త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | ప‌టాన్‌చెరులో స్థానిక యువ‌త‌నే ప‌రిశ్ర‌మ‌లు పెట్టాలే

Kavitha | ప‌టాన్‌చెరులో స్థానిక యువ‌త‌నే ప‌రిశ్ర‌మ‌లు పెట్టేలా ఆలోచ‌న చేద్దామ‌ని.. ఇక్క‌డి కాలుష్యాన్ని త‌గ్గించుకోవ‌డానికి స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు వేసుకుందామ‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్య‌నించారు. ఇక్క‌డి ప్ర‌జ‌లకు త‌ల‌లో నాలుక‌లా ఉంటూ ప‌ని చేస్తామ‌ని పేర్కొన్నారు.

S

Telangana | Published On Jun 7, 2026, 12.50 pm IST

Kavitha | ప‌టాన్‌చెరులో స్థానిక యువ‌త‌నే ప‌రిశ్ర‌మ‌లు పెట్టాలే
Advertisement
  • ఇక్క‌డొక్క మాట చెప్తే ఇండియా మొత్తం చెప్పినట్టే అంట‌రు
  • అటువంటిది అభివృద్ధి చాలా త‌క్కువ జ‌రిగింది
  • ఇక్క‌డ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలున్న‌య్‌
  • కాలుష్యాన్ని తగ్గించుకొనే స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు వేసుకుందాం
  • ప‌టాన్‌చెరు జెండా పండుగ‌లో టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్య‌లు

Kavitha | త్రినేత్ర‌.న్యూస్: ప‌టాన్‌చెరులో స్థానిక యువ‌త‌నే ప‌రిశ్ర‌మ‌లు పెట్టేలా ఆలోచ‌న చేద్దామ‌ని.. ఇక్క‌డి కాలుష్యాన్ని త‌గ్గించుకోవ‌డానికి స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు వేసుకుందామ‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్య‌నించారు. మ్యాచ్ ఫిక్సింగ్ రాజ‌కీయాలతో ఈ ప్రాంతం అభివృద్ధిలో వెన‌క‌బ‌డి ఉంద‌న్నారు. ఇక్క‌డొక మాట చెప్తే ఇండియా మొత్తం చెప్పిన‌ట్టే అంటార‌ని చెప్పారు. ఇక్క‌డి ప్ర‌జ‌లకు త‌ల‌లో నాలుక‌లా ఉంటూ ప‌ని చేస్తామ‌ని పేర్కొన్నారు. ఆదివారం ఉద‌యం ప‌టాన్‌చెరులో నిర్వ‌హించిన జెండా పండ‌గ సంద‌ర్భంగా ఆమె ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌లు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.

ప్ర‌త్యామ్నాయ ఉద్యోగాలు ఏం ఉన్న‌య్‌..

గ‌త 30 ఏండ్ల నుంచి కూడా ప‌టాన్ చెరు అంటేనే పొల్యూష‌న్ అని చెప్పి చెప్త‌రు. ఇక్క‌డి నుంచి ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లిస్తున్న‌మ‌ని చెప్తున్నం. కానీ ప్ర‌త్యామ్నాయంగా ఏం ఉద్యోగాలు ఉన్న‌య్‌? ఇక్క‌డికి వ‌చ్చి స్థిర‌ప‌డిన ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంటిది? దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు వ‌చ్చి ఇక్క‌డ ఉంట‌రు. ప‌టాన్‌చెరులో ఒక్క మాట చెప్తే ఇండియా మొత్తం చెప్పిన‌ట్టే అంట‌రు. అటువంటిది ఇక్క‌డ అభివృద్ధి ఎట్లుందో ఆలోచ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంది అని క‌విత చెప్పారు.

న‌క్క‌వాగు నుంచి మంజీరాలో క‌లుస్తున్న‌య్..

