త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagga Reddy | హరీశ్ రావు పెట్రోల్ మీద పోసుకున్నడు కానీ.. అగ్గిపెట్టె తెచ్చుకోలే..!

లక్ష కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయినందుకు కేసీఆర్, హరీశ్ రావు ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

J

Telangana | Published On Jul 12, 2026, 8.56 pm IST

Jagga Reddy | హరీశ్ రావు పెట్రోల్ మీద పోసుకున్నడు కానీ.. అగ్గిపెట్టె తెచ్చుకోలే..!
Advertisement
  • కాళేశ్వరం కూలిపోతే క్షమాపణ చెప్పరా?
  • రక్తం చిందించే ధైర్యం లేదు
  • హింసకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ ఇల్లు
  • ప్రజలకు ముందు క్షమాపణ చెప్పి మాట్లాడండి
  • హరీశ్ రావు, ఈటలపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jagga Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ (BRS) నేతలు కేసీఆర్, హరీశ్ రావులపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లక్ష కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేసినందుకు వారు ముందుగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

హరీశ్ రావుకు రక్తం చిందించేంత ధైర్యం లేదని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. "తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎంతోమంది యువకులు బలిదానాలు చేశారు. కానీ హరీశ్ రావు మాత్రం తనపై పెట్రోల్ పోసుకుని, అగ్గిపెట్టె తెచ్చుకోవడం మర్చిపోయాడు. పెట్రోల్ తెచ్చుకున్నవాడు అగ్గిపెట్టె తేలేడా?" అంటూ చురకలంటించారు.

హింసకు 'కేరాఫ్ అడ్రస్' కేసీఆర్ (KCR) ఇల్లేనని, ఆ కుటుంబానికి ఉన్న రెచ్చగొట్టే స్వభావం వల్లే నాడు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏదో ఒకటి అనాలన్నదే హరీశ్ రావు లైన్‌గా మారిందని, తమకు నచ్చకపోతే సైకోలు అంటారా? అని ఆయన మండిపడ్డారు.

ఎన్‌డీఎస్‌ఏ (NDSA) సూచనలకు కాంగ్రెస్ సిద్ధం

రైతులకు మేలు చేసే విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తమ రాజకీయ సంస్కృతి అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్, హరీశ్ రావుల సంస్కృతి అది కాదన్నారు. ఎన్‌డీఎస్‌ఏ (NDSA) ఏం చెబితే అది చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కానీ, ఎన్‌డీఎస్‌ఏ దగ్గరికి వెళ్దామంటే హరీశ్ రావు నుంచి స్పందన లేదన్నారు.

బీఆర్ఎస్‌ను కాపాడుతున్న ఈటల

ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్‌పైనా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసినందుకే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈటలకు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే.. కేసీఆర్, హరీశ్ రావులను తీసుకుని కేంద్రం దగ్గరికి వెళ్లాలని సూచించారు. అవసరమైతే వారితో పాటు కాంగ్రెస్ మంత్రులు కూడా వస్తారని అది చేయకుండా ఎందుకు మాట్లాడుతున్నావని ఈటలను ప్రశ్నించారు.

కాంగ్రెస్‌లో పంచాయితీలు సహజమే

తుంగతుర్తి కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ.. "పంచాయితీలు అంటేనే కాంగ్రెస్" అని జగ్గారెడ్డి కుండబద్దలు కొట్టారు. అన్ని పార్టీల్లోనూ గొడవలు ఉంటాయని, కోపతాపాలు సహజమేనని అన్నారు. అయితే మిగతా పార్టీల నేతలు లోపల మాట్లాడుకుంటే, తమ వాళ్లు బయట ఓపెన్‌గా మాట్లాడుకుంటారని, తేడా అదేనని స్పష్టం చేశారు. తుంగతుర్తి పంచాయితీపై ప్రస్తుతం పోస్ట్‌మార్టం జరుగుతోందని, అందరి అభిప్రాయాలు తీసుకుని సమస్యను ఎలా సెట్ చేయాలనేది చూస్తున్నామన్నారు. రేపటి కల్లా రిపోర్ట్ సిద్ధం చేసి పార్టీకి ఇస్తామని వెల్లడించారు.

Advertisement
Advertisement