త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirumala Brahmotsavam | ముత్యాల పందిరిలో.. బాలకృష్ణుడి లీలా వినోదం

Tirumala Brahmotsavam | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు గురువారం రాత్రి ముత్యపుపందిరి వాహనసేవ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఏణి కన్నన్‌ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిచ్చెన ఎక్కి వెన్న దొంగిలించే బాలకృష్ణుడి లీలను ప్రతిబింబించేలా స్వామివారిని అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

P

Devotional | Published On Sep 17, 2026, 8.51 pm IST

Tirumala Brahmotsavam | ముత్యాల పందిరిలో.. బాలకృష్ణుడి లీలా వినోదం
Advertisement

Tirumala Brahmotsavam | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు గురువారం రాత్రి ముత్యపుపందిరి వాహనసేవ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఏణి కన్నన్‌ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిచ్చెన ఎక్కి వెన్న దొంగిలించే బాలకృష్ణుడి లీలను ప్రతిబింబించేలా స్వామివారిని అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏణి కన్నన్‌ అలంకారంలో ముత్యపుపందిరిపై కొలువుదీరిన శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మాడ వీధులకు చేరుకున్నారు. వాహనసేవ సందర్భంగా శ్రీవారిని చూసిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. మాడ వీధుల్లో వాహనసేవ అంగరంగ వైభవంగా కొనసాగగా.. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి.

సకల సౌభాగ్య సిద్ధికి ప్రతీక

ముత్యపుపందిరి వాహనసేవకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది. జ్యోతిషశాస్త్రంలో ముత్యాన్ని చంద్రునికి ప్రతీకగా పేర్కొంటారు. పురాణాల్లో శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాలతో కూడిన ఆభరణాలను ధరించినట్లు ప్రస్తావనలు ఉన్నాయి. ఆదిశేషుని పడగలను ముత్యాల పందిరిగా స్వీకరించి శ్రీనివాసుడు భక్తులకు దర్శనమివ్వడం ఈ వాహనసేవలోని విశిష్టతగా చెబుతారు. చల్లని ముత్యాల పందిరి కింద కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకోవడం వల్ల భక్తుల తాపత్రయాలు తొలగిపోతాయని పురాణ ప్రశస్తి. స్వామివారి కృపతో జీవితాల్లో సుఖశాంతులు, సకల శుభాలు, సౌభాగ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో బాలకృష్ణుడి మనోహర రూపాన్ని తలపించే ఏణి కన్నన్‌ అలంకారంలో ముత్యపుపందిరిపై దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామివారిని భక్తులు కన్నులపండువగా దర్శించుకున్నారు.

ఈ ముత్యపుపందిరి వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ ఎస్ అబ్దుల్ నజీర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ, పలువురు బోర్డు సభ్యులు, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement