త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌ది స్వ‌తంత్ర ప్ర‌భుత్వాన్నా..? సామంత ప్ర‌భుత్వాన్నా..?

Harish Rao | జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సహా ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్యకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.

S

Telangana | Published On Feb 18, 2026, 7.56 pm IST

Harish Rao | తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌ది స్వ‌తంత్ర ప్ర‌భుత్వాన్నా..? సామంత ప్ర‌భుత్వాన్నా..?
Advertisement

గ్యారెంటీల‌న్నీ గాలికి పోయాయి..
హామీల‌న్నీ నీటి మూట‌ల‌య్యాయి..
డిక్ల‌రేష‌న్ల హామీల‌న్నీ ఎక్క‌డ‌..?
నిరుద్యోగుల భ‌విష్య‌త్‌తో చెల‌గాటం..
పూట‌కో కుంభ‌కోణంతో ప్ర‌జాధనం లూటీ..
రేవంత్ తీరు రాష్ట్రానికి గ్ర‌హ‌పాటు..
కాంగ్రెస్ స‌ర్కార్ తీరుపై హ‌రీశ్‌రావు బ‌హిరంగ లేఖ‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సహా ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్యకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.

లేఖలోని ముఖ్యాంశాలు..

  • తెలంగాణ క్యాబినెట్‌ను ఢిల్లీకి పిలిపించుకుని మీరు చేయబోయే 'సమీక్ష'ను చూస్తుంటే.. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటోంది.
  • స్వయం పాలన కోసం, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం.. ఇవాళ మీ ఢిల్లీ దర్బార్‌లో మోకరిల్లడం ఈ నేల ఆత్మగౌరవాన్ని భంగపరుస్తున్నది.
  • తెలంగాణ ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నది ఒక స్వతంత్ర ప్రభుత్వాన్నా? లేక మీ ఢిల్లీకి గులాంగిరి చేసే సామంత ప్రభుత్వాన్నా? అని ప్రజలు వాపోతున్నారు.
  • ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న మీకు, ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి ఇచ్చిన మీ హామీలను గుర్తు చేస్తున్నాను.
  • వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇప్పటికే రెండేన్నరేండ్లు గడిచింది.
  • మిగిలిన కొద్ది కాలంలో అయినా మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి త్వరగా నెరవేర్చాలని, ఆ దిశగా మీ ముఖ్యమంత్రికి హితబోధ చేయాలని కోరుతున్నాను.

బిల్లు నిల్ల‌యింది.. విశ్వాసం కిల్ల‌యింది..

  • మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని మీరు హామీ ఇచ్చారు.
  • తీరా చూస్తే బిల్లు ‘నిల్లయింది’, ప్రజల విశ్వాసం 'కిల్లయింది'.
  • ఈ ప్రజా విద్రోహానికి క్షమాపణలు చెబుతూ మీ సమీక్ష ప్రారంభించండి.
  • సోనియా గాంధీ గారూ.. ఆరు గ్యారెంటీల అమలుకు మీరు స్వయంగా హామీ పడుతూ బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టి ప్రజల ఓట్లు పొందారు.
  • మీ ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల ఆ బాండులకు విలువ లేకుండా పోయింది. అవి నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాకుండా పోయాయి.

హామీల‌న్నీ నీటి మూట‌లు..

  • రాహుల్ గాంధీ గారూ.. వరంగల్ రైతు డిక్లరేషన్ లో మీరు ఇచ్చిన హామీలను మీరే విస్మరించారు. వాటిని మీకు మళ్లీ గుర్తు చేస్తున్నాను.
  • రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, కౌలు రైతులకు కూడా రైతు భరోసా లబ్ది చేకూర్చుతామని, ఉపాధి హామి కూలీలకు ఏడాదికి 12వేలు ఇస్తామని, అన్ని రకాల పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లిస్తామని, పంట బీమా కల్పిస్తామని నమ్మబలికారు.
  • ఇప్పుడు ఈ హామీలన్నీ నీటి మూటలు అయ్యాయి. రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టారు, రెండు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టారు, పంట బోనస్ ఒక పంటకే పరిమితం చేసారు, పంట బీమా అటకెక్కించారు.
  • నమ్మిన రైతులను నట్టేట ముంచిన మీ ప్రభుత్వ నయవంచనపై సమీక్ష చేస్తారా?

నిరుద్యోగుల భ‌విష్య‌త్‌తో చ‌ల‌గాటం..

  • ప్రియాంక గాంధీ గారూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి క్రమం తప్పకుండా ఖాళీలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు 4000 భృతి ఇస్తామని, 18 ఏళ్లు పై బడిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని సరూర్ నగర్ స్టేడియంలో ఆర్బాటంగా ప్రకటించారు. అంతే సౌకర్యంగా విస్మరించారు.
  • ఇందులో ఏ ఒక్క హామీ అమలు కాక పోగా, నిరుద్యోగుల మీద దమనకాండ జరుపుతున్నది ఘనత వహించిన మీ రేవంతు ప్రభుత్వం.
  • యువత, నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేసి, వాళ్ల భవిష్యత్తుతో చలగాటం ఆడుతున్న మీ కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి మీరు బాధ్యులు కాదా? దీనిపై సమీక్ష చేస్తారా? ప్రజలకు సమాధానం చెబుతారా?

ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్ హామీలు ఎక్క‌డ‌..?

  • మల్లికార్జున ఖర్గే గారూ.. ఎస్సీల రిజర్వేషన్లు 18శాతానికి పెంచుతామని, అన్ని ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్లలో, కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో అనేక హామీలు గుప్పించారు. అమలు చేయక తప్పించారు.
  • దళిత బిడ్డలను దగా చేసి ఓట్లు దండుకున్న మీ నమ్మక ద్రోహంపై ఏమని సమీక్ష చేసుకుంటారు?
  • ఇంకా చెప్పాలంటే 420 హామీలను ప్రస్తావించాలి, వాటన్నింటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
  • రాష్ట్రంలో ప్రజలు నానా రకాల పాట్లు పడుతున్నారు. సజావుగా ఎరువులు కూడా సప్లై చేయలేని మీ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు అనేక తిప్పలు పడ్డారు.

రేవంత్ తీరు రాష్ట్రానికి గ్ర‌హ‌పాటుగా మారింది..

  • ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ, పాలన గాలికి వదిలేస్తూ ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న ముఖ్యమంత్రి వైఖరితో తెలంగాణ బతుకు తెల్లారిపోతున్నది.
  • ప్రశ్నించే గొంతులను అణిచివేస్తూ పరమ బూతు, రోత ప్రసంగాలతో చెలరేగి పోతున్న ముఖ్యమంత్రిని చూసి సభ్య సమాజం తలదించుకుంటున్నది.
  • ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా బిఆర్ఎస్ సర్కారు అందించిన సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇచ్చి, ప్రజా ప్రయోజనాలను కాలరాస్తున్న మీ ముఖ్యమంత్రి తీరు రాష్ట్రానికి గ్రహపాటుగా మారింది.

చావు డ‌ప్పు మోగిస్తున్న‌ది కాంగ్రెస్ ప్ర‌భుత్వం..

  • బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, దళిత బంధు, బీసీ బంధు, కంటి వెలుగు, చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ, మన ఊరు మన బడి, సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం, రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి అనేక సంక్షేమ పథకాలను వచ్చిరాగానే నిలిపేసాడు. ప్రజా సంక్షేమ దీపాన్ని మలిపేసాడు.
  • ఫీజు రియింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయక 20లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది మీ కాంగ్రెస్ పాలన.
  • కేసీఆర్ గారి పాలనలో చదువులమ్మ గుడులుగా పేరుపొందిన గురుకులాల్లో నేడు చావు డప్పు మోగిస్తున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వం.

పూట‌కో కుంభ‌కోణంతో ప్ర‌జా ధ‌నం లూటీ..

  • మొదటి ఏడాదిలోనే మీరు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారని రెండేళ్ల తర్వాత ప్రశ్నించిన పాపానికి, చదువుల తల్లి నిలయమైన లైబ్రరీలోకి పోలీసుదళాలను పంపి, నిరుద్యోగుల వీపులు పగులగొట్టిన మీ ప్రభుత్వ పాపాలకు నిష్కృతి ఏమిటో నిజాయితీగా సమీక్షించండి.
  • స్కీంలేవి లేకపోగా స్కాములు మాత్రం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి.
  • జాబుల క్యాలెండర్ లేదు గానీ, స్కాముల క్యాలెండర్ సరిగ్గా అమలవుతుంది.
  • హిల్ టీపీ స్కాం, సింగరేణి స్కాం, సోలార్ పవర్ స్కాం, సివిల్ సప్లై స్కాం, ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కాం, ఇసుక స్కాం, ఎక్సైజ్ స్కాం, ఆర్టీసీ స్కాం, అమృత్ స్కాం, కేఎల్ఎస్ఆర్ స్కాం, లగచర్ల-హెచ్ సీ యూ ల్యాండ్ స్కాం, పీజీ మెడికల్ సీట్స్ స్కాం..
  • పూటకో కుంభకోణంతో ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నది మీ ప్రభుత్వం.
  • క్రోనీ కాపిటలిజంకు తెలంగాణను కాపిటల్ గా మార్చింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం.
  • అక్రమంగా అనుయాయులకు టెండర్లు కట్టబెడుతూ వేల కోట్ల రూపాయలను దొడ్డి దారిన దండుకుంటున్నది మీ దోపిడీ ప్రభుత్వం.

ఢిల్లీలో ఒక మాట‌.. గ‌ల్లీలో ఒక చేత‌..

  • తెలంగాణ ప్రజాధనం ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాలకు 'ఎరువు'గా మారుతోంది.
  • ఆ అవినీతి భారం మోయలేక తెలంగాణ సామాన్యుడి నడుము విరిగిపోతోంది.
  • ఈ సమీక్షలో మీరు అడిగేది ప్రజలకు ఇచ్చిన మాటల గురించా? లేక మీకు అందుతున్న వాటాల గురించా?
  • ఇందిరమ్మ రాజ్యమా? ఇండ్లు కూల్చే రాజ్యమా?
  • దేశమంతా బుల్డోజర్ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నామని మీరు నీతులు చెబుతుంటే.. ఇక్కడ మీ ముఖ్యమంత్రి పేదల ఇళ్లను బుల్ డోజర్లతో కూల్చివేయిస్తున్నారు.
  • ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక చేత.. ఈ డబుల్ స్టాండర్డ్స్ మీకే చెల్లింది. దీనిపై సమీక్ష చేయాలని కోరుతున్నాను.

కాంగ్రెస్‌ను చరిత్ర క్షమించదు..

  • మీరందరూ ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు.
  • ఎన్నికలు అయిపోగానే ముఖం చాటేసి ఇచ్చిన హామీలను అటకెక్కించారు.
  • రేపు ఢిల్లీలో ‘రెండున్నరేండ్ల రేవంతు పాలన వైఫల్యాలు- అమలు కాని హామీల’పై ప్రధానంగా చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.
  • ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డికి డైరెక్షన్ ఇవ్వడంతో పాటు, స్కాంలపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
  • తెలంగాణ పోరాటాల గడ్డ ఇది ఎన్నటికీ ఢిల్లీకి గులాం కాదు.
  • ఈ గడ్డ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే మీ కాంగ్రెస్‌ను చరిత్ర క్షమించదు.
Advertisement
Advertisement