త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth | ఆదిలాబాద్‌లో 10 వేల ఎక‌రాల్లో పారిశ్రామిక వాడ‌.. సీఎం రేవంత్ సంక్రాంతి కానుక‌

CM Revanth | సంక్రాంతి పండుగ వేళ ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కానుక‌ల వ‌ర్షం కురిపించారు. అభివృద్ధిలో అత్యంత వెనుక‌బ‌డ్డ ఆదిలాబాద్ జిల్లాలో 10 వేల ఎక‌రాల్లో పారిశ్రామిక వాడ‌ను ఏర్పాటు చేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Jan 16, 2026, 5.56 pm IST

CM Revanth | ఆదిలాబాద్‌లో 10 వేల ఎక‌రాల్లో పారిశ్రామిక వాడ‌.. సీఎం రేవంత్ సంక్రాంతి కానుక‌
Advertisement

ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు తీసుకువస్తాం..
ఎర్ర బ‌స్సు రాని ఈ ప్రాంతంలో ఎయిర్ బ‌స్సులు తిప్పుతాం..
బాస‌ర ట్రిపుల్ ఐటీలో యూనివ‌ర్సిటీని ప్రారంభిస్తాం..
నిర్మ‌ల్‌కు ఏటీసీ మంజూరు చేస్తాం..
తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద‌నే ప్రాణ‌హిత క‌ట్టి తీరుతాం
నిర్మ‌ల్ బ‌హిరంగ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth | త్రినేత్ర‌.న్యూస్ : సంక్రాంతి పండుగ వేళ ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కానుక‌ల వ‌ర్షం కురిపించారు. అభివృద్ధిలో అత్యంత వెనుక‌బ‌డ్డ ఆదిలాబాద్ జిల్లాలో 10 వేల ఎక‌రాల్లో పారిశ్రామిక వాడ‌ను ఏర్పాటు చేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు తీసుకువ‌స్తాం.. ఎర్ర బ‌స్సు కూడా రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బ‌స్సులను తీసుకువ‌స్తామ‌న్నారు. బాస‌ర ట్రిపుల్ ఐటీలో అధునాతన స‌దుపాయాల‌తో యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేస్తామ‌న్నారు. నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి అడ్వాన్స్ టెక్నాల‌జీ సెంట‌ర్‌ను మంజూరు చేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించారు. ఇక సాగునీటి రంగానికి సంబంధించి ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద‌నే ప్రాణ‌హిత ప్రాజెక్టును క‌ట్టి తీరుతామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హతిఘాట్‌లో చనాక - కొరాటా బ్యారేజ్ పంప్‌హౌస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి లోయ‌ర్ పెన్ గంగా ప్రాజెక్టు ప్ర‌ధాన కాల్వ‌కు నీటిని విడుద‌ల చేశారు. అనంత‌రం నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో సదర్మట్‌ బ్యారేజీని సీఎం ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం రేవంత్ పాల్గొని ప్ర‌సంగించారు.

నాడు దివంగ‌త సీఎం వైఎస్సార్ మొద‌లు పెట్టిన ప్రాణ‌హిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో రెండున్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు ఇవ్వాల్సి ఉండే. గ‌త పాల‌కుల స‌స్వార్థ‌మా..? ఆలోచ‌న‌లో లోప‌మా.. తెలియ‌దు కానీ.. ఒక ల‌క్షా ప‌ది వేల కోట్ల రూపాయాలు ఖ‌ర్చు పెట్టిన.. ఇంకా 50 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టాల్సి ఉన్నా.. ఆదిలాబాద్ జిల్లాకు గోదావ‌రి జ‌లాలు రావ‌డం సాధ్యం కాలేదు. అందుకే ఈనాడు మ‌న ప్ర‌భుత్వం ఆలోచ‌న చేసి ఆదిలాబాద్ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలంటే తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద ప్రాణ‌హిత ప్రాజెక్టు క‌ట్టాల‌ని నిర్ణ‌యించాం. దానికి సంబంధించిన సర్వేలు జ‌రుగుతున్నాయి. బ‌డ్జెట్ స‌మావేశాల్లోపు ఈ తుమ్మిడిహ‌ట్టి ప్రాజెక్టుపై సంపూర్ణ‌మైన నివేదిక త‌యారు చేయాల‌ని సంబంధిత మంత్రులను, అధికారుల‌ను ఆదేశిస్తున్నాను. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరందించి రైతాంగానికి న్యాయం చేద్దాం. ప్ర‌తి నీటి చుక్క‌ను ఒడిసి ప‌ట్టుకుందాం అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఎర్ర బ‌స్సు కాదు.. ఎయిర్‌బ‌స్సులు తీసుకువ‌స్తాం..

ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజ‌న గూడేల‌కు ఎర్ర బ‌స్సే క‌ష్టం. ఎందుకంటే గూడేల‌కు ర‌హ‌దారులు లేక ఎర్ర‌బ‌స్సులు రావ‌డం లేద‌ని ఆదివాసీలు వాపోయేవారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్‌పోర్టు తీసుకువ‌స్తాం. ఎర్ర బ‌స్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్‌బ‌స్సుల‌ను తీసుకువ‌స్తాం. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శిలాఫ‌ల‌కం వేయించుకుందాం అని రేవంత్ తెలిపారు.

10 వేల ఎక‌రాల్లో పారిశ్రామిక వాడ‌..

అభివృద్ధిలో వెనుక‌బ‌డ్డ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి ఒక్క ఎయిర్‌పోర్టుతోనే సాధ్యం కాదు. కాబ‌ట్టి జిల్లాలో అనువైన ప్రాంతంలో అతిపెద్ద పారిశ్రామిక వాడ‌ను ఏర్పాటు చేసుకుందాం. 10 వేల ఎక‌రాల భూమిని సేక‌రించి, ఈ దేశంలో ఉండే ప్ర‌తి ప‌రిశ్ర‌మ‌ను తీసుకొచ్చి నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేలా ప్ర‌ణాళిక‌లు త‌యారు చేస్తున్నాం. త‌ద్వారా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకుందామ‌ని సీఎం అన్నారు.

బాస‌ర ట్రిపుల్ ఐటీలో యూనివ‌ర్సిటీ..!

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో యూనివ‌ర్సిటీ లేదు.. వ‌ర్సిటీ మంజూరు చేయాల‌ని స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌తి సంద‌ర్భంలో విజ్ఞ‌ప్తి చేశారు. అయితే ఈ ఆదిలాబాద్ జిల్లాలో యూనివ‌ర్సిటీ మంజూరు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ త‌మ ప్రాంతంలోనే నెల‌కొల్పాల‌ని అనేక‌ విన‌తులు ఇస్తున్నారు. ఇందులో త‌ప్పు లేదు. కానీ బాస‌ర ట్రిపుల్ ఐటీలో యూనివ‌ర్సిటీని ప్రారంభించుకుందాం. యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయండి.. ఇందుకు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏటీసీ

స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మ‌హేశ్వ‌ర్ రెడ్డి విజ్ఞ‌ప్తి మేర‌కు నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి అడ్వాన్స్ టెక్నాల‌జీ(ఏటీసీ) సెంట‌ర్‌ను మంజూరు చేస్తున్నాం.ఈ సెంట‌ర్ ద్వారా స్థానిక యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి. వీటితో పాటు స్టేడియం, కొత్త క‌లెక్ట‌రేట్, మున్సిపాలిటీల‌కు సంబంధించిన నిధుల గురించి స్థానిక నాయ‌కులు ప్ర‌స్తావించారు. అందుకే జిల్లా ఇంచార్జి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సుద‌ర్శ‌న్ రెడ్డికి సూచ‌న చేస్తున్నా. ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేసి అన్ని విజ్ఞ‌ప్తుల‌పై చ‌ర్చించి నివేదిక‌ను తీసుకువ‌స్తే అబివృద్ధికి కావాల్సిన అనుమ‌తుల‌ను, నిధుల‌ను రాబోయే బ‌డ్జెట్‌లో కేటాయిస్తాం. యూనివ‌ర్సిటీ, ఎయిర్‌పోర్టు, పారిశ్రామిక కారిడార్ ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతాయ‌ని సీఎం అన్నారు.

ప్ర‌ధానికి బంధువును కాదు..

తెలంగాణ అభివృద్ది కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని, ప్ర‌తి ప‌ది రోజుల‌కు ఒక‌సారి కేంద్ర మంత్రుల‌ను క‌లిసి.. నిధులు స‌మీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాను. ఇందుకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా స‌హ‌కారం అందించాలని కోరుతున్నా. అయితే కొంద‌రు ప్ర‌ధానిని క‌లిస్తే కూడా త‌ప్పుబ‌డుతున్నారు. ప్ర‌ధానికి నేను బంధువును కాదు.. చుట్ట‌రికం కూడా లేదు. ఈ దేశ ప్ర‌ధానిని క‌లిస్తేనే మ‌న‌కు ఎయిర్‌పోర్టులు వ‌స్తాయి.. ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు ల‌భిస్తాయి. తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద ప్రాణ‌హిత ప్రాజెక్టు క‌ట్టాలంటే మ‌హారాష్ట్ర నుంచి అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. అక్క‌డ బీజేపీ ప్ర‌భుత్వం ఉంది కాబ‌ట్టి.. మోదీని క‌లిసి అనుమ‌తి ఇప్పించాల‌ని కోర‌డంలో త‌ప్పులేదు. మోదీని, అమిత్ షాను క‌లిస్తేనే మ‌న ప్రాంతానికి మేలు జ‌రుగుతది. అభివృద్ధి కోసం, ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల కోసం ఎవ‌రినైనా క‌ల‌వ‌డానికి ఒక్క క్ష‌ణం ఆలోచించ‌ను. పైర‌వీల కోసం పోను. ప‌ర్స‌న‌ల్ ఎజెండా లేదు. చిన్న‌వ‌య‌సులోనే 4 కోట్ల తెలంగాణ ప్ర‌జ‌లు సీఎంగా అవ‌కాశం కల్పించారు. న్యాయం చేయాల్సిన బాధ్య‌త నా మీద ఉంది. ప్ర‌ధానిని అడిగినందుకే వ‌రంగ‌ల్‌కు ఎయిర్‌పోర్టు వ‌చ్చింది. ఆదిలాబాద్‌కు కూడా ప్ర‌ధానిని అడిగితేనే ఎయిర్‌పోర్టు ఇస్తార‌ని రేవంత్ పేర్కొన్నారు.

గ‌త పాల‌కుల అప్పే మ‌న‌కు ముప్పైంది..

పదేండ్ల పాలించిన గ‌త పాల‌కులు కేంద్రం నుంచి నిధులు తీసుకురాక‌పోవ‌డంతో రాష్ట్రానికి తీర‌ని అన్యాయం జ‌రిగింది. రాష్ట్రంపై 8 ల‌క్ష‌ల 11 వేల కోట్ల అప్పుల భారం ప‌డింది. ఆ అప్పే మ‌న‌కు ముప్పైంది. ఆనాడు పాల‌కులు చేసిన త‌ప్పులు, అప్పులు ఇవాళ ఉరితాడై తెలంగాణ రాష్ట్ర‌ ప్ర‌జ‌ల ఊపిరి తీసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ చిక్కుముడుల‌ను ప‌రిష్క‌రించుకుంటూ స‌మ‌స్య‌ల‌ను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇంద్ర‌వెల్లిని ప‌ర్యాట‌క కేంద్రంగా చేయ‌లేదా..? నాగోబా జాత‌ర‌కు నిధులు ఇవ్వ‌లేదా..? నాగోబాకు మ‌రో రూ. 22 కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. స‌మ్మ‌క సార‌ల‌మ్మ జాత‌ర‌ను రూ. 300 కోట్ల‌తో పున‌ర్ నిర్మించాం. ఈ జాత‌ర‌ను సౌత్ కుంభ‌మేళా మాదిరి తీర్చిదిద్దుతున్నాం. పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను 19న ప్రారంభించుకోబోతున్నాం. ఇదంతా అభివృద్ధి కాదా..? అని సీఎం ప్ర‌శ్నించారు.

ఆ ఇద్ద‌రు మారీచుడు, సుబాహుడు

ప్ర‌పంచంతో పోటీ పడే విధంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కూతవేటు దూరంలో 30 వేల ఎక‌రాల్లో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. నిజాం హైద‌రాబాద్‌ను విస్త‌రిస్తే.. ఇవాళ ప్ర‌పంచానికి పెట్టుబ‌డుల స్వ‌ర్గ‌ధామంగా మారింది హైద‌రాబాద్ న‌గ‌రం. మ‌ళ్లీ ఇప్పుడు ప్ర‌పంచంలోనే గొప్ప‌గా భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీని నిర్మిస్తుంటే ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్ అంటున్నారు. ఎన్నో ప‌ద‌వులు అనుభ‌వించి, ప‌దేండ్లు సీఎంగా ప‌ని చేసిన వ్య‌క్తి మాట్లాడే మాట‌లేనా ఇవి. చేత‌నైతే ఆశీర్వ‌దించు.. సూచ‌న‌లు చేయ్‌.. ఇష్టం లేక‌పోతే మౌనంగా ఉండు. ఇక పురాణాల్లో చూశాం. శుక్రచార్యుడి శిష్యులు మారీచుడు, సుబాహుడు అని రాక్ష‌సులు ఉండేటోళ్లు. దేవ‌త‌లు య‌జ్ఞాలు, యాగాలు చేస్తే శుక్ర‌చార్యుడి సూచ‌న‌తో మారీచుడు, సుబాహుడు వ‌చ్చి ఆ యాగాల‌ను, యజ్ఞాల‌ను భ‌గ్నం చేసేటోళ్లు. చివ‌ర‌కు రాముడి చేతిలో చ‌నిపోయారు. ఇవాళ శుక్రాచార్యుడు ఫామ్ హౌజ్‌లో ఉండు.. ఓ మారీచుడు, సుబాహుడు అసెంబ్లీకి వ‌చ్చి అడ్డం ప‌డుతున్న‌రు బావ‌బామ్మ‌ర్దుల ముసుగులో. చివ‌ర‌కు రాజ‌కీయ స‌మాధే అవుతుంది త‌ప్ప మీకు వ‌చ్చేది ఏంది లేదు. ఇక‌ ఓడిపోయినోళ్ల గురించి, ప‌డిపోయినోళ్ల గురించి మాట్లాడ‌ద‌లుచుకోలేదు అని సీఎం రేవంత్ అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement