Hairsh Rao | కరెంట్ కోతలు.. బిల్లులతో వాతలు
Hairsh Rao | ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంట్ బిల్లులతో వాతలు.. దసరా, దీపావళి వేళ ప్రజలకు శుభవార్త చెప్పాల్సిన ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచి నెత్తిన పిడుగు వేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. ట్రూ-అప్ చార్జీల పేరుతో ఏకంగా రూ.5,420 కోట్ల భారాన్ని వినియోగదారులపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు.
- రూ.5,420 కోట్ల ట్రూ-అప్ భారం ప్రజలపై ఎందుకు?
- విద్యుత్ రంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి.. భారం వినియోగదారులపై వేస్తారా?
- ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ కరువు
- నీళ్లున్నా ఎత్తడం లేదు.. బొగ్గున్నా కరెంట్ ఉత్పత్తి చేయడం లేదు
- ఛార్జీల పెంపు వెనక్కి తీసుకోకుంటే ప్రజా ఉద్యమం తప్పదు
- శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
Hairsh Rao | ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంట్ బిల్లులతో వాతలు.. దసరా, దీపావళి వేళ ప్రజలకు శుభవార్త చెప్పాల్సిన ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచి నెత్తిన పిడుగు వేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. ట్రూ-అప్ చార్జీల పేరుతో ఏకంగా రూ.5,420 కోట్ల భారాన్ని వినియోగదారులపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రూ.5,420 కోట్ల విద్యుత్ బిల్లులను వినియోగదారులపై మోపే హక్కు రేవంత్‌రెడ్డికి ఎవరు ఇచ్చారు? విద్యుత్ కొనుగోళ్లకు వెచ్చించిన సొమ్మును వినియోగదారుల నుంచే వసూలు చేయడం ఎంతవరకు సమంజసం? బాధ్యత నుంచి తప్పించుకుని ప్రజలపై భారం వేయడం సిగ్గుచేటు’ అని హరీశ్‌రావు విమర్శించారు. రెండు నెలల్లోనే ఈ భారాన్ని వసూలు చేయడం దుర్మార్గమన్నారు. ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకుని రూ.5,420 కోట్లను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ కరువు
ఒకవైపు ఎల్‌నినో, మరోవైపు ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం మాత్రం తన వైఫల్యాలకు ఎల్‌నినోను సాకుగా చూపుతోందని విమర్శించారు. ‘ఎల్‌నినో కరువు కాదు.. కాంగ్రెస్ కరువు. అవకాశం ఉండి నీళ్లు ఇవ్వడం లేదు.. అవకాశం ఉండి కరెంట్ ఉత్పత్తి చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. దేవాదులలో 24 గంటలు మోటార్లు నడపాలని కోరినా 8 గంటలే నడుపుతున్నారని, దీంతో వరంగల్ జిల్లాకు కరువు వచ్చిందని ఆరోపించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తయినా మోటార్లు 8 గంటలే నడుపుతున్నారని అన్నారు. నదుల్లో నీళ్లున్నా రిజర్వాయర్లు నింపడం లేదని, నీళ్లు లిఫ్ట్ చేయడం లేదని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో 24 గంటలు..
కేసీఆర్ హయాంలో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని బలోపేతం చేశామని హరీశ్‌రావు తెలిపారు. విద్యుత్ రంగంలో రూ.91 వేల కోట్లతో జెన్‌కో, ట్రాన్స్‌కో సహా మౌలిక వసతులను అభివృద్ధి చేశామని చెప్పారు. 400 కేవీ సబ్‌స్టేషన్లను 6 నుంచి 30కి, 220 కేవీ సబ్‌స్టేషన్లను 51 నుంచి 103కు, 132 కేవీ సబ్‌స్టేషన్లను 176 నుంచి 251కి పెంచామని వివరించారు. ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్లు 233 నుంచి 384కి, ఈహెచ్‌టీ లైన్ల సర్క్యూట్ 16,378 కిలోమీటర్ల నుంచి 28,131 కిలోమీటర్లకు, ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం 14,973 ఎంవీఏ నుంచి 38,941 ఎంవీఏకు పెంచామని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,450 మెగావాట్లకు పెంచామని తెలిపారు. కొత్తగూడెంలో 800 మెగావాట్లు, భద్రాద్రిలో 1,080 మెగావాట్లు, భూపాలపల్లిలో 600 మెగావాట్లు, 4,000 మెగావాట్ల అల్ట్రా థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేశామని చెప్పారు. థర్మల్ విద్యుత్‌లో 6,480 మెగావాట్లు, సోలార్‌లో 3,600 మెగావాట్లు అదనంగా అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ‘ఇప్పుడు కొత్తగా ఒక్క సబ్‌స్టేషన్ కట్టలేదు.. ఒక్క మెగావాట్ ఉత్పత్తి సామర్థ్యం పెంచలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ వస్తే.. ఇప్పుడు 6 గంటలు కూడా రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? కరెంట్ ఉంటే వార్త అయ్యింది’ అని హరీశ్‌రావు విమర్శించారు.
బొగ్గున్నా.. ఉత్పత్తి చేయడం లేదు