ప్ర‌ధానంగా ఏషియాలోనే ఒక పెద్ద ఇండస్ట్రియ‌ల్ ఏరియా ఇది. న‌క్క‌వాగు మొత్తం ఎండిపోయింది. ఆ న‌క్క‌వాగు నుంచి కాలుష్య‌మైన నీళ్లు ఇయ్యాళ్ల మంజీరా న‌దిలో క‌లిసే ప‌రిస్థితి వ‌చ్చింది. ప‌టాన్‌చెరులో కిలోమీట‌ర్‌వ‌ర‌కు భూమి లోప‌ల కాలుష్యం ఉంది. తాగునీటి కోసం బోర్ వేసుకుంటే కాలుష్యం.. ఒక బిల్డింగ్ క‌ట్టాలంటే స‌మ‌స్య‌.. ఏదైనా పంట పండించుకోవాలంటే ఇబ్బంది. ఇక్క‌డ ఉన్న ప్ర‌జ‌ల‌కు ఆ బాధ‌లు తెలుసు అని ఆమె పేర్కొన్నారు.

త‌ల‌లో నాలుక‌గా ఉంటూ ప‌ని చేస్తం..

తెలంగాణ ర‌క్ష‌ణ సేన త‌ర‌ఫున మాట ఇస్తున్నం. తెలంగాణ వ‌న‌రులు కాపాడుకోవ‌డానికి మేం క‌ట్టుబ‌డి ఉన్నం. తెలంగాణ భూములు కాపాడుకోవ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్నం. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కాపాడుకుంటం. ప‌టాన్‌చెరులో ఉన్న కాలుష్యం త‌గ్గిస్తం. ఇక్క‌డున్న ప్ర‌జ‌లంద‌రికి త‌ల‌లో నాలుక‌గా ఉంటూ మీ కోసం ప‌ని చేస్తం అని టీఆర్ఎస్ చీఫ్ స్ప‌ష్టం చేశారు.

బీజేపీ ఎంపీ బీఆర్ఎస్‌కు ఓటేసి పోయిండ‌ట‌..

ప్ర‌స్తుతం ఇక్క‌డున్న ఎమ్మెల్యే ఆయ‌న ఏ పార్టీలో ఉన్న‌డో తెల్వ‌దు కావొచ్చు. ఎక్క‌డున్న‌డో అని ఎవ‌రికి అర్థం కాని ప‌రిస్థితి ఉన్న‌ది. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన అభివృద్ధి చాలా త‌క్కువ జ‌రిగింది. బీజేపీ ఎంపీ ఇక్క‌డిదాకా వ‌చ్చి మొన్న బీఆర్ఎస్ వాళ్ల‌కు ఓటేసి పోయిండ‌ట‌. అన్ని పార్టీల నాయ‌కులు ఇక్క‌డ క‌లిసిక‌ట్టుగా దోపిడీ చేస్తున్న‌రు. ప‌టాన్‌చెరులో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలున్న‌య్. అవ‌న్నీ ప‌క్క‌కు తీసేద్దాం అని క‌ల్వ‌కుంట్ల క‌విత చెప్పారు.

పొల్యూష‌న్ లేని తెలంగాణ కావాలే..

కాలుష్యాన్ని త‌గ్గించ‌డానికి స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు వేసుకుందాం. ఇక్క‌డున్న పేద‌వాళ్లు ఎట్లా ముందుకు పోవాలో ఆలోచ‌న చేసుకుందాం. యువ‌తీయువ‌కుల‌కు కొత్త ఉద్యోగాలు ఎట్లా రావాల్నో దానికోసం ఆలోచ‌న చేద్దాం. ప‌టాన్‌చెరులో ఎక్క‌డోడో వ‌చ్చి ప‌రిశ్ర‌మ పెట్టుడు కాదు. ఇక్క‌డున్న మ‌న యూత్ పరిశ్ర‌మ ఎట్ల పెట్టాల్నో ఆలోచ‌న చేద్దాం. అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ లేని తెలంగాణ కావాలే. పొల్యూష‌న్ లేని తెలంగాణ కావాలే. దీని కోసం టీఆర్ఎస్ కృత‌నిశ్చ‌యంతో ప‌ని చేస్త‌ది.

Advertisement
Advertisement