ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ వారి విగ్రహాల్లేవు.. ఆంధ్రా నేతల విగ్రహాలు అవసరమైనప్పుడు తీసేద్దాం.. అమరజ్యోతిని పట్టించుకోవడం లేదు.. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే.. అప్పుడే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలి.. సికింద్రాబాద్ జిల్లా కావాలని కేటీఆర్ అడగడం విచిత్రం ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు Kavitha | త్రినేత్ర.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ అనేది గుంపు మేస్త్రీ, గుంట నక్క ఆడుతున్న డ్రామా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంపు మేస్త్రీ, గుంట నక్క కలిసే ఉన్నారు అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత ప్రసంగించారు. ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆయన నడిచిన మార్గంలోనే మనం నడుస్తున్నాం. ముచ్చర్ల సత్యనారాయణ లాంటి వారి గురించి కొత్తతరం నాయకులకు తెలియాల్సి ఉంది. ఈ విషయంలో తెలంగాణ జాతి మొత్తాన్ని జాగృతం చేసేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. నేను బీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి ముచ్చర్ల జయంతి గురించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం జరిగింది. తెలంగాణ ఫస్ట్ అన్నదే మా నినాదం. తెలంగాణ మంచి కోసం పనిచేసిన వారు ఏ పార్టీలో ఉన్న వారి స్ఫూర్తిని తీసుకుంటాం. వారి మంచి గురించి మేము కచ్చితంగా మాట్లాడుతాం. గత ప్రభుత్వంలో ముచ్చర్ల లాంటి ఎంతో మంది ఉద్యమకారులు విస్మరణకు గురవటం బాధాకరం. దేశపతి శ్రీనివాస్‌తో కలిసి రవీంద్ర భారతిలో తెలంగాణ తేజోమూర్తుల జయంతులు, వర్థంతులు జరపటం కోసం నా వంతు ప్రయత్నం చేశాను. దురదృష్టం ఏమిటంటే ఇప్పటికీ కూడా ట్యాంక్ బండ్‌పై మన తెలంగాణ వారి విగ్రహాలు లేవు. ఆంధ్రా నాయకుల విగ్రహాలు తీసేయమనటం లేదు. అవసరమైన నాడు తప్పకుండా తీసేద్దాం. కానీ మన తెలంగాణ వారి విగ్రహాలు కచ్చితంగా ట్యాంక్ బండ్‌పై ఉండాలి. జాగృతిలో యంగ్ స్టార్స్ ఉన్నారు. వారంతా కూడా ఉద్యమకారుల విగ్రహాలు చూసి స్ఫూర్తి పొందుతారు. ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహాం ట్యాంక్ బండ్ వద్ద పెట్టాలి అని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి తప్పకుండా ఒక రోజు అధికారంలోకి వస్తుంది అమరజ్యోతికి అవినీతి మరకలు అంటాయని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు దానిపై విచారణ జరపలేదు. అమరజ్యోతిని పట్టించుకోవటం లేదు. తెలంగాణ ఉద్యమకారుల జయంతి, వర్ధంతులు జరపటం లేదు. తెలంగాణ జాగృతి తప్పకుండా ఒక రోజు అధికారంలోకి వస్తుంది. అప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమం తొలి అమరుడు శ్రీకాంతా చారి జయంతి, వర్థంతిని అధికారికంగా ప్రభుత్వపరంగా నిర్వహిస్తాం. తెలంగాణ వాదానికి సెంటర్ పాయింట్‌గా అమరజ్యోతిని కేంద్రం చేస్తాం. తెలంగాణ విద్యార్థులందరికీ ఉద్యమకారుల త్యాగాలను తెలిసేలా చేస్తాం. సామాజిక తెలంగాణ కోసం ముచ్చర్ల ఎంతో కృషి చేశారు. ఆయన బాటలోనే మనం నడవాలి. ముచ్చర్ల సత్యనారాయ ముల్కీ ఉద్యమం నుంచి తొలి, మలి దశ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు.తెలంగాణలో ఉద్యమంలో ఎంతో మంది అన్ సంగ్ హీరోలు ఉన్నారు. వారి చరిత్ర కూడా భవిష్యత్ తరాలకు తెలిసేలా ప్రయత్నం చేస్తాం అని కవిత పేర్కొన్నారు. బీసీల కోసం బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించటం లేదు? బీసీలకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్యాయం చేసింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్ మాట ఎత్తకుండానే ముందుకు వెళ్తోంది. ఈ విషయాన్ని బీసీలు ప్రశ్నించకుండా ఉండేందుకు గుంపుమేస్త్రీ, గుంటనక్క కలిసి డ్రామా చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కావాలనే ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. గుంపు మేస్త్రీ, గుంటనక్క కలిసే ఉన్నారు. ఈ విచారణ ద్వారా ఏమీ జరగదు. నాలాంటి బాధితులకు ఏమాత్రం న్యాయం జరిగే అవకాశం లేదని నాకు తెలుసు. మున్సిపల్ ఎన్నికలు పట్టణాల్లో జరుగుతాయి కనుక ప్రజలను డైవర్ట్ చేయటానికే ఈ డ్రామా. అసలు బీసీల కోసం బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించటం లేదు? మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ కూడా 42 శాతం రిజర్వేషన్లు రావటం లేదు. కాంగ్రెస్ బీసీలకు న్యాయం చేయాలన్న విషయాన్నే ఆలోచించటం లేదు. కచ్చితంగా ఈ రెండు పార్టీలు బీసీలను మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గ్రహించాలి. మున్సిపల్ ఎన్నికలకు తొందరేమీ లేదు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు వెళ్లాలి. మెజార్టీగా ఉన్న ప్రజలకు రాజ్యాధికారం ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది అని కవిత తెలిపారు. బీసీ బిడ్డలను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేస్తోంది.. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరించలేదు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, యువత, మహిళలు ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే వారికి మద్దతిస్తాం. నాతో పాటు జాగృతి నాయకులు వారి కోసం ప్రచారం నిర్వహిస్తాం. రాజకీయాల్లోకి రావాలనుకునే యువత, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మున్సిపల్ ఎన్నికలు ఉపయోగించుకోండి. రాజకీయ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు మీ ట్రైనింగ్‌గా ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి. యువత, మహిళలు, బీసీలు, ఎస్సీ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నా. బీసీ బిడ్డలను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేస్తోంది అని కవిత మండిపడ్డారు. కేటీఆర్ అడగటం విచిత్రంగా ఉంది.. సికింద్రాబాద్ జిల్లా కావాలని అడిగిన వాళ్లను గత పదేళ్లలో బీఆర్ఎస్ అణిచివేసింది. కానీ ఇప్పుడు మాత్రం సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా కావాలని కేటీఆర్ అడగటం విచిత్రంగా ఉంది. జిల్లాల పునర్విభజన అనేది ఇప్పుడు జరగటం సాధ్యం కాదు. కానీ ఎప్పుడు పునర్విభజన జరిగిన సరే సికింద్రాబాద్‌ను జిల్లా చేయాల్సిందే. అదే విధంగా పీవీ పేరును ఏదైనా ఒక జిల్లాకు పెట్టాలి అని కవిత డిమాండ్ చేశారు.