రాష్ట్ర థర్మల్ విద్యుత్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ 13,384 మెగావాట్లు ఉంటే 8 వేల మెగావాట్లు కూడా ఉత్పత్తి చేయడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. 40–45 శాతం గ్యాప్ ఎందుకు ఉందని ప్రశ్నించారు. భద్రాద్రి థర్మల్‌లో మూడో యూనిట్ ఎందుకు నిలిచిపోయిందని, 4 వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న యాదాద్రిలో 400 మెగావాట్లు కూడా ఎందుకు ఉత్పత్తి కావడం లేదని నిలదీశారు. సింగరేణి సంస్థ ఉండి కూడా థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు మాయమయ్యాయని గతంలోనే తాము ఆరోపించామని తెలిపారు. నైనీలో బొగ్గు అందుబాటులో ఉన్నా విదేశాల నుంచి అధిక ధరకు బొగ్గు దిగుమతి చేసుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించకుండా బయట నుంచి యూనిట్‌కు రూ.10–12 చొప్పున విద్యుత్ కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై వేస్తున్నారని ఆరోపించారు.
ట్రాన్స్‌కోను ప్రైవేటుపరం చేసే కుట్ర..
వేల కోట్ల విలువైన ఆస్తులున్న రాష్ట్ర విద్యుత్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్‌ను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. టీజీ-ట్రాన్స్‌కో, టీజీ-జెన్‌కో, సింగరేణి, డిస్కంలను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్‌కోలో 26 శాతం వాటాల విక్రయానికి నిర్ణయించారని పేర్కొన్నారు. ‘రాహుల్‌గాంధీ పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరించొద్దని చెబుతారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోంది. రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో జరుగుతున్న ప్రైవేటీకరణను అడ్డుకోవాలి’ అని కోరారు. కరెంట్ కోతలు, లోఓల్టేజ్‌తో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని హరీశ్‌రావు అన్నారు. రైతులు సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారని, పొలాల వద్ద కరెంట్ కోసం వేచి చూస్తూ పాము కాట్లకు గురై రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘చేతికి వచ్చే పంటను కాపాడుకుందామంటే కరెంట్ లేదు.. నీళ్లు లేవు. ఉమ్మడి పాలనలో చూసిన క్రాప్ హాలిడే, పవర్ హాలిడేలను మళ్లీ తీసుకొస్తున్నారు. ఆనాటి రోజులు తెస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. నిజంగానే ఆనాటి కరెంట్ కోతల రోజులు తెచ్చారు’ అని విమర్శించారు.
నాడు చంద్రబాబు నాడు.. నేడు రేవంత్
‘సరిగ్గా 16 ఏళ్ల క్రితం చంద్రబాబు అడ్డగోలుగా విద్యుత్ చార్జీలు పెంచినందుకు బషీర్‌బాగ్ కాల్పుల దాకా పరిస్థితి వెళ్లింది. నేడు విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపి ఏం చేయదల్చుకున్నారు?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆనాడు విద్యుత్ బిల్లులపై పోరాడిన కమ్యూనిస్టులు ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘బొగ్గు నిల్వలు చేసుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్.. రిజర్వాయర్లు నింపడంలో ఫెయిల్.. థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పత్తిలో ఫెయిల్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. విద్యుత్ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు కరెంట్ కోతలు నిదర్శనమైతే.. బిల్లుల భారం ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనమని హరీశ్‌రావు అన్నారు. ట్రూ-అప్ పేరుతో ప్రజలపై మోపే రూ.5,420 కోట్ల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే మరో ప్రజా పోరాటానికి బీఆర్‌ఎస్ సిద్ధమవుతుందని హెచ్చరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలిస్తాం
- ●Sonakshi Sinha | భార్య హీరోయిన్ - భర్త విలన్ - పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ
- ●Priyank Kharge | నిబంధనల ప్రకారం జరిగుంటే.. ఆ 16 లక్షల మంది ఓటర్ల వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారు..?
- ●Ramchandar Rao | చిన్నారుల సంరక్షణలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకం
- ●MP Chamala | జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
- ●HMWSSB | బోరు నీరు.. నల్లా నీరు ఒక్కటి కాదు!

Ponguleti Srinivas Reddy | ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలిస్తాం

Sonakshi Sinha | భార్య హీరోయిన్ - భర్త విలన్ - పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ

Priyank Kharge | నిబంధనల ప్రకారం జరిగుంటే.. ఆ 16 లక్షల మంది ఓటర్ల వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారు..?

Ramchandar Rao | చిన్నారుల సంరక్షణలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకం




