త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా?.. రియల్ ఎస్టేట్ కంపెనీనా?: హ‌రీశ్ రావు

Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌ రావు (Harish Rao) ధ్వజమెత్తారు. హైద‌రాబాద్‌ రాజేంద్రనగర్‌లోని మానసహిల్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన‌ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలను పిండి చేస్తున్నద‌ని విమ‌ర్శించారు.

G

Telangana | Published On Mar 3, 2026, 10.43 am IST

Harish Rao | రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా?.. రియల్ ఎస్టేట్ కంపెనీనా?: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌ రావు (Harish Rao) ధ్వజమెత్తారు. హైద‌రాబాద్‌ రాజేంద్రనగర్‌లోని మానసహిల్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన‌ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలను పిండి చేస్తున్నద‌ని విమ‌ర్శించారు. ​సీఎం రేవంత్ అల్లుడి అనుయాయులకు ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల ప్రభుత్వ భూమి కట్టబెట్టార‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. పేదల ఇండ్ల‌ను కూల్చే హైడ్రాకు.. మంత్రులు, వాళ్ల బంధువులు చేస్తున్న అక్రమ క్వారీలు, భూకబ్జాలు ఎందుకు కనిపించడం లేద‌ని ప్ర‌శ్నించారు. వెంటనే అక్రమ మైనింగ్ నిలిపివేసి, దోచుకున్న సంపదను పెనాల్టీతో సహా రికవరీ చేయడంతో పాటు అడ్డగోలు భూ కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

`ఓఆర్‌ఆర్‌కు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలంలోని మానసహిల్స్ ప్రాంతంలో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వారీలు నిర్వహిస్తూ కొండలను పిండి చేసి కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్న‌ట్లు?.

https://maps.google.com/?q=17.300150,78.384659

నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యు, మైనింగ్, పీసీబీ, హెచ్ఎండీఏ (hmda) అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడటం లేదు?.

రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లను తొలుస్తూ, అక్రమంగా తరలిస్తూ యదేచ్చగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు?. సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం?. మంత్రికి ఒక న్యాయమా?.
ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం?. మంత్రి కుటుంబం చేస్తే ఆ అక్రమం సక్రమం అవుతుందా?. నెలల తరబడి కొండలను పిండి చేసి, భారీగా కాంక్రీటు తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి?.

విద్యుత్ శాఖ‌ మంత్రి భట్టి విక్రమార్క, పర్యావరణ మంత్రి కొండా సురేఖ, గనుల శాఖ మంత్రి వివేక్ సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నట్లు?. ఆయా శాఖల్లోని విజిలెన్స్ విభాగాలు పని చేయడం లేదా?. లేక సహచర మంత్రి చీకటి వ్యాపారానికి ఉద్దేశ‌పూర్వకంగానే సహకరిస్తున్నాయా?. ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయి?. అధికారుల నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఎందరి చేతులు తడుస్తున్నాయి?. క్వారీకి ఎలాంటి అనుమతులు లేకున్నా మంత్రి కుటుంబం అయితే సరిపోతుందా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

  • టీఎస్‌పీసీబీ నుంచి Consent for Establishment (CFE) & Consent for Operation (CFO) అనుమతి లేదు.
  • పర్యావరణ అనుమతి లేదు.
  • మైనింగ్/క్వారీయింగ్ లీజ్ అనుమతి- మైన్స్ అండ్‌ జియాలజీ విభాగం అనుమతి లేదు.
  • స్థానిక గ్రామపంచాయతీ/మున్సిపల్ అనుమతి- ల్యాండ్ యూజ్ మార్పిడి, HMDA క్లియరెన్స్ లేదు
  • విస్ఫోటక పదార్థాల వినియోగం కోసం ఎక్స్‌ప్లోసివ్స్ లైసెన్స్ లేదు.
  • గ్రౌండ్ వాటర్ వినియోగానికి సంబంధిత అనుమతులు లేవు.
  • రెవెన్యూ అనుమతులు లేవు.

ఏ అనుమతి లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలను మాయం చేస్తూ భారీ స్థాయిలో రాళ్లు, కాంక్రీటు తరలించడం చట్టవిరుద్ధం అనే విషయం తెలియదా? అని నిల‌దీశారు.

ఒక వైపు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతడు. మరోవైపు అదే ముఖ్యమంత్రి తన అల్లుడి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెడతడు.

https://maps.app.goo.gl/PEFbEAiWSDtdhg4fA?g_st=ic

ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నదని, ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని మేం డిమాండ్ చేస్తే మూడు రోజులు అయినా తేలు కుట్టిన దొంగల్లా ఉలుకరు పలకరు. ఇంకోవైపు మంత్రి పొంగులేటి అక్రమ క్వారీతో ఏకంగా కొండలనే ఖతం చేస్తడు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? లేక రియల్ ఎస్టేట్ కంపెనీనా?. ప్రభుత్వ భూములు రక్షించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులే భూ బకాసురులుగా మారి భూములను భక్షిస్తుంటే ఇక రక్షించే వారెవరు?. 'తెలంగాణ అంటే బిజినెస్' అని చిల్లర నిర్వచనాలు చెప్పే రేవంత్ రెడ్డి అండ్ కో.. మీ ధ‌న‌ దాహం తీర్చుకోవడం కోసం తెలంగాణను గంపగుత్తగా అమ్ముకుంటారా?

ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చిండు. ఇప్పుడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో ఉన్న కొండలను స్వయంగా మీ మంత్రి, మీ అల్లుడు మాయం చేస్తుంటే ఎందుకు సహకరిస్తున్నారు?. హైడ్రా అంటే Hyderabad Disaster Response and Asset Protection Agency అని గొప్పలు చెప్పడమే తప్ప ప్రభుత్వ ఆస్తిని మంత్రి కంపెనీ అప్పనంగా తన్నుకు పోతుంటే ఎందుకు ప్రొటెక్ట్ చేయడం లేదు?. శని, ఆదివారాలు వచ్చిందంటే చాలు పేదల ఇండ్ల‌ మీదకు వెళ్లే హైడ్రా బుల్డోజర్‌కు ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ అక్రమ క్వారీ కనిపించడం లేదా?. సాధారణ ప్రజలకు ఒక న్యాయం?.. ముఖ్యమంత్రి అల్లుడి అనుయాయులు, మంత్రులకు ఒక న్యాయమా?.` అని హ‌రీశ్ రావు ప్ర‌శ్నించారు.

ఈ మైనింగ్ దందాలలో మీకు ఎలాంటి వాటా లేకపోతే, వెంటనే మీ సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ క్వారీని వెంటనే మూసివేయించాలని, ఇప్పటి వరకు కొల్లగొట్టిన సహజ సంపద మొత్తాన్ని పెనాల్టీతో సహా రికవరీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ముఖ్యమంత్రి తన అల్లుడి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా కట్టబెట్టిన 17 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపును వెంటనే రద్దు చేసి, పారదర్శకంగా ఓపెన్ బిడ్డింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అల్లుడు అనుయాయులు, మంత్రి పొంగులేటి సంస్థ నిర్వహిస్తున్న అక్రమ క్వారీకి సంబంధించిన ఫోటోలు, పూర్తి వివరాలను మీడియాకు విడుదల చేశారు. అయినప్పటికీ మీకు ఈ గలీజు మైనింగ్ దందా కనిపించకపోతే చెప్పండి, స్వయంగా తానే వచ్చి చూపిస్తాన‌ని, అక్కడే నిజానిజాలు నిగ్గుతెల్చుదామ‌ని హ‌రీశ్ రావు అన్నారు.

https://x.com/BRSHarish/status/2028664320297722141

Advertisement
Advertisement