త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నా.. 33 జిల్లాల్లో రైతు డిస్కంల‌పై ప‌బ్లిక్ హియ‌రింగ్ పెట్టండి: క‌విత విన‌తి

Kavitha | రైతు డిస్కమ్ పేరుతో ఈ ప్రభుత్వం రైతులను పచ్చి దగా చేస్తోందని.. నిజంగా ఈ నిర్ణయం మంచిద‌యితే ఆరు నెలల నుంచి ఎందుకు రహస్యంగా ఉంచిందని, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదని తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ క‌విత ప్ర‌శ్నించారు. 33 జిల్లాల్లో ప‌బ్లిక్ హియ‌రింగ్ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On May 29, 2026, 3.40 pm IST

Kavitha | చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నా.. 33 జిల్లాల్లో రైతు డిస్కంల‌పై ప‌బ్లిక్ హియ‌రింగ్ పెట్టండి: క‌విత విన‌తి
Advertisement
  • రైతుల త‌ర‌ఫున మా ప్ర‌ధాన డిమాండ్ ఇదే
  • ఏసీ గ‌దుల్లో కూసోని తెలంగాణ భ‌విష్య‌త్తును నిర్ణ‌యించొద్దు
  • రైతన్న‌లూ.. ఆలోచించండి.. పైస‌లు పెట్టి క‌రెంట్ కొనే రోజులొస్త‌య్‌
  • విద్యుత్, వ్య‌వ‌సాయ శాఖ మంత్రులు రైతుల‌తో ఎందుకు మాట్ల‌డ‌రు?
  • అందుకే ప్ర‌భుత్వ అప్లికేష‌న్ల‌ను రిజెక్ట్ చేయండి
  • రైతు డిస్కం ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లో టీఆర్ఎస్ చీఫ్‌ క‌విత డిమాండ్

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: రైతు డిస్కమ్ పేరుతో ఈ ప్రభుత్వం రైతులను పచ్చి దగా చేస్తోందని.. నిజంగా ఈ నిర్ణయం మంచిద‌యితే ఆరు నెలల నుంచి ఎందుకు రహస్యంగా ఉంచిందని, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదని తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ క‌విత ప్ర‌శ్నించారు. 33 జిల్లాల్లో ప‌బ్లిక్ హియ‌రింగ్ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు. రైతు డిస్కమ్ ఏర్పాటుపై తెలంగాణ ఈఆర్సీ నిర్వహించిన ప్రజా అభిప్రాయ సేకరణ సమావేశంలో శుక్ర‌వారం ఆమె పాల్గొన్నారు. అనంత‌రం క‌విత మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వ మోసాల‌ను ఎండ‌గ‌ట్టారు.

ఈఆర్సీ పిలుపుతోనే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కొచ్చింది..

రాష్ట్ర ప్ర‌భుత్వం రైతు డిస్కం పేరిట విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు తేవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఈ ప్ర‌య‌త్నాన్ని మేం వ్య‌తిరేకిస్తున్నాం. గ‌త ఆరు నెల‌లుగా ప్ర‌భుత్వం రైతు డిస్కం పేరు మీద ఒక కంపెనీ ఏర్పాటు చేయ‌డం.. సెప‌రేట్ డిస్కం కింద గుర్తించాల‌ని ఈఆర్సీకి అప్లికేష‌న్ పెట్టుకోవ‌డం వంటివి ప్ర‌జ‌ల‌కు చెప్ప‌కుండా దొంగచాటుగా చేస్తూ వ‌చ్చారు. ఇవాళ ఈఆర్సీ ప‌బ్లిక్ హియ‌రింగ్ కోసం పిల‌వ‌డంతోనే ఇది ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చింది అని క‌విత పేర్కొన్నారు.

హైద‌రాబాద్‌లో ఏసీ గ‌దుల‌ల్లో మీటింగులు పెట్టి యావ‌త్ తెలంగాణ భవిష్య‌త్తును నిర్ణ‌యించ‌డం స‌రికాదు. 33 జిల్లాల్లో ప‌బ్లిక్ హియ‌రింగ్ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేస్తున్నాం. ఈఆర్సీ లైసెన్స్ ఇవ్వ‌కముందే జూన్ 2 నుంచి ఫంక్ష‌న్ అయిత‌ద‌ని సీఎం చెప్ప‌డం క‌రెక్టు ప‌ద్ధ‌తి కాదు. ఈ రెండు అంశాల‌ను దృష్టిలో పెట్టుకొని ప్ర‌భుత్వం పెట్టిన అప్లికేష‌న్ల‌ను రిజెక్ట్ చేయాల‌ని ఎల‌క్ట్రీసిటీ రెగ్యులేష‌న్ చైర్మ‌న్‌ను కోరుతున్నాం అని ఆమె అన్నారు.

పైల‌ట్ ప్రాజెక్టుగా తీసుకొని..

రైతు డిస్కమ్‌పై అనేక అనుమానాలున్నాయి. దీన్ని పైలట్ ప్రాజెక్టు తీసుకుని విజయవంతమైన తరువాతే రాష్ట్రమంతా అమలు చేయాలి. సబ్సిడీలు ఇచ్చే కనెక్షన్లను అన్నీ కలిపి ఒక డిస్కమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. డిస్కమ్‌లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు అందడం లేదు. అందువల్లే అవి నష్టాల్లో ఉన్నాయి.

1999లో చంద్ర‌బాబు అదే చేశారు..

రైత‌న్న‌ల‌కు చేతులు జోడించి చెబుతున్నా. క్షేత్ర‌స్థాయిలో ఇప్పుడు తీసుకొస్తున్న సంస్క‌ర‌ణ‌లు రేప‌టి రోజు తెలంగాణ వ్య‌వ‌సాయానికి ఉరితాడులాగా మారే ప్ర‌మాదం ఉంది. 1999లో చంద్ర‌బాబునాయుడు వ్య‌వ‌సాయాన్ని వ‌ర‌ల్డ్ బ్యాంకుకు సంపూర్ణంగా అమ్మాల‌నుకున్నారు. ఇవాళ పేరు వేరున్న‌ప్ప‌టికీ ల‌క్ష్యం మాత్రం అదే ఉంది. డిస్కం అని తెచ్చి విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను ప్రైవేటు ప‌రం చేసే కుట్ర‌లు జ‌రుగుతున్నాయి అని టీఆర్ఎస్ చీఫ్ ఆరోపించారు.

ప్ర‌ధాన పాత్ర‌దారి ప్ర‌భుత్వ‌మే..

ఓ సంద‌ర్భంలో పాత‌బ‌స్తీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ ఓల్డ్ సిటీని మొత్తం అదానీకి అప్ప‌గిస్తా అన్న‌డు. అంటే దీని వెన‌క ఉన్న ల‌క్ష్యం విద్యుత్‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌డ‌మే. ఉన్న డిస్కంలు క‌ష్టాల్లో ఉండ‌డానికి ప్ర‌ధాన పాత్ర‌దారి ప్ర‌భుత్వ‌మే. ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన రూ.54 వేల కోట్ల బ‌కాయిలు రేప్పొద్దున ఇస్తే డిస్కంలు లాభాల్లోకి వ‌స్త‌య్‌. రైతులు ఏ చిన్న ప‌ని కావాల‌న్నా ఆర్డీవో కేంద్రం వద్ద‌కు పోయి పని చేయించుకోవాల్సిన ప‌రిస్థితి ఉంటది. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మ‌ర్ల రిపేరింగ్ సెంట‌ర్లు ఈ రైతు డిస్కంకు ఇస్త‌లేరు. ఇలా ఇయ్య‌న‌ప్పుడు మ‌నకు ఏం ఉప‌యోగం? తీవ్ర‌మైన న‌ష్టం జ‌రుగుత‌ది. రైత‌న్న‌లు ఆలోచించాలి అని క‌ల్వ‌కుంట్ల క‌విత విజ్ఞ‌ప్తి చేశారు.

శంషాబాద్ వ‌ర‌కు లైన్లు వ‌చ్చిన‌య్‌..

ఇప్పుడున్న రెండు డిస్కంల‌లో 45 వేల మంది ఉద్యోగులున్నారు. మొత్తం విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో 70 వేల మంది ఉంట‌రు. 42 శాతం విద్యుత్ క‌నెక్ష‌న్లు రైతు డిస్కంలు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ప్పుడు 42 శాతం ఉద్యోగుల‌ను కూడా ఇవ్వాలి. అలా చేయ‌కుండా ప్రైవేటు ప‌రం చేసే కుట్ర జ‌రుగుతోంది. రైతు పైస‌లు పెట్టి క‌రెంటు కొనే ప‌రిస్థితి వ‌స్త‌ది. భ‌విష్య‌త్ లో ఈ ప్ర‌భుత్వం ఉచిత క‌రెంటును ఎత్తేసే ప‌రిస్థితులు క‌నిపిస్తే భ‌యం వేస్తోంది. కొన్ని ప్రైవేటు కంపెనీల‌ లైన్లు గ‌త ప్ర‌భుత్వంలోనే శంషాబాద్ వ‌ర‌కు వ‌చ్చిన‌య్‌. స‌బ్సిడీ ఇయ్య‌కుండా డిస్కంలు పెడితే ఫెయిల్ అయిత‌య్‌. అలా ఎందుకు పెట్ట‌డం అనేది మా ప్ర‌శ్న. కాబ‌ట్టే ప్ర‌భుత్వ అప్లికేష‌న్‌ను రిజెక్ట్ చేయాల‌ని ఈఆర్సీని అడుగుతున్నం. కాలికి బ‌ల‌పం క‌ట్టుకొని ప్ర‌తి ఊరికి వెళ్తాం. ఈ ప్ర‌భుత్వం రైతుల‌కు చేస్తున్న న‌ష్టాన్ని వివ‌రిస్తాం అని టీఆర్ఎస్ చీఫ్ క‌విత స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement