Medaram Jatara | సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. ఇంకో 10 రోజుల్లో పెద్ద జాతర ప్రారంభం కానుండటంతో ఇప్పటి నుంచే మేడారానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. నెల రోజుల నుంచే మేడారానికి భక్తుల తాకిడి పెరిగింది. ఈనెల 28 న మహా జాతర ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడి నుంచి మేడారం వరకు వాహనాల రద్దీ కొనసాగుతోంది. కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో వాహనాలను భక్తులు పార్కింగ్ చేసి సమ్మక్క తల్లి దర్శనం కోసం నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈనెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర ఉండనుంది. 28న చిలకలగుట్ట నుంచి గద్దె ప్రాంగణం వద్దకు సమ్మక్కను తీసుకురానున్నారు. 29న సారలమ్మను తీసుకురానున్నారు. 30,31 న భక్తులను అమ్మవార్లు దర్శనం ఇస్తారు. ఆ తర్వాత 31 రాత్రి అమ్మవార్లను గుట్టకు తీసుకెళ్లడంతో జాతర ముగుస్తుంది.