త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Sathaiah Awards | తెలంగాణ కృషీవ‌లుర‌కు ఘ‌న గౌర‌వం.. ముగ్గురికి పొన్నం స‌త్త‌య్య పుర‌స్కారాలు

Ponnam Sathaiah Awards | తెలంగాణలో వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న ముగ్గురికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. కోదండరెడ్డి, కొండలరావు, కనకవ్వలు పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలకు ఎంపిక‌య్యారు.

S

Telangana | Published On Sep 6, 2026, 2.24 pm IST

Ponnam Sathaiah Awards | తెలంగాణ కృషీవ‌లుర‌కు ఘ‌న గౌర‌వం.. ముగ్గురికి పొన్నం స‌త్త‌య్య పుర‌స్కారాలు
Advertisement
  • వ్యవసాయం, సాహిత్యం, కళారంగాల్లో కోదండరెడ్డి, కొండలరావు, కనకవ్వ విశేష సేవలు
  • తొలిసారి వ్య‌వ‌సాయ రంగానికి అవార్డు
  • ప్ర‌క‌టించిన‌ పొన్నం సత్తయ్య ఛారిటబుల్ ట్రస్టు

Ponnam Sathaiah Awards | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణలో వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న ముగ్గురికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. కోదండరెడ్డి, కొండలరావు, కనకవ్వలు పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలకు ఎంపిక‌య్యారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య స్మారకార్థం పొన్నం సత్తయ్య ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా అందిస్తున్న ఈ పురస్కారాలను ఈనెల 13న వారికి అంద‌జేయ‌నున్నారు. రూ.50 వేల నగదు పురస్కారంతో పాటు మెమెంటో, ప్రశంసాపత్రం బ‌హూక‌రించ‌నున్న‌ట్లు ట్ర‌స్టు ఉపాధ్య‌క్షులు పొన్నం అశోక్ గౌడ్ ఆదివారం తెలిపారు.


వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, సాహిత్య రంగంలో వెలిచాల కొండలరావు, కళారంగంలో విశేష సేవలందిస్తున్న గొట్టే కనకవ్వలను ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాలకు ఎంపిక చేశాం. అవార్డుల జ్యూరీ కమిటీ కన్వీనర్ డా. పొన్నం రవిచంద్ర సారథ్యంలో కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, ప్రముఖ పాత్రికేయులు దిలీప్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డైరెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, బి.సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రచయిత్రి అయినంపుడి శ్రీలక్ష్మి సభ్యులుగా ఉన్న జ్యూరీ కమిటీ అవార్డులకు ఎంపిక చేసిన జాబితాను ఆదివారం ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ పొన్నం ప్రభాకర్‌కు అందజేసింది.

గత నాలుగు సంవత్సరాలుగా సాహిత్య రంగంలో నాలేశ్వరం శంకరం, నలిమెల భాస్కర్, చంద్రబోస్, అంపశయ్య నవీన్లకు, కళారంగంలో ఒగ్గు ధర్మయ్య, కామ్రేడ్ విమలక్క, బలగం కొమురమ్మ, అంతడుపుల రమాదేవిలకు పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలను అందజేశారు. ఈ ఏడాది నుంచి వ్యవసాయ రంగాన్ని కూడా పురస్కారాల పరిధిలోకి తీసుకువచ్చి తొలిసారిగా వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి అవార్డును అందజేస్తున్నారు.

పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 13న రవీంద్రభారతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు. పొన్నం సత్తయ్య ఆశయాలను కొనసాగిస్తూ సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి గౌరవించడమే ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశ‌మ‌ని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement