త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AMMA | ‘అమ్మా’కు రేవతి, పద్మప్రియ గుడ్‌బై.. భద్రత, గౌరవం కల్పించడంలో విఫ‌ల‌మైంద‌ని ఆరోప‌ణ‌లు

AMMA | మలయాళ సినీ నటుల సంఘం ‘అమ్మా’ (Association of Malayalam Movie Artists)లో మరోసారి కలకలం రేగింది. సీనియ‌ర్ న‌టి రేవతి, పద్మప్రియ ప్రాథమిక సభ్యత్వాన్ని వ‌దులుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సభ్యులకు భద్రత, గౌరవం, జవాబుదారీతనం, సమానత్వం కల్పించడంలో సంఘం విఫలమైందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

P

Entertainment | Published On Jul 7, 2026, 7.39 pm IST

AMMA | ‘అమ్మా’కు రేవతి, పద్మప్రియ గుడ్‌బై.. భద్రత, గౌరవం కల్పించడంలో విఫ‌ల‌మైంద‌ని ఆరోప‌ణ‌లు
Advertisement

AMMA | మలయాళ సినీ నటుల సంఘం ‘అమ్మా’ (Association of Malayalam Movie Artists)లో మరోసారి కలకలం రేగింది. సీనియ‌ర్ న‌టి రేవతి, పద్మప్రియ ప్రాథమిక సభ్యత్వాన్ని వ‌దులుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సభ్యులకు భద్రత, గౌరవం, జవాబుదారీతనం, సమానత్వం కల్పించడంలో సంఘం విఫలమైందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘అమ్మా’లో పితృస్వామ్య ధోరణి, రాజకీయాల ప్రభావం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘం ఏర్పాటుకు కారణమైన ప్రాథమిక సూత్రాలు ప్రస్తుతం బలహీనపడుతున్నాయని పేర్కొన్నారు. రాజీనామా నిర్ణయం తొందరపాటుతో తీసుకున్నది కాదని రేవతి, పద్మప్రియ స్పష్టం చేశారు. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తమ వైఖరిని వెల్లడించారు.

“ఇప్పుడు వెనక్కి తగ్గడం ఓటమి కాదు.. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన నిర్ణయం. ఈ పరిశ్రమకు మేం దశాబ్దాలుగా అంకితమయ్యాం. మలయాళ సినిమా భవిష్యత్తు ఎలా ఉండాలన్నదానిపై మాకు శ్రద్ధ ఉంది” అని పేర్కొన్నారు. సంఘంలో మార్పు కోసం తాము ఎన్నో ఏళ్లుగా ఒకే డిమాండ్‌ను వినిపిస్తున్నామని నటీమణులు తెలిపారు. ప్రతి సభ్యుడికి భద్రత, గౌరవం, జవాబుదారీతనం, సమానమైన వ్యవహారం ఉండాలని కోరామని చెప్పారు. “కానీ మాకు ఎదురైంది మౌనం మాత్రమే. మార్పును స్వీకరించేందుకు సంస్థ సిద్ధంగా లేదన్న భావన క్రమంగా ఏర్పడింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ సభ్యత్వం కొనసాగించినా, లేకపోయినా మలయాళ సినిమా తమ జీవితంలో ప్రత్యేక స్థానం క‌లిగి ఉటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

తమ డిమాండ్లను బహిరంగంగా ప్రస్తావించినందుకు మూల్యం చెల్లించాల్సి వచ్చిందని రేవతి, పద్మప్రియ తెలిపారు. “ఏదో ఒక‌ప్పుడు సొంత ఇంటిలా అనిపించిన చోట్ల నుంచి, కొంతమంది సహచరులు, స్నేహితులకు దూరం కావాల్సి వ‌చ్చింది. అయినా మార్పుపై ఆశను వదులుకోలేదు” అని పేర్కొన్నారు. మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు, లింగ వివక్షపై విచారణ చేప‌ట్టిన హేమా కమిటీ నివేదిక అనంతర పరిణామాలను ప్రస్తావిస్తూ.. ఆ తర్వాత జరిగిన కొన్ని రాజీనామాలు బాధ్యతను స్వీకరించే చర్యలుగా కాకుండా, జవాబుదారీతనం నుంచి తప్పించుకునే ప్రయత్నాలుగా మారాయని విమర్శించారు. “కొంతకాలం తర్వాత మళ్లీ అదే పాత వ్యవస్థ కొనసాగింది” అని వ్యాఖ్యానించారు. రేవతి, పద్మప్రియ రాజీనామా ‘అమ్మా’లో కొనసాగుతున్న అంతర్గత చర్చలకు మరోసారి తెరలేపాయి.

Advertisement
Advertisement