త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి.. హ‌రీశ్‌రావు డిమాండ్‌

Harish Rao | తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 25 ఏళ్లుగా సేవలందిస్తున్న సుమారు 1,200 మంది కాంట్రాక్ట్ అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల ప్రతినిధులు తమ సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని హరీశ్ రావుకు అందజేశారు.

P

Telangana | Published On Sep 6, 2026, 6.03 pm IST

Harish Rao | యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి.. హ‌రీశ్‌రావు డిమాండ్‌
Advertisement

Harish Rao | తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 25 ఏళ్లుగా సేవలందిస్తున్న సుమారు 1,200 మంది కాంట్రాక్ట్ అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల ప్రతినిధులు తమ సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని హరీశ్ రావుకు అందజేశారు. వారి సమస్యలను సానుకూలంగా పరిశీలించిన ఆయన.. దీర్ఘకాలంగా బోధన, పరిశోధన సేవలు అందిస్తున్న అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో 2,878 బడ్జెట్ మంజూరైన పోస్టులు ఉండగా.. కేవలం 753 పోస్టుల్లోనే రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారని, మరో 2,125 మంజూరైన పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధ్యాపక సంఘం తన వినతిపత్రంలో పేర్కొందని హరీశ్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో అర్హతలు, అనుభవం ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులను నిబంధనలకు అనుగుణంగా ఖాళీ పోస్టుల్లో క్రమబద్ధీకరించే అంశాన్ని ప్రభుత్వం వెంటనే పరిశీలించాలని కోరారు.

యూజీసీ స్కేల్ అమ‌లు చేయాలి..

రెగ్యులర్ అధ్యాపకులకు 7వ వేతన సవరణ సంఘం యూజీసీ వేతన స్కేల్ అమలవుతున్నప్పటికీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు వాటిని వర్తింపజేయకపోవడంతో వేతనాల్లో తీవ్ర వ్యత్యాసం ఏర్పడిందన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు 7వ యూజీసీ వేతన సవరణ సంఘం ప్రకారం కనీస మూల వేతనం రూ.57,700తో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, 3 శాతం వార్షిక వేతన పెంపు, అర్హులైన వారికి పీహెచ్‌డీ ప్రోత్సాహకం తదితర ప్రయోజనాలను అమలు చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు. “ఒకే విశ్వవిద్యాలయంలో ఒకే తరహా బోధనా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధ్యాపకుల మధ్య వేతనాలు, కనీస ఉద్యోగ భద్రత విషయంలో భారీ అంతరం ఉండటం సమంజసం కాదు. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల అనుభవాన్ని, అర్హతలను ప్రభుత్వం గౌరవించాలి. వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మానవీయ దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలి” అని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు 12 నెలల నిరంతర వేతనం, సేవల క్రమబద్ధీకరణ, సాధారణ సెలవులు, వైద్య సెలవులు, ప్రసూతి సెలవులు, ఆరోగ్య కార్డులు, ఈపీఎఫ్‌ తదితర చట్టబద్ధమైన, సంక్షేమ ప్రయోజనాలను కల్పించాలన్న డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిశీలించాలన్నారు. స్వీయ ఆర్థిక కోర్సుల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

స‌ముచిత ప్ర‌యోజ‌నం క‌ల్పించాల‌ని సూచ‌న‌..

కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే కాంట్రాక్ట్ అధ్యాపకులకు పదవీ విరమణ ప్రయోజనాలు అందిస్తున్న నేపథ్యంలో.. దీర్ఘకాలంగా సేవలందించిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు సముచిత పదవీ విరమణ ప్రయోజనం కల్పించాలన్న డిమాండ్‌ను పరిశీలించాలని హరీశ్ రావు కోరారు. అలాగే సేవలో ఉన్న సమయంలో అధ్యాపకుడు మరణిస్తే వారి కుటుంబానికి తగిన పరిహారం అందించే విధానం రూపొందించాలని సూచించారు. “విశ్వవిద్యాలయాల నాణ్యతకు అధ్యాపకులే పునాది. రెండు, మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను అనిశ్చితిలో ఉంచడం ఉన్నత విద్యా వ్యవస్థకు మంచిది కాదు. ప్రభుత్వం ఉన్నత విద్య, ఆర్థిక శాఖలు మరియు విశ్వవిద్యాలయాలతో వెంటనే సమావేశం నిర్వహించి, కాలపరిమితితో కూడిన పరిష్కారాన్ని ప్రకటించాలి” అని హరీశ్ రావు గారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం వారి తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, అవసరమైన వేదికలపై వారి సమస్యలను ప్రస్తావిస్తామని హరీశ్ రావు కాంట్రాక్ట్ అధ్యాప‌కుల‌కు హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement