త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయండి.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ

Kishan Reddy | రాష్ట్ర‌ ఆర్థిక పరిస్థితిపై (financial condition) శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిష‌న్‌ రెడ్డి (Kishan Reddy) డిమాండ్ చేశారు. బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ముందే వైట్ పేప‌ర్ (white paper) విడుద‌ల చేయాల‌న్నారు.

G

Telangana | Published On Mar 3, 2026, 1.33 pm IST

Kishan Reddy | రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయండి.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ
Advertisement

Kishan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర‌ ఆర్థిక పరిస్థితిపై (financial condition) శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిష‌న్‌ రెడ్డి (Kishan Reddy) డిమాండ్ చేశారు. బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ముందే వైట్ పేప‌ర్ (white paper) విడుద‌ల చేయాల‌న్నారు. ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డికి ఆయ‌న లేఖ రాశారు. గత 12 ఏండ్ల‌లో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.12 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని.. అయిన‌ప్ప‌టికీ ​రాష్ట్రంలో జీతాలు, రైతు భరోసా, సంక్షేమ పథకాల అమలు.. ఇలా ఏ పని చేయాలన్నా అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని లేఖ‌లో విమ‌ర్శించారు.

సాస్కి (SASCI) పథకం కింద రాష్ట్రానికి రూ.10 వేల‌ కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలను కేంద్రం అందించిందన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా, ఖజానా ఖాళీ అని నెపం నెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ​బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్నారు.

`2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో 6 ప్రధాన గ్యారంటీలతోపాటు 420 హామీలను గుప్పించింది. ఈ హామీలను నమ్మిన ప్రజ‌లు కాంగ్రెస్‌కి అధికారాన్ని కట్టబెట్టింది. అనంతరం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మీరు, ఇచ్చిన హామీలను అమలు చేయమంటే రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలు ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీల అమలునుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ఖజానా గురించి ఇలా మాట్లాడిన మీరే, ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ సోనియా గాంధీ-రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ.1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీనినిబ‌ట్టి రాష్ట్ర ఖజానా నిల్ - కాంగ్రెస్ నాయకుల జేబులు ఫుల్ అన్న విషయం అర్థమవుతున్న‌ది.

2014లో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి నేటి వరకు తెలంగాణ అభివృద్ధికి అనేక రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తున్న‌ది. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, మరెన్నో మూలధన పెట్టుబడులు మొదలైనవాటి రూపంలో గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.12 లక్షల కోట్ల నిధులను రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేటాయించింది. అందులో రూ.2.5 లక్షల కోట్ల పన్నుల వాటా నిధులు, రూ.1.85 లక్షల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం, దాదాపు రూ.36 వేల‌ కోట్లకు పైగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో రూ. 50 వేల‌ కోట్ల విలువైన రైల్వే పనులు, దాదాపు రూ.40 వేల‌ కోట్ల ఉపాధి హామీ నిధులు, రూ.50 వేల‌ కోట్ల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు వివిధ ఆర్థిక సంఘాల సిఫారసుల ద్వారా అందిస్తున్న రూ.40 వేల‌ కోట్లకు పైగా నిధులు, రూ.12 వేల‌ కోట్లకు పైగా విలువైన విద్యుత్ ప్రాజెక్టులు, రూ.14 వేల‌ కోట్లకు పైగా పీఎం కిసాన్ నిధులు, ఎరువుల సబ్సిడీ కోసం రూ.80 వేల‌ కోట్లకు పైగా నిధులు, విద్య, క్రీడలకు రూ.21 వేల‌ కోట్లకు పైగా నిధులు, ఆరోగ్య సంరక్షణకు దాదాపు రూ.9 కోట్ల నిధులు మొదలైనవి ఉన్నాయి.

అంతే కాకుండా, కేంద్ర ప్రభుత్వం గత 12 ఏండ్ల‌ కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి, తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించింది. మరో రూ.60 వేల‌ కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి, రైతుల నుంచి పత్తిని సేకరించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను ఇవ్వడమే కాకుండా, వివిధ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా దాదాపు రూ.10 లక్షల కోట్ల ఋణాలను కూడా రాష్ట్రానికి అందించింది.

SASCI పథకం కింద 2020-21 నుంచి 2025-26 వరకు తెలంగాణకు రూ.10 వేల‌ కోట్లకుపైగా వడ్డీ రహిత ఋణాలను అందించింది. ఈ ఋణాలతో రాష్ట్ర వ్యాప్తంగా మూలధన పెట్టుబడితో కూడిన కొన్ని వందల ప్రాజెక్టులు అమలుకు నోచుకున్నాయి. మురుగునీటి నాళాలు, రోడ్ల విస్తరణ, రైల్వే లైన్ల విస్తరణ, బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, ద‌వాఖాన‌లు, మెడికల్, నర్సింగ్ కాలేజీలు, సంక్షేమ, మైనారిటీ పాఠశాలలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణం, పర్యాటక ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఓఆర్ఆర్‌, ట్రిపుల్‌ ఆర్ (ORR & RRR) మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి-మూసీ నది అనుసంధానం, మూసీ నది సుందరీకరణ, స్మార్ట్ సిటీ మిషన్ లో రాష్ట్ర వాటా నిధులు, వరదల వలన పాడైపోయిన నిర్మాణాల పునరుద్ధరణ, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రాష్ట్ర వాటా నిధులు వంటి అనేక ప్రాజెక్టులకు సాస్కి నిధులు ఖర్చు చేశారు.

ముఖ్యంగా ఎంఎంటీఎస్ ఫేజ్- II కోసం రూ.200 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ కోసం రూ.114 కోట్లు, స్మార్ట్ సిటీస్ పథకం కోసం రూ.315 కోట్లు, పీఎం గ్రామ సడక్ యోజన కోసం రూ.674 కోట్లు, ORR-RRR మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణానికి రూ.200 కోట్లు, సిద్ధిపేట బైపాస్ రోడ్డు కోసం రూ.110 కోట్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల కోసం రూ.388 కోట్లు, పలు హాస్టళ్ల నిర్మాణం కోసం రూ.300 కోట్లు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లానే తెలంగాణ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రహిత ఋణాల మీద ఆధారపడటం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలాంటి దుస్థితిలో ఉందో తెలుస్తోంది.

ఇవి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న ఋణాలకు వడ్డీలు చెల్లించడానికి ఋణాలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఋణాలు, రైతు భరోసా నిధులకు, సంక్షేమ పథకాల అమలుకు ఋణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఋణాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి ప్ర‌స్తుతం తెలంగాణలో ఉంది. 2014 లో మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రానికి గత పదేండ్ల‌ బీఆర్ఎస్ పాలనలో, గత 27 నెలల కాంగ్రెస్ పాలనలో పట్టిన దుస్థితికి నేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్ధం పడుతున్న‌ది. ప్రతి ఏడాది పెద్ద ఎత్తున పెరుగుతున్న రాష్ట్ర తలసరి అప్పు కూడా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని తెలియజేస్తున్న‌ది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి, మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక పూర్తిస్థాయి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని తెలంగాణ ప్రజల తరపున మిమ్మల్ని కోరుతున్నాను’ అని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement