త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రేవంత్ కాంగ్రెస్ నేత కాదు.. బీజేపీ మ‌నిషే

KTR | 'సీఎం రేవంత్ ఏనాటికైనా బీజేపీ మ‌నిషే. ఎప్ప‌టికీ కాంగ్రెస్ మనిషి కాలేడు. ముందు నుంచి బీజేపీ మనిషే. ముమ్మాటికి బడే భాయ్ తమ్ముడు. అందుకే రాష్ట్రంలోని మైనారిటీలు, మత రాజకీయాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి కప్పుకున్న బీజేపీ ముసుగును తొలగించి చూడాలి. ఆయన లోపల ఉన్న బీజేపీ నాయ‌కుడిని గుర్తించండి' అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

P

Telangana | Published On Feb 7, 2026, 5.32 pm IST

KTR | రేవంత్ కాంగ్రెస్ నేత కాదు.. బీజేపీ మ‌నిషే
Advertisement
  • ఎప్ప‌టికైనా బ‌డేభాయ్‌కి త‌మ్ముడే
  • బీజేపీ ముసుగు తొల‌గించి చూడాలి
  • ఎంగిలి మెతుకుల కోసం కాంగ్రెస్ సంకలోకి పోచారం
  • బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌
  • బాన్సువాడలో ఎన్నిక‌ల ప్ర‌చారం

KTR | 'సీఎం రేవంత్ ఏనాటికైనా బీజేపీ మ‌నిషే. ఎప్ప‌టికీ కాంగ్రెస్ మనిషి కాలేడు. ముందు నుంచి బీజేపీ మనిషే. ముమ్మాటికి బడే భాయ్ తమ్ముడు. అందుకే రాష్ట్రంలోని మైనారిటీలు, మత రాజకీయాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి కప్పుకున్న బీజేపీ ముసుగును తొలగించి చూడాలి. ఆయన లోపల ఉన్న బీజేపీ నాయ‌కుడిని గుర్తించండి' అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బాన్సువాడ‌లో శ‌నివారం మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నాం కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో మాకు ఓటు వేయాలని కాంగ్రెస్ చెప్తున్న వాదన అర్థరహితమన్నారు. అధికారంలో ఉండి గత రెండు సంవత్సరాల్లో ఏం చేశారో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల‌న్నారు. ఒకవేళ రానున్న రెండు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే మరి త‌ర్వాత త‌మ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఖచ్చితంగా పట్టణాలను కాంగ్రెస్ కంటే గొప్పగా గతంలో మాదిరి అభివృద్ధి చేస్తామన్నారు. మైనారిటీలకు, బీసీల‌కు భారీ ఎత్తున బడ్జెట్ ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయ‌న పిలుపునిచ్చారు.

పోచారంపై రేవంత్ తిట్ల దండ‌కాన్ని గుర్తు చేసిన కేటీఆర్‌

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు అయితే కాంగ్రెస్ ప్రయోజనాలు పొందిన వాళ్లు మాత్రమే ఆ పార్టీకి ఓటు వేయాలని, మిగిలిన వారంతా ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. రూ.4వేల పెన్షన్, రూ.2500 మహిళలకు, మరోవైపు విద్యా భరోసా కార్డు, రైతు భరోసా, కల్యాణ లక్ష్మి, తులం బంగారం వచ్చిన వాళ్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవేవీ ఇవ్వకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పోయారో బాన్సువాడ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో పోచారం, ఆయ‌న కొడుకుల‌పై రేవంత్‌రెడ్డి తిట్ల దండ‌కానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ల‌ను ప్లే చేశారు. రేవంత్ ఇదే పోచారాన్ని అంబోతు అని, ఆయన కొడుకులు దున్నపోతులని, రోడ్డు మీద వదిలారని, కాంట్రాక్టుల పేరుతో అవినీతి చేస్తున్నారని, కమిషన్లు తింటున్నారని, ఇసుక దోపిడీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పిన మాటల‌ను కేటీఆర్ గుర్తు చేశారు. పోచారం బండకట్టుకొని బావిలో దూకు అని అన్న మాటలను కేటీఆర్ ప్రస్తావించారు.

ఎందుకు కాంగ్రెస్ సంక‌న చేశారు..?

పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వరుడి సాక్షిగా జీవితాంతం కేసీఆర్ వెంట ఉంటానని, కేసీఆర్ చల్లని చూపుతో బాన్సువాడను చేసిన అభివృద్ధి ఎన్నడూ మర్చిపోలేనని, తనకు చూపిన ప్రేమాభిమానాలను కూడా మర్చిపోలేనని పోచారం చెప్పిన మాట‌ల‌ను ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌జ‌ల‌కు వినిపించారు. ఎన్నో మాట‌లు చెప్పిన పోచారం ఎందుకు కాంగ్రెస్ సంక‌న చేరార‌ని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుకుల కోసం పోచారం కాంగ్రెస్ సంక‌లో చొచ్చినా.. ఆ పార్టీలో ఇంకా వేలాది మంది కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌న్నారు. ప్ర‌జ‌లు బాన్సువాడ‌లో గులాబీ జెండా ఎగ‌రాల‌ని కోరుకుంటున్నార‌న్నారు. కేవలం డబ్బులు ఉన్నంత మాత్రాన పోచారం పెద్ద నాయ‌కుడు కాలేడ‌న్నారు. దమ్ముంటే పోచారం రాజీనామా చేసి ప్రజల వద్దకు రావాలని, ప్రజలు ఎవరి వైపు ఉంటారో నిర్ణయిస్తారంటూ స‌వాల్ విసిరారు.

రెండేళ్ల‌లో రూపాయి లాభ‌మైనా జ‌రిగిందా?

మంత్రిని చేసి స్పీకర్ ని చేసి గౌరవించుకుని లక్ష్మీ పుత్రుడు అంటే ఆయన బాన్సువాడ ప్రజలను, కేసీఆర్‌ని, బీఆర్ఎస్‌ని మోసం చేసి పైసల కక్కుర్తి కోసం కాంగ్రెస్‌లో చేరార‌ని విమ‌ర్శించారు. ఆనాడు కేసీఆర్ చలవతో మున్సిపల్ శాఖ, ఇతర శాఖల సహకారంతో సుమారు రూ.10వేల‌కోట్ల అభివృద్ధి పనులను బీఆర్ఎస్ గత ప్రభుత్వం చేసిందని కేటీఆర్ తెలిపారు. బాన్సువాడకు జరిగిన అభివృద్ధి అంతా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికే చెందుతుందని, ఒకవేళ నిజంగానే పోచారం అభివృద్ధి చేసి ఉంటే గత రెండేళ్ల‌లో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో అక్రమంగా చేరిన తర్వాత బాన్సువాడకి చేసిన ఒక్కటంటే ఒక్క రూపాయి లాభమైనా చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడ‌గాల‌ని స‌వాల్ విసిరారు.

Advertisement
Advertisement