Harish Rao | సోదరి సునీత చెప్తే సోలేపేటకు వచ్చా.. ఇక్కడ 12 గంటల కరెంటే ఇస్తున్నట్టు తేలింది
Harish Rao | రైతులు కరెంటు కోసం ఇబ్బందులు పడుతున్నారని సోదరి సునీత చెబితే సోలేపేటకు వచ్చానని.. ఇక్కడ 12 గంటలే కరెంటు ఇస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆ 12 గంటల్లో కూడా రెండు మూడు సార్లు ట్రిప్ అవుతోందని మండిపడ్డారు. 24 గంటల కరెంటును రైతులకు ఎందుకు దూరం చేస్తున్నారని ప్రశ్నించారు.
- సబ్‌స్టేషన్ ఆపరేటర్‌ను అడిగితే ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్తుండు
- నాట్లు ఏసుకునే టైంల కరెంటు ఇయ్యకుంటే ఎట్లా?
- ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేయడమేనా రేవంత్ ఇచ్చే పేటెంట్
- మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు
Harish Rao | త్రినేత్ర.న్యూస్: రైతులు కరెంటు కోసం ఇబ్బందులు పడుతున్నారని సోదరి సునీత చెబితే సోలేపేటకు వచ్చానని.. ఇక్కడ 12 గంటలే కరెంటు ఇస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆ 12 గంటల్లో కూడా రెండు మూడు సార్లు ట్రిప్ అవుతోందని మండిపడ్డారు. 24 గంటల కరెంటును రైతులకు ఎందుకు దూరం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేయడమేనా రేవంత్ ఇచ్చే పేటెంట్ అని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారం మండలంలోని సోలేపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి ఆయన సందర్శించారు. సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సబ్‌స్టేషన్ లాగ్ బుక్‌ను తనిఖీ చేశారు.
రైతులు కరెంటు కోసం ఇబ్బంది పడుతున్నారని సోదరి సునీత చెబితే సోలేపేట సబ్‌స్టేషన్‌కు సర్ ప్రైజ్ విజిట్‌కి వచ్చాం. సబ్‌స్టేషన్ ఆపరేటర్‌ని అడిగితే.. మొన్నటి దాకా 14-15 గంటలు ఇచ్చాం సార్, ఈ వారం నుంచి కేవలం 12 గంటలే ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. ప్రభుత్వం ఇస్తున్న ఆ 12 గంటల కరెంటులో కూడా రెండు మూడు సార్లు ట్రిప్ అవుతోంది. కరెంటుకు మేమే పేటెంట్ అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మీ పేటెంట్ అంటే ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేయడమేనా? అని ప్రశ్నించారు.
నారుమళ్లు పోసుకునే, నాట్లు వేసుకునే సమయంలో నీళ్లు చాలా అవసరం. కరెంటు ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రవ్యాప్తంగా సబ్‌స్టేషన్ల ముందు రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఉచిత కరెంటు ఇస్తే ఆదాయం రాదనే నెపంతోనే యాదాద్రి, భద్రాద్రిల్లో 1870 మెగావాట్ల ఉత్పత్తిని ఆపేశారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే మిషన్ భగీరథ నీళ్లు బంద్ చేశారు. నీళ్లు ఇవ్వడం చేతకాక మహిళలతో మళ్లీ బిందెలు మోపిస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం రోజూ రైతులకు అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్, ఇంటింటికీ తాగునీరు, పొలాలకు సాగునీరు అందించింది. బొమ్మలరామారంలో చనిపోయిన మా పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి వస్తే.. ఇక్కడి మహిళలు రెండు రోజులకు ఒకసారే నల్లా నీళ్లు వస్తున్నాయని తమ బాధలు చెప్పుకుంటున్నారు.

కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఐదేళ్ల పాటు రాష్ట్రమంతా నీళ్లు ఇస్తే.. ఉన్న వ్యవస్థను నడపడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదు. మిషన్ భగీరథను సరిగ్గా నడిపితే ఆ పేరు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు వస్తుందనే అక్కసుతోనే కావాలని నీళ్లు ఇవ్వడం లేదా? సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, కామారెడ్డి, యాదాద్రి, నల్గొండ, మహబూబ్ నగర్.. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ బిందెలు పట్టుకుని మహిళలు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి కనబడుతోంది. మీరు తెస్తామన్న ఆనాటి రోజులు అంటే ఇవేనా? కరెంటు, ఎరువుల కోసం రైతులు ధర్నాలు చేయడం, తరుగు తీయడమేనా మీ మార్పు అని హరీశ్ రావు నిలదీశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గం తిప్పర్తి మండలంలో, జగిత్యాల జిల్లా ఐలాపూర్, బాల్కొండ, కోహీర్ మండలం దిగ్వాల్, సిద్దిపేట జిల్లా కాజీపూర్, సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ సబ్‌స్టేషన్ల ముందు కేసీఆర్ 23,000 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యంతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో 15,000 మెగావాట్ల లోడు కూడా లేదు, ఎండాకాలం కూడా కాదు.. అయినా రైతులకు ఎందుకు కోతలు పెడుతున్నారు. కోతలు పెట్టడమే కాంగ్రెస్ లక్ష్యమా? ఎన్నికల ముందు 4000 పెన్షన్, 15000 రైతుబంధు, మహిళలకు 2500, విద్యార్థి భరోసా అంటూ మాటల కోతలు కోశారు. ఇప్పుడేమో కరెంటు, బోనస్, కేసీఆర్ కిట్, గొర్రెలు,చేపల పంపిణీ, రైతు బీమాలలో కోతలు పెడుతున్నారు అని మాజీ మంత్రి ఫైరయ్యారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొన్న వరంగల్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంట్ కోతలే లేవని చెప్పారు. మరి ఈరోజు నేను సోలేపేట సబ్‌స్టేషన్ రికార్డులు చూస్తే 12 గంటల కరెంటే ఇస్తున్నారు.. భట్టి దీనికి ఏం సమాధానం చెబుతారు? రాష్ట్రంలో 10-11 గంటల కరెంటే వస్తోంది. మీ మాటలు గడప దాటుతున్నాయి కానీ మీ పనులు గడప దాటడం లేదు. మీరు నిజంగా కడుపు నిండా 24 గంటల కరెంటు ఇస్తే రైతులు ఎందుకు సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బొగ్గు నిల్వలు లేకపోవడం వల్ల కేసీఆర్ నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 1600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు మూతపడి నెలలు గడుస్తోంది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కూడా 270 మెగావాట్ల యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. సింగరేణి మన చేతిలోనే ఉన్నప్పటికీ 1870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎందుకు ఆగిపోయిందో ప్రజలకు సమాధానం చెప్పాలి అని హరీశ్ డిమాండ్ చేశారు.
ముల్లుగర్రతో పొడిస్తే తప్ప ప్రభుత్వం కదలడం లేదు..
రైతులకు ఫ్రీ కరెంటు ఇస్తే పైసలు రావని, కరెంటు ఉత్పత్తి ఆపేసి రైతులకు కోతలు పెడుతున్నారా? కరెంటు లేక కాదు.. రేవంత్ రెడ్డికి మనసు లేక కరెంటు రావడం లేదు. రైతులకు మూడు గంటల కరెంటు చాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారు.. ఇప్పుడు ఆ మాటనే నిజం చేయదలుచుకున్నారా? హైదరాబాద్ ప్రజలకు ఎలాగైతే 24 గంటల కరెంటు వస్తుందో, బాయికాడ రైతుకు కూడా 24 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వాలన్నదే బీఆర్ఎస్ పాలసీ. బీఆర్ఎస్ ముల్లు గర్రతో పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం కదలడం లేదు. దేవాదుల మోటార్లు ఆన్ చేయాలని మేం ప్రశ్నిస్తే తప్ప, నిద్రలేచి 5 నుంచి 9 మోటార్లు ఆన్ చేయలేదు.
యాదాద్రి, భద్రాద్రిలో 1870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలి..
ఇప్పుడు మళ్లి చెబుతున్నాం.. యాదాద్రి, భద్రాద్రిలో ఆగిపోయిన 1870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ప్రారంభించి, రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి. కరువు పరిస్థితుల్లో బోర్లు అడుగంటిపోయినప్పుడు రైతులకు కరెంటు అవసరం చాలా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథపై వెంటనే రివ్యూ చేసి, రోజూ ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ అధికారిని అడిగితే ఒక్క బొమ్మలరామారం మండలంలోనే 10 రైతు బీమాలు పెండింగ్ ఉన్నాయని చెప్పారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారం రోజుల్లో 5 లక్షలు ఇచ్చేలా కేసీఆర్ రైతు బీమా తెస్తే.. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 4000 మంది రైతులకు బీమా డబ్బులు ఐదు నెలలుగా రావడం లేదు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
రైతుబంధు ఎగ్గొట్టారు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టుపెట్టి రుణమాఫీ సగం ఎగ్గొట్టారు.. ఇప్పుడు రైతు బీమా కూడా ఎగ్గొట్టదలుచుకున్నారా.. ఎల్ఐసీకి ప్రభుత్వం ప్రీమియం కట్టలేదా? వెంటనే రైతు బీమాపై రివ్యూ చేసి చనిపోయిన 4000 మంది రైతుల కుటుంబాలకు తక్షణమే 5 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- ●KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..
- ●CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు
- ●Rakul Preet Singh | సినిమా బడ్జెట్ 1100 కోట్లు - రకుల్ రెమ్యూనరేషన్ కోటి
- ●Special Traffic Bureau | ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్.. తెరపైకి ప్రత్యేక బ్యూరో

Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..

CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు




