త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

V Srinivas Goud | కాంగ్రెస్ నేతల మోసాలకు వేరే దేశాల్లో అయితే ఉరేసేటోళ్లు

V Srinivas Goud | కాంగ్రెస్ నేతల మోసాల‌కు వేరే దేశాల్లో అయితే ఉరేసేవార‌ని.. వాళ్ల‌ను చూస్తేనే ప్ర‌జ‌లు విసుక్కుంటున్నారని మాజీ మంత్రి వీ శ్రీ‌నివాస్ గౌడ్ (V Srinivas Goud) విమ‌ర్శించారు.

S

Telangana | Published On Nov 17, 2026, 2.56 pm IST

V Srinivas Goud | కాంగ్రెస్ నేతల మోసాలకు వేరే దేశాల్లో అయితే ఉరేసేటోళ్లు
Advertisement
  • వాళ్ల‌ను చూస్తేనే ప్ర‌జ‌లు విసుక్కుంటున్న‌రు
  • కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఊరూరా చర్చ పెట్టి వెంటాడుతం
  • మాజీ మంత్రి వీ శ్రీ‌నివాస్ గౌడ్ ధ్వ‌జం

V Srinivas Goud | త్రినేత్ర న్యూస్‌: కాంగ్రెస్ నేతల మోసాల‌కు వేరే దేశాల్లో అయితే ఉరేసేవార‌ని.. వాళ్ల‌ను చూస్తేనే ప్ర‌జ‌లు విసుక్కుంటున్నారని మాజీ మంత్రి వీ శ్రీ‌నివాస్ గౌడ్ (V Srinivas Goud) విమ‌ర్శించారు. దొంగ హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చ‌రించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో (Congress Manifesto) మీద ఊరూరా చ‌ర్చ పెట్టి వెంటాడుతామ‌న్నారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ రేవంత్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కేటీఆర్ ప్రజల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం మెడలు వంచుతున్నారన్నారు.

తెలంగాణ‌ను ప‌త‌నం అంచుకు చేర్చిర్రు

మేనిఫెస్టో అంటే ఐదేళ్లకు అమలు చేసే పత్రం. కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లోనే అన్ని చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ప్రజలను దగా చేశారు. పతాక స్థాయికి చేరుకున్న తెలంగాణను పతనం అంచుకు చేర్చారు. రాహుల్ గాంధీ మొన్ననే హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు గుర్తు లేవా? అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్లి రాహుల్ నిరుద్యోగులతో కలిసి ఎందుకు చాయ్ తాగలేదు? అన్ని వర్గాలను మోసం చేసినట్టే ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేశారు. ఇంతగా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలా.. దేశంలోనే కాదు ప్రపంచంలో మరొకటి లేదేమో.

మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తున్నం

సెలవు పెడితే ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేయాలని బెదిరిస్తారా? దమ్ముంటే సస్పెండ్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్నే ప్రజలు సస్పెండ్ చేస్తారు. 750 టీఎంసీల గోదావరి నీళ్లను ఏపీకి తరలించారు. 250 టీఎంసీల కృష్ణా నీళ్లను ఏపీకి ధారాదత్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ మేనిఫెస్టోను చింపివేసి చెత్తబుట్టలో వేయాలని కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకుంటున్నట్టే కాంగ్రెస్ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తున్నాం. సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారు. దమ్ముంటే జీతం కట్ చేయమనండి.. సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది అని శ్రీ‌నివాస్ గౌడ్ భ‌రోసా ఇచ్చారు.

అనంత‌రం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతున్నది. కేటీఆర్ సభలు పెట్టిన‌ప్పుడల్లా ప్రభుత్వం హడావుడి చేసి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకుంటోంది. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేడ్కర్ సిద్ధాంతాన్ని బీఆర్ఎస్ అక్షరాల అమలు చేస్తోంది.

ఈ ప్రెస్ మీట్‌లో మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, భూపాల్ రెడ్డి, మెతుకు ఆనంద్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బీఆర్ఎస్‌వీ రాష్ట్ర‌ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement