త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Men’s Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూప‌ర్ విక్ట‌రీ.. ఒలింపిక్స్‌కు అర్హ‌త‌

Men's Hockey Team | ఆసియా క్రీడల్లో భారత మెన్స్ హాకీ జట్టు సత్తా చాటింది. మలేసియాపై 5-1 తేడాతో ఘన విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో 2028 లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు భారత్ నేరుగా అర్హత సాధించింది.

P

Sports | Published On Oct 3, 2026, 6.41 pm IST

Men’s Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూప‌ర్ విక్ట‌రీ.. ఒలింపిక్స్‌కు అర్హ‌త‌
Advertisement

Men's Hockey Team | ఆసియా క్రీడల్లో భారత మెన్స్ హాకీ జట్టు సత్తా చాటింది. మలేసియాపై 5-1 తేడాతో ఘన విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో 2028 లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు భారత్ నేరుగా అర్హత సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలో భారత పురుషుల జట్టు వరుసగా రెండోసారి స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి. 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లోనూ భారత్ గోల్డ్ మెడల్ గెలిచింది. అదే సమయంలో ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు ఒకేసారి స్వర్ణ పతకాలు సాధించడం కూడా ఇదే తొలిసారి.

తొలి క్వార్టర్‌లో హోరాహోరీ

మ్యాచ్ ఆరంభంలో భారత్ కాస్త డిఫెన్స్‌మోడ్‌లో ఆడింది. ఆ తర్వాత దూకుడు పెంచింది. భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా గోల్‌గా మలచలేకపోయింది. 11వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ లభించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ దాన్ని గోల్‌గా మలిచి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. అయితే, మూడు నిమిషాలకే మలేసియా బదులిచ్చింది. షెలో సిల్వేరియస్ ఫీల్డ్ గోల్‌తో స్కోరును 1-1తో సమం చేశాడు. రెండో క్వార్టర్‌లో ఇరు జట్లు దూకుడుగా ఆడాయి. ఈ సమయంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను జుగ్‌రాజ్ సింగ్ 23వ నిమిషంలో గోల్‌గా మలిచాడు. దీంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మలేసియా దాడులు చేసినప్పటికీ భారత రక్షణ శ్రేణి వాటిని సమర్థంగా అడ్డుకుంది. దీంతో హాఫ్‌టైమ్‌కు భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది.

మూడో క్వార్టర్‌లో హార్దిక్ గోల్

మూడో క్వార్టర్‌లో భారత్‌కు పలు అవకాశాలు వ‌చ్చాయి. అయితే, వాటిని గోల్స్‌గా మలచడంలో ఆటగాళ్లు విఫలమయ్యారు. జుగ్‌రాజ్ పెనాల్టీ కార్నర్‌ను కోల్పోగా.. నీలకంఠ ఫీల్డ్ గోల్ ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. తర్వాత భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించింది. హర్మన్‌ప్రీత్ ప్రయత్నించిన బంతి మలేసియా ఆటగాడికి తగిలిందంటూ భారత్ అప్పీల్ చేసింది. రీప్లేలో బంతి స్టిక్‌కు తగలలేదని తేలింది. ఆ తర్వాత మరో పెనాల్టీ లభించగా.. బంతి మలేసియా ఆటగాడికి తగలడంతో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ దక్కింది. 42వ నిమిషంలో హార్దిక్ సింగ్ దాన్ని గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు.

చివరి క్వార్టర్‌లో రెండు గోల్స్

నాలుగో క్వార్టర్‌లో ఆధిక్యాన్ని మరింత పెంచడంపై భారత్ దృష్టి పెట్టింది. మలేసియా తప్పిదాలను భారత ఆటగాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. వరుసగా పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ మలేసియా డిఫెన్స్ టీమ్ గట్టిగా ఎదురొడ్డి నిలిచింది. 54వ నిమిషంలో షిలానంద్ లక్రా ఫీల్డ్ గోల్‌తో భారత్ ఆధిక్యాన్ని 4-1కి పెంచాడు. అనంతరం మరో పెనాల్టీ కార్నర్ లభించగా.. 57వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ దాన్ని గోల్‌గా మలిచాడు. దీంతో భారత్ 5-1 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నిమిషాల్లో మలేసియా పుంజుకునేందుకు ప్రయత్నించినా.. భారత ఆటగాళ్లు అవకాశం ఇవ్వలేదు.

హర్మన్‌ప్రీత్, మన్‌ప్రీత్ అరుదైన ఘనత

ఈ స్వర్ణంతో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. వరుసగా రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత హాకీ కెప్టెన్‌గా నిలిచాడు. మరోవైపు మన్‌ప్రీత్ సింగ్ మూడు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. 2014, 2023 ఆసియా క్రీడల్లోనూ మన్‌ప్రీత్ గోల్డ్ మెడ‌ల్స్‌ను నెగ్గాడు.

Advertisement
Advertisement