Peddi Sudarshan Reddy | ప్రజల కోసం అహర్నిశలు కృషిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి..
Peddi Sudarshan Reddy | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిస్వార్థంగా పోరాడిన ఉద్యమకారుడు, ప్రజా నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మృతిపట్ల అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో తెలంగాణ (Telangana) ప్రజాప్రతినిధులు, ప్రవాస భారతీయులు సంతాపం వ్యక్తం చేశారు.
Peddi Sudarshan Reddy | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిస్వార్థంగా పోరాడిన ఉద్యమకారుడు, ప్రజా నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మృతిపట్ల అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో తెలంగాణ (Telangana) ప్రజాప్రతినిధులు, ప్రవాస భారతీయులు సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభల్లో పాల్గొనేందుకు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సీ. లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్. రాజేందర్ రెడ్డి, రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఇతర నాయకులు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ వెళ్లారు. ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్త తెలియడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. `తెలంగాణ ఉద్యమంలో నాతో కలిసి ఎన్నో పోరాటాలు చేసిన ఆత్మీయ సహచరుడిని కోల్పోవడం ఎంతో బాధాకరం. ఉద్యమం కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన అరుదైన వ్యక్తిత్వం సుదర్శన్ రెడ్డిది. ఆయన లేని లోటు తెలంగాణ సమాజానికి ఎప్పటికీ తీరనిది` అన్నారు.
తెలంగాణ ఉద్యమానికి పెద్ది సుదర్శన్ రెడ్డి అందించిన సేవలు మరువలేనివని మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి చెప్పారు. ఉద్యమ కాలంలో ఆయన చూపిన నిబద్ధత, ప్రజల పట్ల ఆయనకున్న అంకితభావం యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన యోధుల చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు శాసనసభలో సుదర్శన్ రెడ్డి ప్రవర్తనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒకే ఒక్క సభ్యుడిగా ఉన్నప్పటికీ హుందాతనం, విషయ పరిజ్ఞానం, ప్రజా సమస్యలపై ఆయన ప్రదర్శించిన చిత్తశుద్ధి అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర గౌరవాన్ని కాపాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక..
సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాజకీయాలను చూసిన నాయకులు చాలా అరుదని, అలాంటి అరుదైన నాయకత్వం కలిగిన వ్యక్తిని తెలంగాణ కోల్పోయిందని అన్నారు. ఆయన ఆశయాలను భావితరాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి దశలోనూ సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చెప్పారు. ఉద్యమకారులకు ఆయన అందించిన మార్గదర్శకత్వం ఎప్పటికీ మరువలేనిదని, తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రతీకగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఉద్యమం కోసం ఆయన చేసిన త్యాగాలు, ప్రజలతో మమేకమైన తీరు ప్రతి తెలంగాణవారికి స్ఫూర్తినిస్తాయని అన్నారు. తెలంగాణ పాటల్లో, ఉద్యమ చరిత్రలో ఆయన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని తెలిపారు.
ప్రవాస భారతీయ ప్రముఖులు మహేష్, గుండా అమర్‌నాథ్, భాను ఇల్లెందుల తదితరులు మాట్లాడుతూ.. స్వదేశానికి దూరంగా ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమ నాయకులను గుర్తు చేసుకోవడం తమ బాధ్యత అని అన్నారు. సుదర్శన్ రెడ్డి వంటి ఉద్యమ యోధుల త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, అలాంటి మహనీయులను భావితరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభలో పాల్గొన్న వారంతా సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ప్రవాస భారతీయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నివాళులు అర్పించారు.
తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తీవ్ర గుండెపోటుతో చికిత్స పొందుతూ పరమపదించిన సందర్భంగా అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, సి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి,… pic.twitter.com/bqFLncmYTl
— V Srinivas Goud (@VSrinivasGoud) August 1, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Priyanka Chopra | ప్రియాంక చోప్రా తమిళ మూవీ - దళపతి విజయ్ హీరో - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్
- ●Akbaruddin Owaisi | నా వయసైపోయింది.. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత
- ●ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!
- ●Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..
- ●CM Revanth Reddy | కొత్త ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు సమకూర్చండి

Priyanka Chopra | ప్రియాంక చోప్రా తమిళ మూవీ - దళపతి విజయ్ హీరో - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్

Akbaruddin Owaisi | నా వయసైపోయింది.. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత

ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!




