త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | ఉచిత విద్యుత్తును ర‌ద్దు చేసేందుకే ‘రైతు డిస్కం’: మాజీ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి

Niranjan Reddy | ఉచిత విద్యుత్తును ర‌ద్దు చేసేందుకే కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతు డిస్కం తీసుకొస్తుంద‌ని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి, జ‌గ‌దీశ్‌రెడ్డి విమ‌ర్శించారు. రేవంత్ స‌ర్కార్‌ ప్రతిపాదించిన ప్రత్యేక రైతు డిస్కం ఆలోచనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On May 29, 2026, 5.15 pm IST

Niranjan Reddy | ఉచిత విద్యుత్తును ర‌ద్దు చేసేందుకే ‘రైతు డిస్కం’: మాజీ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి
Advertisement
  • త‌క్ష‌ణం వెన‌క్కి తీసుకోవాలి
  • విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను విభ‌జించే కుట్ర జ‌రుగుతోంది
  • ఈఆర్సీ అనుమ‌తి లేక‌ముందే రైతు డిస్కం ప్ర‌క‌టించ‌డం స‌రికాదు
  • ఈఆర్సీ ముందు వాదనలు వినిపించిన మాజీ మంత్రులు

Niranjan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఉచిత విద్యుత్తును ర‌ద్దు చేసేందుకే కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతు డిస్కం తీసుకొస్తుంద‌ని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి, జ‌గ‌దీశ్‌రెడ్డి విమ‌ర్శించారు. రేవంత్ స‌ర్కార్‌ ప్రతిపాదించిన ప్రత్యేక రైతు డిస్కం ఆలోచనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు డిస్కం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈఆర్సీ ముందు పార్టీ తరఫున వారు తమ వాదనలు వినిపించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ప్రైవేటీక‌ర‌ణ‌కు మార్గం వేయ‌డ‌మే..

ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తున్న మూడో డిస్కామ్ ప్రతిపాదన వెనుక అసలు ఉద్దేశం రెగ్యులర్ ఆదాయం వచ్చే వినియోగదారులను ఒకవైపు, సబ్సిడీ పొందే రైతు కనెక్షన్లను మరోవైపు వేరు చేసి, భవిష్యత్తులో ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయడమేనని ఆరోపించారు. ఇది విద్యుత్ వ్యవస్థను విభజించి రైతులను ఒంటరిగా చేసే ప్రమాదకర చర్య అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతన్నలకు అందుతున్న 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేసేందుకే కాంగ్రెస్ కుట్రలు చేస్తోంద‌ని వారు మండిపడ్డారు.

ఉరి డిస్కం..

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల‌నుకున్న "రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ" నిజానికి రైతుల ప్రయోజనాల కోసం కాదని, రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్‌ను క్రమంగా ఎత్తివేసి విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు రూపొందించిన కుట్రలో భాగమని ఆరోపించారు. రైతు డిస్కామ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న సంస్థ రైతులను చీకట్లలోకి నెట్టే "ఉరి డిస్కామ్"గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడో డిస్కామ్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) నిర్వహించిన ప్రజా విచారణలో పాల్గొని తమ అభ్యంతరాలను నమోదు చేసినట్లు తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతులకు, గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా అందించామని గుర్తు చేశారు. 2017లో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రారంభించి, ఐదేళ్లపాటు ఎటువంటి అంతరాయం లేకుండా విజయవంతంగా అమలు చేశామని పేర్కొన్నారు.

ప్రభుత్వం మూడో డిస్కం అవసరాన్ని సమర్థించేందుకు చెబుతున్న కారణాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయన్నారు. రైతుల పేరుతో విద్యుత్ చౌర్యాలు జరుగుతున్నాయని ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు రైతాంగాన్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నమని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులపై మోపిన ముద్రను ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పునరావృతం చేస్తోందని మాజీ మంత్రులు విమర్శించారు.

Advertisement
Advertisement