త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Operation Octopus 2.0 | అంతర్రాష్ట్ర సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు.. 32 మంది బ్యాంక్ అధికారులు సహా 56 మంది అరెస్ట్‌

Operation Octopus 2.0 | హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఏప్రిల్‌లో ఆప‌రేష‌న్ ఆక్టోప‌స్ 2.0తో అంతర్రాష్ట్ర సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ నెలలో వచ్చిన ఎన్సీఆర్‌పీ ఫిర్యాదుల ఆధారంగా మొత్తం 77 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, లా అండ్ ఆర్డర్ బృందాల సహకారంతో 9 రాష్ట్రాల్లో విస్తరించిన నెట్‌వర్క్‌పై దాడులు నిర్వహించినట్లు క్రైమ్స్ అండ్ సిట్ అడిష‌న‌ర్ క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు.

P

Telangana | Published On May 5, 2026, 8.52 pm IST

Operation Octopus 2.0 | అంతర్రాష్ట్ర సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు.. 32 మంది బ్యాంక్ అధికారులు సహా 56 మంది అరెస్ట్‌
Advertisement

Operation Octopus 2.0 | హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఏప్రిల్‌లో ఆప‌రేష‌న్ ఆక్టోప‌స్ 2.0తో అంతర్రాష్ట్ర సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ నెలలో వచ్చిన ఎన్సీఆర్‌పీ ఫిర్యాదుల ఆధారంగా మొత్తం 77 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, లా అండ్ ఆర్డర్ బృందాల సహకారంతో 9 రాష్ట్రాల్లో విస్తరించిన నెట్‌వర్క్‌పై దాడులు నిర్వహించినట్లు క్రైమ్స్ అండ్ సిట్ అడిష‌న‌ర్ క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 32 మంది బ్యాంక్ మేనేజర్లు, కేవైసీ అప్రూవర్లు, రిలేషన్‌షిప్ మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, 15 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, 9 మంది అకౌంట్ ఆపరేటర్లు అరెస్టయ్యారు. వీరికి సంబంధించి మొత్తం 101 కేసులు ఉన్నట్లు గుర్తించారు.

బాధితులకు రూ. 69,99,097 తిరిగి చెల్లించినట్లు తెలిపారు. ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 56 మందిని అరెస్టు చేయగా, వీరిలో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో 17 మంది, ట్రేడింగ్ ఫ్రాడ్‌లో 30 మంది, డిజిటల్ అరెస్ట్ కేసులో ఒకరు, సోషల్ మీడియా మోసాల్లో ఇద్దరు, ఫెడెక్స్ మోసం సహా ఇతర కేసుల్లో మిగతావారు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, క‌ర్నాట‌క‌, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన నిందితుల‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 34 మొబైల్ ఫోన్లు, 8 చెక్ బుక్కులు, 11 షెల్ కంపెనీ స్టాంపులు, ఒక ట్యాబ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే, 2219 పిటిషన్లలో 283 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, 10 మంది అరెస్టు చేసి రూ.23.33 లక్షలు రీఫండ్ చేసినట్లు జోనల్ సైబర్ సెల్స్ వివరించాయి. కేసుల్లో రూ. 9.13 కోట్లకు పైగా మోసం జరిగినట్లు గుర్తించి, రూ. 69.99 లక్షలు రిక‌వ‌రీ చేసిన‌ట్లు పేర్కొన్నారు.

సైబర్ పెట్రోలింగ్ ద్వారా 427 సోషల్ మీడియా ప్రొఫైల్‌లు, 1903 అక్రమ ప్రకటనలను తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. సీ-మిత్ర ద్వారా 1250 కాల్స్ చేసి అవగాహన కల్పించడంతో పాటు 194 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రధాన కేసులో “గోల్డెన్ బ్రిడ్జ్ ఇన్వెస్ట్‌మెంట్ (GBI) లిమిటెడ్” పేరుతో నకిలీ ట్రేడింగ్ స్కీమ్ ద్వారా బాధితురాలికి రూ. 74.99 లక్షలు నష్టం జ‌రిగిన‌ట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కోల్‌కతాకు చెందిన బ్యాంక్ అధికారులు మొహమ్మద్ రియాజుద్దీన్, మనీష్ ప్రసాద్ విశ్వకర్మను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. డిజిటల్ అరెస్ట్, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లు, వాట్సాప్ డీపీ మోసాలు, హనీ ట్రాప్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని, cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement
Advertisement