దలకు శిక్ష ఉండాలి. కొందరిని డిస్మిస్ చేసి కఠినంగా శిక్షిస్తేనే వ్యవస్థ దారిలోకి వస్తుంది" అని పేర్కొన్నారు.

ఫూల్ ప్రూఫ్ సిస్ట‌మ్‌పై కేంద్రం దృష్టి పెట్టాలి..

పేపర్ లీక్ అయిన రాష్ట్రాల్లోనే పరీక్ష పెట్టాలా? లేక దేశవ్యాప్తంగా నిర్వహించాలా? అన్న ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ.. "ఇవాల్టి కనెక్టెడ్ ప్రపంచంలో లీకైన పేపర్ మిగతా రాష్ట్రాలకు వెళ్లలేదని చెప్పలేం. ఒక కోచింగ్ సెంటర్‌లో పలు రాష్ట్రాల విద్యార్థులు ఉంటారు. ఎక్కడో ఒకచోట 1% లీక్ అయినా అది అందరికీ పాకుతుంది. కాబట్టి లీక్ పరిధిపై 100% స్పష్టత ఉంటే ఆయా రాష్ట్రాలకే పరిమితం చేయవచ్చు, లేదంటే దురదృష్టవశాత్తూ దేశవ్యాప్తంగా మళ్లీ నిర్వహించడం మినహా ప్రత్యామ్నాయం లేదు. అయితే, అసలు లీక్ కాకుండా ఉండేందుకు నేటి ఏఐ (AI) సాంకేతికతను వాడుకుని 'ఫూల్ ప్రూఫ్' సిస్టమ్స్ తేవడంపై కేంద్రం దృష్టి పెట్టాలి" అని కేటీఆర్ సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement