త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | గంటె పట్టుకొని ఫొటోలకు ఫోజులివ్వడం రేవంత్‌కే చెల్లింది..

Harish Rao | వంట వండి వడ్డనకు సిద్ధం చేస్తే.. గంటె పట్టుకొని ఫొటోలకు ఫోజులివ్వడం రేవంత్ రెడ్డికే చెల్లింద‌ని సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే.. వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తున్న రేవంత్ అర్భకత్వాన్ని చూసి జాలి వేస్తోంద‌న్నారు.

P

Telangana | Published On Jan 16, 2026, 6.32 pm IST

Harish Rao | గంటె పట్టుకొని ఫొటోలకు ఫోజులివ్వడం రేవంత్‌కే చెల్లింది..
Advertisement
  • రేవంత్ అర్భకత్వాన్ని చూసి జాలి వేస్తోంది
  • మళ్ళీ రీ-రన్ డ్రామాలు ఎందుకు?
  • ముక్కు నేల‌కురాసి రైతులకు క్షమాపణ చెప్పాలి
  • సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : వంట వండి వడ్డనకు సిద్ధం చేస్తే.. గంటె పట్టుకొని ఫొటోలకు ఫోజులివ్వడం రేవంత్ రెడ్డికే చెల్లింద‌ని సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే.. వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తున్న రేవంత్ అర్భకత్వాన్ని చూసి జాలి వేస్తోంద‌న్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నిర్మించిందేం లేక కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణాలకు రిబ్బన్ కట్ చేయడమే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడ‌ని ఆరోపించారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు.. సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్‌కి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకపత్రాలు రెడీ మేడ్‌గా తయారై ఉన్నాయ‌ని, తట్టెడు మట్టి తీసింది లేదు.. ఒక్క ఇటుక వేసింది లేదు అయినా చనాకా కొరటా, సదర్మాట్ బ్యారేజీలను తామే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకున్న నేటి మీ సభ మీరు చెప్పినట్లే.. చరిత్రలో నిలబడుతుంది ఉత్తం గారూ అంటూ నిల‌దీశారు.

2013లో వెన్ ర‌న్ పూర్తి..

కేసీఆర్ మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకొని, రూ.1200 కోట్లు ఖర్చు పెట్టి చనాకా-కొరాటా బ్యారేజీ, పంప్ హౌస్‌లు, మెయిన్ కెనాల్, సబ్ స్టేషన్లతో సహా పనులు పూర్తి చేయించార‌న్నారు. 2023 సెప్టెంబర్‌లోనే సక్సెస్‌ఫుల్‌గా వెట్ రన్ కూడా పూర్తి చేశార‌న్నారు. ప్రాజెక్టుకు కాలువల పనులకు అవసరమైన 3,200 ఎకరాల్లో 1600 ఎకరాలను కేసీఆర్ సేకరిస్తే.. ఈ రెండేళ్లలో ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేని నువ్వు, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వని నువ్వు.. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ రీ-రన్ (వెట్ రన్) డ్రామాలు ఆడుతున్నావు? అంటూ ధ్వ‌జ‌మెత్తారు. రెండేళ్లుగా భూమి సేకరించకుండా, కాలువలు తవ్వకుండా.. ఆదిలాబాద్ ప్రజలను మోసపుచ్చార‌ని, క్రెడిట్ కొట్టేయడం మీద ఉన్న శ్రద్ధ.. భూసేకరణ మీద పెట్టి ఉంటే ఈపాటికి ప్రాజెక్ట్ ఫలితాలు రైతులకు దక్కేవి అంటూ విమ‌ర్శించారు.

ఆదిలాబాద్ రైతుల నోట్లో మ‌ట్టికొట్టారు..

1.5 టీఎంసీల సామర్థ్యంతో కేసీఆర్ రూ.500 కోట్లతో సదర్మాట్ బ్యారేజీని సిద్ధం చేస్తే.. రెండేళ్లుగా చుక్క నీరు నిలపకుండా ఉమ్మడి ఆదిలాబాద్ రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. రెండేళ్ల కింద‌టే 18వేల ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా, ఇవ్వకున్నా రైతులకు తీరని అన్యాయం చేశారంటూ మండిప‌డ్డారు.
ఇప్పుడు సిగ్గులేకుండా రిబ్బన్ కట్ చేస్తూ అంతా మీ ఘనతే అని డబ్బా కొట్టుకోవడం మీ దగుల్భాజీతనానికి పరాకాష్ట అంటూ మండిప‌డ్డారు. ఈ రెండేళ్ల కాలం వృథా చేసినందుకు ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే నియామ‌క‌ప‌త్రాలు..

కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు పంచడం.. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప సొంతంగా మీరు చేసిందేం లేదంటూ మండిప‌డ్డారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టుకు సున్నాలు వేసి నాదే అని చాటింపు వేసుకోవడం మీ అల్పబుద్దికి నిదర్శన‌మ‌ని, ప్రాజెక్టులు కట్టడం మా వంతు, పేర్లు పెట్టుకోవడం మీ వంతు పరిపాటిగా మారింద‌ని మండిప‌డ్డారు. లోయర్ పెన్ గంగా ప్రాజెక్టు పేరు చెప్పుకొని రెండు సార్లు ఎన్నికల్లో గెలిచి, ప్రజల్ని మోసం చేసిన సీ రామచంద్రారెడ్డి పేరు ప్రాజెక్టుకు పెట్టడం అంటే ఆదిలాబాద్ ప్రజల మనోభావాలను అవమానించడమేన‌న్నారు. ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ ప్రజల కలలు సాకారం చేసింది బీఆర్ఎస్ అయితే, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో వీసమెత్తు కృషి చేయని వ్యక్తి పేరు పెట్టి మోసం చేస్తున్నది కాంగ్రెస్ అంటూ మండిప‌డ్డారు.
ఆదిలాబాద్ వెనుకబాటు తనానికి, పాలమూరు వలసలకు కారణం దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా? అంటూ నిల‌దీశారు.

రెండేళ్లు గడిచినా తట్టెడు మట్టి తీయ‌లేక‌పోయారు..

తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడుతామని చెప్పి రెండేళ్లు గడిచినా ఒక్క తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేక పోయారు? అంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. తమ్మిడిహట్టి పేరు మీద అప్పుడు ఆరేండ్లు, ఇప్పుడు రెండేళ్లు కాలయాపన చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. మాయ మాటలు చెప్పి ఆదిలాబాద్ జిల్లాకు తీరని ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆరోపించారు. గ్రావిటి కాలువను వదిలి ఎత్తిపోతలకు వెళ్లామని మమ్మల్ని విమర్శించిన మీరు ఇప్పుడు తమ్మడిహట్టి నుంచి గ్రావిటి ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చి చూపాల‌ని స‌వాల్ విసిరారు. లేదంటే అధికారం కోసం ప్రజలకు నోటికొచ్చిన అబద్దం చెప్పినందుకు క్షమాపణలు చెప్పాల‌న్నారు. చిత్తశుద్ది గల్ల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తది తప్ప సాకులు వెతకద‌ని, రెండేళ్లలో చేసిందేం లేక బిఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నడు రేవంత్ రెడ్డి అంటూ మండిప‌డ్డారు. ఎనుముల ఫ్యామిలీ అభివృద్ది కోసం రెండేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ప‌దే ప‌దే త‌ప్పుడు ప్ర‌చారం..

బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అప్పు అక్షరాల రూ.4.17లక్షల కోట్లే అని కాగ్‌ రిపోర్ట్‌తో పాటు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పినా ఎందుకు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని ఆయ‌న హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ప్రతిపక్షంలో అబద్దాలే, అధికార పక్షంలో అబద్దాలే.. జీవితమంతా అబద్దాలేనా? అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రెండేళ్లలోనే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి, ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క కాల్వ తీయలేదు, ఒక్క చెరువు తవ్వలేదు, ఒక్క హామి నిలబెట్టుకోలేదు, తెచ్చిన అప్పులతో ఏం చేసావో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీ పాలన మీద నీకు నమ్మకం ఉంటే మా జోగు రామన్న, బీఆర్ెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను ఎందుకు అరెస్టు చేశార‌ని నిల‌దీశారు. అరెస్టులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతూ పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగుతూ ఎన్ని రోజులు గడుపుతావు అంటూ మండిప‌డ్డారు. 'చీప్' మినిస్టర్ రేవంత్ రెడ్డి.. పరిపాలన అంటే కేవలం కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల దగ్గర శిలాఫలకాల మీద మీ పేరు చెక్కించుకోవడం కాదు.. ప్రజల మనోఫలకాల మీద మీ ముద్ర వేసుకునేలా పని చేయడం అని ఇప్పటికైనా గ్రహించండి అంటూ హిత‌వు ప‌లికారు.

Advertisement

తాజావార్తలు

Advertisement