త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Godavarikhani Young Woman Murdered Case | మ‌రో వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉంటుంద‌ని చంపేశాడు

Godavarikhani Young Woman Murdered Case | గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు.

S

Telangana | Published On Sep 20, 2026, 5.23 pm IST

Godavarikhani Young Woman Murdered Case | మ‌రో వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉంటుంద‌ని చంపేశాడు
Advertisement
  • గోదావ‌రిఖ‌ని యువ‌తి అనుమానాస్ప‌ద మృతి కేసును ఛేదించాం
  • నిందితుల‌ను అదుపులోకి తీసుకొని, మొబైల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నాం
  • మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించిన ఏసీపీ మ‌డ‌త ర‌మేశ్‌

Godavarikhani Young Woman Murdered Case | త్రినేత్ర‌.న్యూస్‌: గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు జెట్టి నవీన్ కుమార్‌ను ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో గోదావరిఖని బ్రిడ్జి, గంగానగర్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి సంస్థలో ఓవర్‌మన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్‌ను ఓసీపీ-5 గని వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను ఏసీపీ మడత రమేష్ ఆదివారం మీడియాకు వెల్ల‌డించారు.

వివరాల్లోకి వెళితే.. 2022లో సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న యువతితో నవీన్ కుమార్‌కు పరిచయం ఏర్పడింది. భార్యాభర్తల మధ్య కుటుంబ విభేదాల కారణంగా నవీన్ కుమార్ కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. కళాశాలకు వచ్చే క్రమంలో యువతితో అతనికి పరిచయం ఏర్పడి, అనంతరం అది సన్నిహిత సంబంధంగా మారింది. ఈ సంబంధాన్ని వివాహం వరకు తీసుకెళ్లాలని నవీన్ కుమార్ భావించాడు.

మ‌రోవైపు యువతి డిప్లొమా పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీటెక్ మైనింగ్ చదువుతున్న సమయంలో శిక్షణ నిమిత్తం గోదావరిఖనికి వచ్చింది. ఈ సమయంలో ఆమెకు బొమ్మకంటి రవికుమార్‌తో పరిచయం ఏర్పడింది. యువతి నవీన్ కుమార్‌కు దూరంగా ఉంటూ రవికుమార్‌తో సన్నిహితంగా మెలగడాన్ని నవీన్ కుమార్ తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో యువతిని హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకున్న నవీన్ కుమార్.. ఈనెల 12న‌ ముందస్తు ప్రణాళికతో పురుగుల మందును ఒక నీటి సీసాలో నింపుకుని తన ఎకోస్పోర్ట్ కారులో ఉంచుకున్నాడు. అదేరోజు సాయంత్రం విధులు ముగించుకుని ఆటోలో వెళ్తున్న యువతిని ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్స్ వద్ద తన కారులో ఎక్కించుకున్నాడు.

త‌న నేరం బ‌య‌ట‌ప‌డుతుంద‌నే భ‌యంతో..

అనంతరం ఎన్టీపీసీ, ఎఫ్‌సీఎల్, ఐఓసీ ప్రాంతాల్లో కారులో తిప్పుతూ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. రవికుమార్ తనపై అత్యాచారం చేయడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంటూ ఒక సూసైడ్ నోట్ రాయించాడు. ఆ నోట్‌ను ఆమె ఫోన్‌తో ఫొటో తీసిన అనంతరం, ముందుగానే సిద్ధం చేసుకున్న పురుగుల మందును యువతికి బలవంతంగా తాగించాడు. పురుగుల మందు తీసుకోవడంతో యువతి కారులోనే స్పృహ కోల్పోయింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించాల్సి ఉండ‌గా తన నేరం బయటపడుతుందనే భయంతో నవీన్ కుమార్ ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌లేదు.

యువతి ప్రాణాలు పోయేదాకా నవీన్ కుమార్ కొంతసేపు కారును వివిధ ప్రాంతాల్లో తిప్పాడు. అనంతరం యువతి స్పృహ కోల్పోయిన తరువాత ఆమె మొబైల్ ఫోన్ నుంచి ఆమె తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. రాత్రి సుమారు 7:30 నుంచి 7:45 గంటల మధ్య యువతిని ఆమె ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కూడా కారులో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రికి చేరుకున్న అనంతరం నవీన్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది.

తన నేరం బయటపడుతుందనే భయంతో నవీన్ కుమార్ నేరానికి ఉపయోగించిన కారును కడిగాడు. సూసైడ్ నోట్, పురుగుల మందు సీసా, మొబైల్ సిమ్ కార్డులను తొలగించి ఆధారాలు లభించకుండా చేసేందుకు ప్రయత్నించాడు. అనంతరం హైదరాబాద్‌కు పారిపోయాడు. సీసీ కెమెరాల ఆధారంగా న‌వీన్‌కుమార్‌ను గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన ఎకోస్పోర్ట్ కారు, నిందితులకు చెందిన రెండు సెల్‌ఫోన్లు, ఒక ట్యాబ్ స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు వివ‌రించారు. బొమ్మకంటి రవికుమార్‌పై కూడా ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ట్లు గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపారు.

Advertisement
Advertisement