త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MCR TIMS | బిగ్ డే.. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక మైలురాయి: మంత్రి దామోద‌ర‌

MCR TIMS | అత్యాధునిక సౌక‌ర్యాల‌తో నిర్మించిన స‌నత్‌న‌గ‌ర్ టిమ్స్ (MCR TIMS) ద‌వాఖాన‌ను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోమ‌వారం సాయంత్రం ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ (Damodara Rajanarsimha) దీనిని తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక మైలురాయిగా అభివ‌ర్ణించారు.

G

Telangana | Published On Aug 17, 2026, 9.12 am IST

MCR TIMS | బిగ్ డే.. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక మైలురాయి: మంత్రి దామోద‌ర‌
Advertisement

MCR TIMS | త్రినేత్ర‌.న్యూస్‌: అత్యాధునిక సౌక‌ర్యాల‌తో నిర్మించిన స‌నత్‌న‌గ‌ర్ టిమ్స్ (MCR TIMS) ద‌వాఖాన‌ను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోమ‌వారం సాయంత్రం ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ (Damodara Rajanarsimha) దీనిని తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక మైలురాయిగా అభివ‌ర్ణించారు. ఇది బిగ్ డే అంటూ ఎక్స్ వేదిక‌గా ట్వీట్ చేశారు.

సోమ‌వారం సాయంత్రం 4.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి డాక్ట‌ర్‌ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (MCR TIMS)ను ప్రారంభించనున్నార‌ని వెల్ల‌డించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజారోగ్య మౌలిక వసతుల్లో మరో కీలక అధ్యాయంగా పేర్కొన్నారు. అధునాతన, అందుబాటు ధరల్లో సమగ్ర సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే ప్రతిష్ఠాత్మక సంస్థగా డాక్ట‌ర్‌ MCR TIMS నిలవనుంద‌ని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం ఓ చారిత్రాత్మక వైద్య సంస్థ అందుబాటులోకి రానుందని, అది అధునాతన సూపర్‌ స్పెషాలిటీ వైద్యానికి కొత్త గమ్యస్థాన‌మ‌ని వెల్ల‌డించారు.

స‌మీకృత ద‌వాఖాన‌

22.6 ఎకరాల విస్తీర్ణంలో, 11.70 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో 1,082 పడకలు.. అందులో 300 ఐసీయూ బెడ్స్‌, 31 మేజర్ ఆపరేషన్ థియేటర్ల‌తో సమగ్ర వైద్య సముదాయాన్ని అభివృద్ధి చేశారు. క్లాసిక్ ఆర్కిటెక్చర్‌తో నాలుగు బ్లాకులుగా నిర్మించిన టిమ్స్ 75 శాతం నీటి పొదుపుతో ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ సాధించింది. ఆరు కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ ఆసుపత్రిలో రోగులకు సమగ్ర వైద్య సేవలు అందనున్నాయి. ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో నిర్మితమైన టిమ్స్ లో ఏర్పాటు చేయటం విశేషం. ఈ వ్యవస్థ ద్వారా రోగుల నుంచి పరీక్షలు చేసేందుకు సేకరించిన నమూనాలు ఒకటి నుంచి రెండు నిమిషాల్లోనే సంబంధిత పరీక్షా కేంద్రాలకు చేరతాయి.

నాలుగు బ్లాకులు..

ఆస్పత్రిని నాలుగు ప్రధాన బ్లాకులుగా ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఇందులో ఉన్నాయి. డయాగ్నస్టిక్స్ విభాగంలో 17 పాథాలజీ ల్యాబ్‌లు, 12 మైక్రోబయాలజీ ల్యాబ్‌లు, 10 బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లు, 5 ప్రత్యేక ల్యాబ్‌లు ఉన్నాయి.

బ్లాక్-ఏలో అత్యవసర సేవలు, 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగం ఉన్నాయి.
బ్లాక్-బీలో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగం, రెండు క్యాథ్‌ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.
బ్లాక్-సీలో రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, సాధారణ, ప్రైవేట్ వార్డులు, వీఐపీ సూట్లు ఉన్నాయి.
బ్లాక్-డీలో పరిపాలన, విద్యా విభాగాలతో పాటు 200 మంది కూర్చునే ఆడిటోరియం ఉంది.

ఏఐ ఆధారిత పైప్ వ్యవస్థ..

టిమ్స్ సనత్‌నగర్‌లో అత్యంత ప్రత్యేకమైన సాంకేతిక సదుపాయాల్లో ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థ ఒకటి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దేశంలోనే తొలిసారిగా ఈ తరహా వ్యవస్థను టిమ్స్ సనత్ నగర్ లో ఏర్పాటు చేశారు. సీల్డ్ ట్యూబ్‌లు, గాలి ఒత్తిడితో రక్త నమూనాలు, మందులు, వైద్య నివేదికలు, అత్యవసర వినియోగ వస్తువులను వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్‌లు, ఫార్మసీ, బ్లడ్ బ్యాంక్‌ల మధ్య కేవలం 1-2 నిమిషాల్లో ఈ విధానం ద్వారా తరలించవచ్చు. దీంతో పరీక్షల ఫలితాల కోసం పట్టే సమయం తగ్గడంతో పాటు కలుషితమయ్యే ప్రమాదం కూడా తగ్గుతుంది.

4 విభాగాలకు అత్యంత ప్రాధాన్యత

సూపర్ స్పెషాలిటీ సేవలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సనత్​నగర్ టిమ్స్‌లో ముఖ్యంగా 4 విభాగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్డియక్ సైన్సెస్, ట్రామా కేర్, రీనల్ సైన్సెస్, ట్రాన్స్​ప్లాంటేషన్ చికిత్సలకు ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఏర్పాటు చేశారు. మొత్తం 1000 పడకలతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 300 పడకలు ప్రత్యేకంగా ఎమర్జెన్సీ సేవలకు కేటాయించగా, 100 పడకలు ఈహెచ్​ఎస్​ కోసం, 30 పడకలను డయాలసిస్ సేవల కోసం, వీఐపీ, విదేశీ రోగుల కోసం మరికొన్ని పడకలను ప్రత్యేకంగా కేటాయించారు.

Advertisement
Advertisement