త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Kavitha | గుంటనక్కతో గుంపు మేస్త్రీ డీల్.. క‌విత విమ‌ర్శ‌లు..

MLC Kavitha | గుంటనక్కతో గుంపు మేస్త్రీ డీల్ మాట్లాడుతున్నాడ‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత విమ‌ర్శ‌లు గుప్పించారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. వెయ్యి ఏండ్లు అయినా బీఆర్ఎస్ పార్టీ మారదని క‌విత మండిపడ్డారు.

P

Telangana | Published On Apr 21, 2026, 5.36 pm IST

MLC Kavitha | గుంటనక్కతో గుంపు మేస్త్రీ డీల్.. క‌విత విమ‌ర్శ‌లు..
Advertisement

MLC Kavitha | గుంటనక్కతో గుంపు మేస్త్రీ డీల్ మాట్లాడుతున్నాడ‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత విమ‌ర్శ‌లు గుప్పించారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. వెయ్యి ఏండ్లు అయినా బీఆర్ఎస్ పార్టీ మారదని క‌విత మండిపడ్డారు. బీఆర్ఎస్ తొవ్వలోనే కాంగ్రెస్ వెళ్తోందన్నారు. ఓటమిపై బీఆర్ఎస్ ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని.. ప్రజలే తప్పు చేశారని ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. 75 సంవత్సరాల కురువృద్ధుడిని చేర్చుకుని ఆయనకే 25 ఏండ్లు తగ్గిపోయినయి నవ యువకుడు అంటే తెలంగాణలో ఉన్న యువత పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తాము ఏర్పాటు చేసే పార్టీలో యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని.. వారంతా పెద్ద ఎత్తున చేరాలని పిలుపునిచ్చారు. జగిత్యాల సభలో 75 ఏళ్ల కురువృద్ధుడిని చేర్చుకొని రాజకీయ పునరేకీకరణ అంటున్నారని.. రాజకీయ పునరేకీకరణ పేరుతో తెలంగాణ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తున్నారంటే వెయ్యేండ్లు అయినా బీఆర్ఎస్ మారదని తేల్చిచెప్పారు.

బీఆర్ఎస్ ఆలోచ‌నా విధానాన్ని అర్థం చేసుకోవాలి

మేధావులు, విద్యావేత్తలు బీఆర్ఎస్ ఆలోచన విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల‌ని క‌విత సూచించారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేక‌ని గుర్తు చేశారు. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ఉద్యమ నాయకత్వం రెండు సార్లు పదవులకు రాజీనామా చేసిన స‌మ‌యంలో తనకు వైఎస్ నాయకత్వం ఉంటే చాలు తెలంగాణ ఎందుకంటూ ప్రశ్నించిన వ్య‌క్త‌న్నారు. ఉద్యమ నాయకత్వంపై రెండుసార్లు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. జగిత్యాల సభలో తెలంగాణ కోసం ఉరిమే ఉత్సాహంతో పోరాడిన ఉద్యమకారుల గురించి ఒక్క మాట మాట్లాడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమకారులు భిక్షాటన చేసే దుస్థితికి వచ్చారన్నారు. జగిత్యాల బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకత్వం పల్లెత్తు మాట కూడా అనకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటూ లోక్ సభలో మహిళా బిల్లు వీగిపోవడం, డీలిమిటేషన్ బిల్లు, జనగణనపై ఒక్కమాట మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడూ గౌరవం ఉండదని, అందుకే మహిళా కోటా బిల్లు వీగిపోయినా ఒక్కమాట మాట్లాడ‌లేద‌ని, తమ ఓటమికి ప్రజలకే కారణమని ఇప్పటికీ బ్లేమ్ చేస్తున్నారని మండిపడ్డారు.

తూ కిత్నా అంటూ మై కిత్నా అంటూ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌

రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఒకే రోజు భారీ బహిరంగ సభలు పెట్టి తూ కిత్నా అంటే.. అంటే మై కిత్నా అంటూ బలప్రదర్శనకు దిగుతున్నాయ‌ని త‌ప్పా.. తప్పితే ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ ఉత్తి కథలు చెప్తే.. కాంగ్రెస్ పార్టీ పిట్టకథలు చెప్పిందన్నారు. పార్టీల సెంట్రిక్‌గా కాకుండా ప్రజల సెంట్రిక్‌గా రాజకీయ నాయకత్వం ఉండాలని, అందుకే తాము కొత్త రాజకీయ శక్తిగా ఈనెల 25న వస్తున్నామని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఒక ఆడబిడ్డగా తాను ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ప్రజలంతా తరలివచ్చి ఆశీర్వదించాలని కోరారు. సమస్య ఉంటే దాన్ని పరిష్కరించే వరకు పోరాడేందుకు తాము రాజకీయాల్లోకి వస్తున్నామని చెప్పారు.

సీఎంకు బాధ్య‌త లేదా?

గుంట నక్క ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్లారని గుంపుమేస్త్రీ అంటున్నారని.. ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి బీఆర్ఎస్ నాయకుడు వెళ్తే ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసులో ఏదో జరగబోతుందని కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సీఎం మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను తక్కువ చేసేలా సీఎం మాట్లాడారని అన్నారు. కోర్టులపై తనకు గౌరవం ఉందని, కానీ ఫలానా కేసులో ఇలాంటి తీర్పు రాబోతుందని ముఖ్యమంత్రి చెప్పడం ఏమిటని నిలదీశారు. ఢిల్లీలో గుంటనక్క ఎవరిని కలిశారో చెప్పాలా అంటూ ఆయనతో సీఎం డీల్ మాట్లాడుకుంటున్నారని విమ‌ర్శించారు.

రేవంత్‌రెడ్డి ఎవ‌రు?

తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరని క‌విత ప్రశ్నించారు. ఎవరు ప్రతిపక్షంలో ఉండాలో, ఎవరు పాలకపక్షంలో ఉండాలో డిసైడ్ చేయాల్సింది ప్రజలేన‌న్నారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని ఎలా చెప్తారని.. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలు రెండోసారి ఓట్లేస్తారని ప్రశ్నించారు. సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా సగం మందికి రైతుభరోసా ఇవ్వలేదని, హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చేస్తున్నారని, కుమ్మెర జాతరలో రెండు నెలల పాప చనిపోయినా మాట్లాడలేదని.. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా, జాబ్ క్యాలెండర్ ఇచ్చారని మీరు మళ్లీ అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజల విషయంలో ఏ లెక్కలేని తనం ప్రదర్శిస్తుందో అదే లెక్కలేని తనం కాంగ్రెస్ ప్రదర్శిస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

లెక్క‌లేనిత‌నంతో ప్ర‌భుత్వం వ్య‌వ‌హారం

ఆర్టీసీ కార్మికులంటే లెక్కలేనితనంతో ప్రభుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, కార్మికులు లేకుండా చేసి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు. ఈనెల 25న తెలంగాణ రాజకీయాల్లోకి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని, ప్రజలందరికీ ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. పార్టీ ఆవిర్భావ సభకు సిరిసిల్ల నుంచి పార్టీ కార్యకర్తలు పాదయాత్రగా బయల్దేరారని తెలిపారు. తమ పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే క్యాడర్ వాహనాలకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని పోలీసులు, అధికార యంత్రాంగాన్ని కోరారు. సమ్మెకు దిగిన ఆర్టిజన్లను బెదిరించి విధుల్లో చేరేలా ఒత్తిడి చేశారన్నారు. ప్రజలందరూ సమస్యల్లో ఉంటే అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయని, కార్మికులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలను అడ్డుకుంటామన్నారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement