త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది.. ప్రచారం కాంగ్రెస్‌ది: హ‌రీశ్ రావు

Harish Rao | ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది (KCR) అయితే ప్రచారం కాంగ్రెస్‌ది అన్నట్లు ఉంద‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) నియామక పత్రాలు ఇచ్చినట్టే.. తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి (KCR) ప్రారంభించిన టిమ్స్ (TIMS) హాస్పిట‌ళ్ల‌ ప్రారంభోత్సవాల పేరుతో ప్రచారం చేసుకుంటున్న‌దని మండిప‌డ్డారు.

G

Telangana | Published On Aug 17, 2026, 12.10 pm IST

Harish Rao | ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది.. ప్రచారం కాంగ్రెస్‌ది: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది (KCR) అయితే ప్రచారం కాంగ్రెస్‌ది అన్నట్లు ఉంద‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) నియామక పత్రాలు ఇచ్చినట్టే.. తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి (KCR) ప్రారంభించిన టిమ్స్ (TIMS) హాస్పిట‌ళ్ల‌ ప్రారంభోత్సవాల పేరుతో ప్రచారం చేసుకుంటున్న‌దని మండిప‌డ్డారు. డేట్లు, డెడ్‌లైన్లు మార్చుకుంటూ పోయి, చివరకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్న ఆసుపత్రిలో కూడా పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాకపోవడం శోచ‌నీయమ‌న్నారు. వెయ్యి కోట్లతో నిర్మించిన ద‌వాఖాన‌ను కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం సిగ్గుచేట‌ని ధ్వ‌జ‌మెత్తారు. రేవంత్ రెడ్డి.. పేరు మార్చినంత సులువుగా హాస్పిటళ్లు కట్టిన చరిత్ర మార్చలేవని విమ‌ర్శించారు.

వందేండ్ల‌ ముందు చూపుతో..

`హైదరాబాద్‌కు మూడు వైపులా మూడు టిమ్స్‌ ఆసుపత్రులు (అల్వాల్, సనత్‌నగర్, ఎల్బీనగర్) ఏర్పాటు చేసి, పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్నది కేసీఆర్ ఆలోచన. కరోనా తర్వాత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వందేండ్ల‌ ముందు చూపుతో కేసీఆర్ TIMSలకు రూపకల్పన చేశారు. 2022 ఏప్రిల్ 26న ఒకేరోజు మూడు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసి చరిత్ర సృష్టించారు. ప్రణాళిక కేసీఆర్‌ది.. శంకుస్థాపన కేసీఆర్‌ది.. నిధులు విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వమే.

సదుపాయాలు కల్పించకుండానే..

ఒక్కో ఆసుపత్రి వెయ్యి పడకల సామర్థ్యంతో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) పేరుతో నిర్మించే మూడింటి నిర్మాణానికి రూ.2,679 కోట్లు మంజూరు చేసింది. బీఆర్ఎస్ హయాంలో శరవేగంగా సాగిన పనులు కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత నత్తనడకన సాగాయి. సకాలంలో పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. తేదీలు మారాయి తప్ప టిమ్స్‌ ఆసుపత్రుల నిర్మాణాలు ముందుకు సాగలేదు. ప్రజలకు అందుబాటులోకి తీసుకు రాలేదు. మూడున్నరేళ్ల సుదీర్ఘ కాలంలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించకుండా, కేవలం ప్రచారం కోసం నేడు టిమ్స్‌ సనత్‌నగర్‌ను (Sanathnagar TIMS) ప్రారంభిస్తున్నారు. కనీసం ఆసుపత్రికి నీటి సరఫరా కూడా కల్పించలేదు. అంటే పేదల వైద్యం పట్ల వీరికి ఉన్న శ్రద్ధ ఏమిటో అర్థం అవుతుంది.

సకాలంలో పూర్తయి ఉంటే..

పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని కేసీఆర్ ఆలోచిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదల నుంచి ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రచారంపై ఉన్న శ్రద్ధ, పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడంపై ఎందుకు లేదు రేవంత్ రెడ్డి?. ఈ ఆసుపత్రులు సకాలంలో పూర్తయి ఉంటే ఇప్పటికే వేలాది మంది పేదలు అత్యున్నత వైద్య సేవలు పొందేవారు. ఎంతో మంది ప్రాణాలు నిలిచేవి. ఇన్నేళ్లుగా ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయకుండా, ప్రజలకు వైద్యం అందకుండా చేసిన జాప్యానికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మూడు TIMS సహా వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ 2000 పడకల కొత్త బ్లాక్ పూర్తయితే కేసీఆర్‌కి పేరు వస్తుందనే రాజకీయ కక్షతోనే పనులను ఆలస్యం చేయడం నేరపూరిత నిర్లక్ష్యం. ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రులు.. ఇంకా నిర్మాణ దశలోనే ఉండడానికి ఈ ప్రభుత్వ వైఫల్యమే కారణం.

ఇప్పటికైనా కండ్లు తెరవండి..

బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు TIMS, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను సందర్శించి, నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీసింది. అయినా ఎలాంటి మార్పు లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. హడావుడిగా సమీక్షలు నిర్వహించి ప్రారంభ తేదీలు ప్రకటించిన మంత్రులు.. ఆసుపత్రుల్లో వైద్య, ఇతర సదుపాయాల కల్పనపై దృష్టి సారించలేదు. పనులు పూర్తి చేయలేదు. ఇప్పటికైనా కండ్లు తెరవండి. కేసీఆర్ ఎంతో ముందుచూపుతో మొదలు పెట్టిన TIMS, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి.

ఆదాయ వనరులుగా మార్చుకోవద్దు

కేసీఆర్ ఉచితంగా పేదలకు అత్యున్నత వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆసుపత్రులను ఆదాయ వనరులుగా మార్చుకోవద్దని హెచ్చరిస్తున్నాం. ప్రచార యావపై శ్రద్ధ తగ్గించి, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన TIMS, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ, 2000 పడకల నిమ్స్ కొత్త ఆసుపత్రుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. పేదల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలి` అని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement