త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYD Metro | హైదరాబాద్ మెట్రో రైల్‌కు రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్.. ఐఆర్ఎఫ్‌సీతో కీల‌క ఒప్పందం..

HYD Metro | హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC) ద్వారా రూ.13,600 కోట్ల వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్ లభించింది.

P

Telangana | Published On May 25, 2026, 6.49 pm IST

HYD Metro | హైదరాబాద్ మెట్రో రైల్‌కు రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్.. ఐఆర్ఎఫ్‌సీతో కీల‌క ఒప్పందం..
Advertisement

HYD Metro | హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC) ద్వారా రూ.13,600 కోట్ల వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్ లభించింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐఆర్ఎఫ్‌సీ, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) మధ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. కార్యక్రమంలో ఐఆర్ఎఫ్‌సీ సీఈఓ మనోజ్ కుమార్ దుబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామ‌కృష్ణారావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం హైదరాబాద్‌లో సమర్థవంతమైన, సుస్థిరమైన ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి మెట్రో కనెక్టివిటీ విస్తరణ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ రీఫైనాన్సింగ్ ద్వారా ప్రాజెక్టుకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభించనుండగా, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం బలోపేతం అవుతుందని తెలిపారు. ప్రస్తుత రుణ భారం తగ్గి భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు దోహదం చేస్తుందని అధికారులు వెల్లడించారు. ఎల్ అండ్ టీ మెట్రో రైల్‌లోని 100 శాతం వాటాను హెచ్ఎంఆర్ఎల్ ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ రీఫైనాన్సింగ్ అమల్లోకి వచ్చింది.

దీంతో హైదరాబాద్ మెట్రో పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రజా రవాణా వ్యవస్థగా మారింది. ఈ రూ.13,600 కోట్ల నిధులను నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు మరియు వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్‌కు వినియోగించనున్నారు. 69.2 కిలోమీటర్ల పొడవుతో మూడు కారిడార్లు, 57 స్టేషన్లతో ఉన్న హైదరాబాద్ మెట్రో ఫేజ్–1 ప్రస్తుతం రోజుకు 5లక్షలకు పైగా ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఈ రీఫైనాన్సింగ్‌తో మెట్రో ఆర్థిక స్థిరత్వం మరింత బలోపేతం కావడంతో పాటు కొత్త కారిడార్లు, చివరి మైలు కనెక్టివిటీ సహా విస్తరణ పనులు వేగవంతం కానున్నాయి. ఇది సుస్థిరమైన, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధిలో కీలక మైలురాయిగా ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement
Advertisement